మార్కులు తక్కువ వచ్చాయని ప్రాణాలు తీసుకున్నాడు | Sakshi
Sakshi News home page

మార్కులు తక్కువ వచ్చాయని ప్రాణాలు తీసుకున్నాడు

Published Wed, Mar 28 2018 11:56 AM

9th Class Student Suicide - Sakshi

జిన్నారం(పటాన్‌చెరు): మార్కులు తక్కువగా వస్తున్నాయని, ఇంటి వద్ద బాగా చదివించాలని ఉపాధ్యాయులు ఓ విద్యార్థి తల్లికి వివరిస్తున్న క్రమంలోనే సదరు విద్యార్థి ఇంటికి పరుగులు తీసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుమ్మడిదల మండలం అన్నారంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రశాంత్‌ కథనం ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన ప్రసాద్‌ కుమారుడు జనపాల బాలవసంత్‌రావ్‌(17) స్థానికంగా ఉన్న ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలోని కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

పరీక్షల అనంతరం ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇచ్చే క్రమంలో పాఠశాల యాజమాన్యం మంగళవారం తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మార్కుల లిస్ట్‌ తీసుకునేందుకు బాలవసంత్‌రావు తల్లి పాఠశాలకు వెళ్లింది. తరగతిలో అందరికన్నా తక్కువ మార్కులు వస్తున్నాయని ఇంటి దగ్గర బాగా చదివించాలని ఉపాధ్యాయులు ఆమెకు వివరిస్తున్నారు. అందరికంటే తక్కువ మార్కులు రావడంతో పాటు తన గురించి ఉపాధ్యాయులు తల్లికి వివరిస్తున్నారన్న మనస్తాపానికి గురైన బాలవసంత్‌రావు ఇంటికి పరుగులు తీశాడు.
బాత్రూంలో రాడ్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి కుమారుడితో పాటు పరుగులు తీసి ఇంటికి వెళ్లగా అప్పటికే బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ సంఘటన స్థానికంగా కలిచివేసింది. మృతుడి తండ్రి ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రశాంత్‌ తెలిపారు.     
   

1/1

Advertisement
 
Advertisement