పల్లె సీమలో ప్రగతి సీను

30 days schedule completed successfully To Develop Villages In Telangana - Sakshi

ముగిసిన 30 రోజుల ప్రణాళిక

సాక్షి, హైదరాబాద్‌: గ్రామసీమల్లో నూతన మార్పు కోసం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మొదటి విడత 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక శనివారం మంచి ఫలితాల సాధనతో ముగిసింది. పల్లెల్లో చేపట్టిన ఈ పల్లెప్రగతి ప్రణాళిక అమలు తీరు, సాధించిన ఫలితాలు, లోపాలు, లోటుపాట్లపై ఈ నెల10న సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. ఈ భేటీలో రెండో విడత కార్యక్రమం ఎప్పుడు ఎలా, ఏయే మార్పులతో చేపట్టబోయేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించాక పల్లెల్లో వివిధ అంశాల్లో గుణాత్మక మార్పు వచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు జిల్లాలు, మండలాల నుంచి నివేదికలు అందాయి. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించడంతో పాటు అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల్లో ఉమ్మడి భాగస్వామ్యం, జవాబుదారీతనం సాధన దిశలో ఈ ప్రణాళిక విజయవంతమైనదని అధికారులు అంచనావేస్తున్నారు.

ఇవీ 30 రోజుల్లో సాధించినవి
మొత్తం 32 జిల్లాల్లోని 539 మండలాల్లోని 12,753 గ్రామపంచాయతీలకు గాను 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలోని ప్రధాన అంశాల్లో దాదాపుగా అన్ని చోట్లా వివిధ రంగాలకు సంబంధించిన పనులు పూర్తయినట్టుగా అధికారుల నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ఐదు పంచాయతీల్లో మినహా 12,748 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. 12,687 పంచాయతీల్లో 38,061 మంది కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. 
►12,744 పంచాయతీల్లో స్టాండింగ్‌ కమిటీలు
►అందులో 8,20,009 మంది సభ్యుల ఎన్నిక...వారిలో మహిళాసభ్యులు 4,02,965 
►సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీల్లో పాదయాత్రల నిర్వహణ, ఈ పంచాయతీల్లో వార్షిక ప్రణాళికలు తయారీ 
►10,544పంచాయతీల్లో వైకుంఠధామాలు/ శ్మశానాలు ఏర్పాటుకు భూమి గుర్తింపు 
►10,875 గ్రామాల్లో డంపింగ్‌యార్డులఏర్పా టుకు భూమి గుర్తింపు 
►లక్ష ఇళ్లు, ఓపెన్‌ప్లేస్‌లో శి«థిలాల తొలగింపు 
►దాదాపు రెండున్నర లక్షల ప్రదేశాల్లో సర్కార్‌ తుమ్మ,పిచ్చిమొక్కలు, పొదల తొలగింపు 
►లక్ష  ఖాళీ ప్రదేశాల్లోనికామన్‌ ఏరియాల శుభ్రం 
►15,548 పాడుపడిన బావులు, 9,337 ఉపయోగించని బోరువెల్స్‌ మూసివేత 
►1.22 లక్ష ప్రాంతాల్లో పారిశుధ్యం పెంచే చర్యలు, 79,108 ప్రభుత్వసంస్థలు,ప్రదేశాల్లో శుభ్రతా కార్యక్రమాలు 
►పవర్‌వీక్‌లోభాగంగా 90,211 వంగిన, తుప్పుపట్టిన, పాడైన కరెంట్‌స్తంభాలు సరిచేశారు 
►3.36 లక్షల మంది రైతుల పొలాల్లో నాటేందుకు 406 లక్షల మొక్కల సరఫరా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top