విదేశీ నోట గ్రేటర్‌ మాట

African Students Migrant For Study in Hyderabad - Sakshi

మహానగరానికి ఫారిన్‌ విద్యార్థుల వలస  

చదువు కోసం 63 దేశాల నుంచి రాక  

ఆఫ్రికా దేశాల నుంచి అత్యధిక మంది

ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు క్యూ..

ఏటా పదివేల మంది నగర బాట

గతేడాది అత్యధికంగా సోమాలియా విద్యార్థులు

సాక్షి,సిటీబ్యూరో: మహానగరానికి విదేశీ విద్యార్థులు వెల్లువెత్తుతున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం అనేక దశాబ్దాలుగా నగరానికి పలు దేశాల నుంచి వలస వస్తున్నారు.  అయితే, ఇటీవలి కాలంలో వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఏటా సుమారు పదివేల మంది విదేశీ విద్యార్థులు నగరంలోని ఉస్మానియా, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయ కళాశాలలు, అనుబంధ కాలేజీల్లో చేరుతుండడం విశేషం. ఇలా సుమారు 63 దేశాలకు చెందిన విద్యార్థులు నగరంలో విద్యనభ్యసిస్తున్న వారిలో ఉన్నారంటే ఇక్కడి చదువుపై వారికున్న మక్కువను అర్థం చేసుకోవచ్చు. వీరిలో అత్యధికులు ఆఫ్రికా ఖండానికి చెందిన 50కి పైగా దేశాల వారే కావడం విశేషం. ఇక అమెరికా, కెనడా, యూకే, చైనాకుచెందిన విద్యార్థులు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నారు.

ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు డిమాండ్‌ అధికం
ఇక్కడి ఉస్మానియా, జేఎన్‌టీయూ పరిధిలోని క్యాంపస్‌ కళాశాలలతో పాటు అనుబంధ కళాశాలలు, డీమ్డ్‌ వర్సిటీలు విదేశీ విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఉద్యోగ అవకాశాలున్న ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసుకున్నవారికి వెంటనే జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో తేలికగా ఉద్యోగవకాశాలు లభిస్తుండడంతో పలువురు విదేశీ విద్యార్థులు ఈ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఎమ్మెస్సీ, ఎంటెక్, బీబీఏ, బీసీఏ, ఇంజినీరింగ్, బీఎస్సీ కోర్సుల్లో ఈ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు కూడా ఈ కోర్సులు బాట వేస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో నగరంలోని పలు కళాశాలలు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండే ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. 

విదేశీ విద్యార్థుల సంఖ్య ఇలా..
గతేడాది వివిధ కోర్సులు అభ్యసించేందుకు నగరానికి వలస వచ్చినవారిలో అత్యధికంగా సోమాలియా దేశానికి చెందిన విద్యార్థులే ఉన్నారు. ఆ దేశం నుంచి 430 మంది విద్యార్థులు నగరంలోని పలు కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సీట్లు పొందారు. ఇక ఆఫ్గనిస్తాన్‌కు చెందిన 182 మంది, యెమన్‌ నుంచి 168 మంది, సూడాన్‌కు చెందిన 131 మంది, ఇరాక్‌ నుంచి 107 మంది, జిబుటీకి చెందిన 59 మంది, అమెరికా నుంచి 14 మంది, యూకే నుంచి ముగ్గురు, కెనడా నుంచి ఐదుగురు, చైనాకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు నగరంలో చదువుకొనేందుకు రావడం గమనార్హం.  

తక్కువ ఖర్చే కారణం  
దక్కన్‌ పీఠభూమిలో అత్యతంత అనుకూల భౌగోళిక, శీతోష్ణస్థితులున్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో విద్యనభ్యసించేందుకు విదేశీ విద్యార్థులు అత్యధికంగా మక్కువ చూపుతున్నారు. అంతర్జాతీయంగా పలు దేశాలతో పాటు.. మన దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి కళాశాలల్లో ఫీజులు, జీవనవ్యయం మధ్యతరగతి వారికి సైతం అత్యంత అందుబాటులో ఉన్నాయి. దీంతో పలువురు నగరానికి వలస వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అత్యధికంగా ఉండే ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు మరిన్ని అందుబాటులోకి వస్తే విదేశీ విద్యార్థులు నగరానికి క్యూ కడతారని అంచనా వేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top