కేసీఆర్‌ మంత్రివర్గం నుంచి ఆరుగురు అవుట్‌! | 6 Ministers Out From  KCR Cabinet | Sakshi
Sakshi News home page

అరడజను మంత్రులకు పదవీ గండం!

Mar 19 2018 12:54 AM | Updated on Aug 15 2018 9:04 PM

6 Ministers Out From  KCR Cabinet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘పనితీరులో వైఫల్యాలరీత్యా ఐదారుగురు మంత్రులకు చిక్కులు తప్పవు.. వారికి మళ్లీ పదవులూ కష్టమే..’  ‘కుంభరాశివారికి మంచి యోగమే ఉంది. ఆ రాశిలో ఉన్నవారికి ఎన్నికల్లో టికెట్లు పొందడం ఇబ్బంది కాకపోవచ్చు!’  ‘విళంబినామ సంవత్సరం రాజు స్థానంలో సూర్యుడు ఉన్నాడు. మంత్రి స్థానంలో శని ఉన్నాడు. ఇద్దరి మధ్యా సహజ వైరం ఉంటుంది. మందగమనంలో ఉండే మంత్రి.. రాజు వేగాన్ని అందుకోలేడు. ఇది రాష్ట్ర పాలకుల్లో కనిపిస్తుంది’  

..ఎన్నికల ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనంలో కనిపించిన కొన్ని ఆసక్తికర చమక్కులివీ! సాధారణంగా పంచాంగంలో వర్షాలు, రైతులు, పంటలు, ప్రజల సుభిక్షం వంటి అంశాలే చర్చకు వస్తుండగా.. ఈసారి రాజకీయాంశాలే కీలకంగా మారాయి. ఆదివారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో శృంగేరీ పీఠం ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ పఠనం నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో హాజరైన ఆహూతుల సమక్షంలో పంచాంగ పఠనం సాగింది. అనంతరం ముఖ్యమంత్రి తన ప్రసంగంలో కూడా టికెట్ల అంశాన్ని ఉటంకించడం, పంచాంగం ముందస్తుగానే పరిస్థితులను సూచనప్రాయంగా తెలుపుతుందని అనడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చిక్కులు ఎదుర్కోనున్న ఆ ఐదారుగురు మంత్రులు ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. 

కేసీఆర్‌కు తిరుగుండదు.. 
రవి, శుక్ర, చంద్రుల సంచారం, లఘ్నాధిపతి బుధుడు కావటంతో రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన దిగ్విజయంగా కొనసాగుతుందని బాచంపల్లి వివరించారు. ఎన్ని విమర్శలు, ఒడిదొడుకులు ఎదురైనా రాజు ఆత్మకారక శక్తి చేత వాటన్నింటిని ఎదుర్కోగలరన్నారు. లఘ్నాన్ని శని వీక్షిస్తున్నందున మధ్యమధ్య కొన్ని చికాకులు తప్పవని, అయితే జగజ్జనని శక్తి చేత రాజే బలవంతుడవుతాడన్నారు. ఇక గురు బలం, సూర్య బలం చేత ఉన్నత యోగస్థానం ఉన్నందున రాష్ట్రంలోనే కాకుండా కేసీఆర్‌ ఎక్కడైనా చక్రం తిప్పగలరని పేర్కొన్నారు.  

కర్కాటక రాశిలో ఉన్నందున సీఎం ఆదాయం 8, వ్యయం 2గాను, రాజపూజ్యం 7 అవమానం 3గా ఉన్నందున ఆయనకు తిరుగు ఉండదన్నారు. ఇదే సమయంలో వృశ్చిక రాశిలో ఉన్నందున ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొన్ని ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రధాని మోదీని ఎదురించి మూడో కూటమి పేరుతో కేసీఆర్‌ సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ పోలిక ప్రాధాన్యం సంతరించుకుంది. 

దేవాదాయశాఖలో అవినీతి 
గురుడు, శుక్రుడి స్థితి వల్ల ధార్మిక కార్యక్రమాల్లో అటంకాలు ఏర్పడతాయని బాచంపల్లి వివరించారు. ఇదే కారణంతో దేవాదాయ శాఖను ఓ ప్రధాన అంశం తీవ్ర చికాకుకు గురిచేస్తుందని, అవినీతి వ్యవహారం బహిర్గతమవుతుందన్నారు. ఓ మఠాధిపతి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే సూచన కనిపిస్తోందని, గతంలో ఉన్నత పదవిలో ఉన్న కీలక వ్యక్తికి అపమృత్యు భయం కలిగిస్తుందన్నారు. 

వానలకు ఢోకా లేదు 
గత సంవత్సరం తరహాలోనే విళంబి నామ సంవత్సరంలో కూడా సమృద్ధిగానే వానలు కురుస్తాయని బాచంపల్లి చెప్పారు. ద్రోణకం పేరుతో ఉండే మేఘం వానలు కురిపిస్తుందన్నారు. ఆ మేఘం ఆక్టోబరు నుంచి మంచి వానలు కురిపిస్తుందని, డిసెంబర్‌లో వరదలు సంభవిస్తాయని చెప్పారు. రైతులు ఆషాఢంలో నాట్లు వేసేప్పుడు ప్రకృతిని అనుసరించాల్సి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం ప్రకృతి ఉపద్రవాలు కూడా పెరుగుతాయని చెప్పారు. పశు నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. దేశీయ ఆవుకు ప్రాధాన్యమిచ్చి శక్తిమంతంగా మారిస్తే క్షీర రాబడి పెరుగుతుందన్నారు. పశు సంపదను రక్షించుకునేందుకు ప్రత్యే దృష్టి అవసరమని చెప్పారు. 

‘ఎరుపు’ విప్లవం 
మకరంలో కుజుడు ఉన్నందున మే 2 నుంచి నవంబర్‌ 6 వరకు ఎరుపు రంగు నేలలు, ధాన్యాలు ఉత్పత్తి, ధరల్లో ఉన్నతంగా ఉంటాయని బాచంపల్లి పేర్కొన్నారు. ఎరుపు నేలల ధరలు బాగా పెరుగుతాయని, బంగారం, వెండి ధరలు కూడా పరుగు అందుకుంటాయని, ఒక్కసారిగా రియల్‌ ఎస్టేట్‌ రంగం పైకి లేచేలా చైతన్య కదలిక వస్తుందని చెప్పారు. గోధుమలు, కందులు, మిరియాలు, గులాబీ రంగు వస్తువుల ధరలకూ రెక్కలొస్తాయని చెప్పారు. బ్యాంకుల ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. 

విడాకులు పెరుగుతాయి 
కుజుడు సంచరించే స్థితి వల్ల కుటుంబాల్లో కలహాలు బాగా పెరుగుతాయని, దంపతుల మధ్య మనస్పర్థలు ఎక్కువై విడాకులు తీసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతుందన్నారు. ఇక మనసులు కలిసిన యువతీ, యువకులే పెళ్లి చేసుకోవాలని, వివాహ విషయంలో తొందరపాటు కూడదని హితవు పలికారు. పర్యాటక రంగం వృద్ధి చెందుతుందని, ఆర్టీసీలో నష్టాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. వినోదం, మీడియా రంగంలో మంచి ఎదుగుదల కనిపిస్తుందని వివరించారు. పురపాలక, భూగర్భ శాఖలు, సాంఘిక సంక్షేమ శాఖ కూడా మంచి పనితీరు కనబరుస్తుందన్నారు. విమానయాన రంగం కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్నారు.  క్రీడల్లో తెలంగాణ మరోసారి మంచి ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుందన్నారు. పోలీసు శాఖ బ్రహ్మాండంగా పనిచేస్తుందని, రక్షణ శాఖ ముందే ఉపద్రవాలను పసిగట్టి నిర్వీర్యం చేసే విషయంలో విజయం సాధిస్తుందన్నారు.  

మహిళదే ఆధిపత్యం 
సైన్యాధిపతి శుక్రుడు కావటం చేత ఈ సంవత్సరం మహిళలు కీలక పాత్ర పోషిస్తారని బాచంపల్లి తెలిపారు. పాలన, ఇంట్లో వారి ఆధిపత్యం కనిపిస్తుందని వెల్లడించారు. వెరసి దీన్ని స్త్రీనామ సంవత్సరంగా అభివర్ణించారు. ఆషాఢ పూర్ణిమ 27–7–2018న మకరరాశిలో శుభ ఫలితాన్ని ఇచ్చే చంద్రగ్రహణం సంభవిస్తుందని పేర్కొన్నారు. 

ఆదివారం మాంసభక్షణ వద్దు. 
ఈ సంవత్సరం రాజు స్థానంలో సూర్యుడు ఉన్నందున ఆయనకు ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం కావటంతో ఆ రోజు మాంస భక్షణ క్షేమకరం కాదని బాచంపల్లి వివరించారు. రాష్ట్ర ప్రజల మంచిని కాంక్షించి ఆదివారం మాంస భక్షణకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.  

వేద పండితులకు సత్కారం 
పంచాంగ శ్రవణం అనంతరం పలువురు వేద పండితులు, పంచాంగ కర్తలను ముఖ్యమంత్రి సన్మానించారు. వేదికపైకి వెళ్లే పరిస్థితిలో లేని వెంకటరమణ శాస్త్రి అనే పండితుడిని సన్మానించేందుకు సీఎం వేదిక దిగి వెళ్లారు. అంతకుముందు భద్రాచల ఆలయ పండితుల ఆధ్వర్యంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. సీఎం, వేదికపైనున్నవారికి పట్టు వస్త్రాలు అందించారు. యాదగిరిగిగుట్ట పంచాంగాన్ని ఆవిష్కరించారు. భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. ‘తీయనైన తెలుగు తెలంగాణ వెలుగు’ ప్యాకెట్‌ పుస్తకాన్ని పంచారు. వచ్చిన ఆహూతులకు పట్టు కండువాలను అందించారు. ఇటీవల శాసనసభ సమావేశాల ప్రారంభం రోజున గాయపడిన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ నల్లటి అద్దాలు ధరించి వచ్చారు. మరోవైపు ఆహ్వాన పత్రాలు ఉన్నవారినే లోనికి అనుమతించటంతో వేడుకలు చూసేందుకు వచ్చిన సాధారణ ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement