2016 ఖరీఫ్‌కు మధ్యమా‘నీరు’

2016 ఖరీఫ్‌కు మధ్యమా‘నీరు’


గంభీరావుపేట/ముస్తాబాద్ : మధ్యమానేరు ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి 2016 ఖరీఫ్ సీజన్‌కు సాగునీరందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల తొమ్మిదో ప్యాకేజీ పనులను వేగవంతం చేసి, ఎగువమానేరుకు పూర్వవైభవం తెస్తామని చెప్పారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు అతిథిగృహంలో జిల్లాస్థాయి నీటిపారుదల ప్రాజెక్టుల సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ముస్తాబాద్ మండలం మద్దికుంటలో ఎగువమానేరు హైలెవెల్ కెనాల్ పనుల మంజూరు సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు బహిరంగ సభలో పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి హాజరయ్యూరు.



ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీలో ఎగువమానేరు నుంచి లింగన్నపేట మీదుగా ఏడు గ్రామాలకు హైలెవెల్ పైపులైన్ మంజూరు చేస్తున్నట్లు హరీశ్‌రావు సభలో ప్రకటించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో రూ.1500 కోట్లతో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని, ఇందుకోసం కాలువల సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పారు. మధ్యమానేరులో వచ్చే వర్షాకాలం మూడు టీఎంసీల నీటిని నిల్వ చేస్తామన్నారు. మధ్యమానేరు నుంచి ఎనభై రోజుల్లో ఎగువమానేరుకు లిఫ్ట్ ద్వారా తొమ్మిది టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. సింగసముద్రం, దమ్మన్నపేట, మలక్‌పేట, పెనం మడుగులను ఆధునికీకరిస్తామన్నారు.



అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నిర్లక్ష్యం, అలసత్వం వదిలేసి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయూలని ఆదేశించారు. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా వేములవాడ నియోజకవర్గంలో 85వేల ఎకరాలకు 17నెలల్లో సాగునీరు అందిస్తామన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో 65 వేల ఎకరాలకు, రామగుండం నియోజకవర్గంలో 20వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉందని చెప్పారు.



సిరిసిల్ల, కరీంనగర్ ప్రధాన రహదారిపై శెభాష్‌పల్లి వద్ద నాలుగులైన్ల బ్రిడ్జి నిర్మాణానికి రూ.170 కోట్ల మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఏడాదిలో పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. ప్రాణహిత-చేవేళ్ల ఎత్తిపోతల పథకం పనుల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, సిహెచ్.రమేష్‌బాబు, బొడిగె శోభ, సోమారపు సత్యనారాయణ, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఆర్డీవో బిక్షానాయక్, ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, సెస్ పర్సన్ ఇన్‌చార్జి దోర్నాల లక్ష్మారెడ్డి, సెస్ డెరైక్టర్ విజయరామారావు, మండల, గ్రామస్థారుు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 

రూ.3.75 కోట్లతో మరమ్మతులు

ముస్తాబాద్ : సిరిసిల్ల మెట్ట ప్రాంతానికి ప్రాణపదమైన ఎగువమానేరు ప్రాజెక్టు కాలువల మరమ్మతు, షట్టర్ల ఏర్పాటుకు రూ.3.75 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ మేరకు జీవో 111 విడుదల చేసినట్లు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా మరమ్మతుకు నోచుకొని ఎగువమానేరు కాలువలు పూడికతో నిండిపోయి ధ్వంసమయ్యూయని అన్నారు. షట్టర్లు శిథిలమై నీరువృథాగా పోతోందన్నారు.



మంత్రి కేటీఆర్ కోరిక మేరకు ఈ పనులకు రూ.3.75 మంజూరు చేసినట్లు చెప్పారు. వారం రోజుల్లో టెండర్లు పూర్తి చేసి పనులు మొదలు పెడుతామన్నారు. ఎగువమానేరు ప్రాజెక్టు ఈఈ కార్యాలయాన్ని కరీంనగర్ నుంచి సిరిసిల్లకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సిరిసిల్లలో నీటిపారుదల ఈఈ కార్యాలయంతోపాటు క్వాలిటీ కంట్రోల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎగువమానేరు హైలెవల్ పైపులైన్ నిర్మాణానికి భూసేకరణ పనులు త్వరలో మొదలుపెడుతామని, ఎస్సీ, ఎస్టీల భూములకు మూడురెట్లు అధికంగా పరిహారం ఇస్తామని వెల్లడించారు.

 

పర్యాటక కేంద్రంగా ఎగువమానేరు

గంభీరావుపేట : మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మానేరు అతిథిగృహంలో నీటి పారుదల ప్రాజెక్టుల సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జలాశయంలో త్వరలోనే బోటింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. మానేరు కాలువల మరమ్మతు పనులకు రూ.3.77 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.



మరో రూ.6 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు. మానేరు అతిథిగృహం ఏళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురవుతుందని, మరమ్మతులు లేవని, గార్డెన్ కళావిహీనంగా తయారైందని నిర్వహణకు నిధులు ఇవ్వాలని కేటీఆర్ మంత్రి హరీష్‌రావుకు విజ‘ప్తి చేశారు. అతిథిగృహాన్ని ఆధునీకరిస్తామని హరీష్‌రావు హామీ ఇచ్చారు. త్వరలోనే అన్ని హంగులతో అతిథిగృహాన్ని తీర్చిదిద్దుతామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top