మూడేళ్లు..ఏడుగురు ఎస్సైలు 

7 Sub Inspectors Transffered From Tangallapalli In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : జిల్లాల పునర్విభజన తరువాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటైన కొత్త మండలం అది. పేరు తంగళ్లపల్లి. ఈ మండలానికి ఎస్సై ఎస్‌హెచ్‌వోగా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఠాణాలో పోస్టింగ్‌కు వచ్చిన ఏ ఎస్సై కూడా సగటున ఆరునెలలకు మించి పని చేయడం లేదు. పోలీస్‌శాఖలో ఎస్సై, సీఐ స్థాయిలో విధుల్లో చేరిన అధికారి కనీసం రెండేళ్లపాటు పని చేయడం ఆనవాయితీ. కానీ తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటైన మూడేళ్లలో ఇప్పటికే ఏడుగురు ఎస్సై విధులు నిర్వర్తించడం గమనార్హం. నెల రోజుల కనిష్టకాలం నుంచి గరిష్టంగా 8 నెలలు మాత్రమే ఇక్కడ పని చేయడం గమనార్హం. ఎక్కువకాలం పని చేసిన ఎస్సైగా గురువారం బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఎస్సై వి.శేఖర్‌ రికార్డు దక్కించుకున్నారు. 

ఇసుక దందాతోనే...
సిరిసిల్ల మండలంలో భాగంగా ఉన్న తంగళ్లపల్లిని జిల్లాల పునర్విభజన అనంతరం మండలంగా మార్చిన విషయం తెలిసిందే. సిరిసిల్ల పట్టణాన్ని ఆనుకొని ఉండే మానేరు కాలువ ఇసుక దందాకు పుట్టినిల్లు . తంగెళ్లపల్లి మండలంలోనే మానేరు వాగు ప్రధానంగా సాగుతుండడంతో లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఇక్కడి నుంచి రాష్ట్ర రాజధాని వరకు తరలివెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరేళ్ల సంఘటన ఈ మండలంలోనే జరిగింది. ట్రక్కు ఓనర్లు, ట్రాక్టర్‌ ఓనర్లతోపాటు ఇసుక దందా సాగించే వారికి తంగెళ్లపల్లి మండలం కల్పతరువుగా మారింది.

ఈ నేపథ్యంలో ఇక్కడ ఎస్సై పోస్టింగ్‌కు చాలా డిమాండ్‌ . ఈ పరిస్థితుల్లో వచ్చిన ఎస్సైలు ఆదాయం మీద దృష్టి పెట్టేవారో లేక అధికారుల మాట వినలేదోకానీ... మూణ్నాళ్ల ముచ్చటగానే పని చేసి వెళ్లడం జరుగుతోంది. తమకు సంబంధం లేకుండానే ఇసుక దందా ఉచ్చులోకి వెళ్లడమే ఎస్సైలు ఎక్కువ కాలం పని చేయకపోవడానికి కారణమని పోలీస్‌ ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. 

జిల్లాలో ఒకేసారి ముగ్గురు సీఐల బదిలీలు
ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రక్షాళన దిశగా దృష్టిసారించారు. పోలీస్‌ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలతో ఇటీవల మొదలైన బదిలీల పర్వం కొనసాగుతోంది. ముగ్గురు సీఐలను ఏకకాలంలో బదిలీ చేసిన అధికారులు వారెవరికి పోస్టింగ్‌ ఇవ్వకుండా అటాచ్డ్‌ చేశారు. తాజాగా తంగెళ్లపల్లి ఎస్సై వి.శేఖర్‌ను కూడా స్పెషల్‌ బ్రాంచ్‌ నివేదిక ఆధారంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ బదిలీ చేశారు. ఈ ఎస్సై బదిలీకి కూడా ఇసుక దందానే ప్రధాన కారణం. తదుపరి విచారణ స్పెషల్‌ బ్రాంచ్‌ ద్వారా సాగనుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top