వృద్ధాప్యంలో లివ్‌ఇన్‌రిలేషన్స్‌.. | Sakshi
Sakshi News home page

పెద్దల పెళ్లికి... పదేళ్లుగా పల్లకి...

Published Tue, Oct 15 2019 10:23 AM

200 Couples live in Relationships in Old Age Hyderabad - Sakshi

సహజీవనం అనేది ఆధునికుల మాట. పెళ్లిని ఇష్టపడని నవ యువత ఎంచుకున్న కొత్త బాట. అయితే దీన్ని అంతకు మించిన విస్తృత ప్రయోజనకారిగా, తమకు సంబంధించిన అత్యుత్తమ సేవా మార్గంగా మార్చుకుంది నగరానికి చెందిన తోడు నీడ సంస్థ. ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సీనియర్‌ సిటిజన్స్‌ని జంటగా మారుస్తున్న ఈ స్వఛ్చంద సంస్థ స్థాపించి పదేళ్లవుతున్న సందర్భంగా  నిర్వాహకురాలు రాజేశ్వరి (70) విశేషాలను  ఇలా పంచుకున్నారు

సాక్షి, సిటీబ్యూరో: మా ప్రయాణానికి పదేళ్లు. ఎటువంటి అంగబలం, అర్ధబలం లేని సంస్థ మాది.   తొలిసారి మా సంస్థ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తెలిసేలా చేసింది సాక్షి. ఆ తర్వాత అన్ని మీడియా సంస్థల మద్దతు వల్ల  ముందుకు వెళ్లగలిగాం. ఈ క్రమంలో  సమాజానికి, కట్టుబాట్లకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థగా దీన్ని ముద్రవేసే ప్రయత్నం చేశారు. వృద్ధాప్యంలో లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌ తప్పు అని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. మొదట్లో ఈ తరహా పెద్దల పెళ్లిళ్లకు పిల్లలే బాగా వ్యతిరేకించేవారు. అయితే ఇప్పుడిప్పుడు వారే తల్లిదండ్రులను తీసుకొస్తున్నారు. ఇది చాలా శుభపరిమాణం. 

20న వార్షికోత్సవం  
తోడు నీడ సంస్థ ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా వార్షికోత్సవాలను ఈ నెల 20న నిర్వహిస్తున్నామని రాజేశ్వరి తెలిపారు. హబ్సిగూడలోని టేస్ట్‌ ఆఫ్‌ ఇండియా హోటల్‌లో ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ వేడుకల్లో  భాగంగా కొత్త సభ్యుల పరిచయ వేదిక, ఉచిత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటందన్నారు. అలాగే సీనియర్‌ సిటిజన్స్‌కు సంబంధించిన సమస్యలుపై అవగాహన కల్పించనున్నామన్నారు. పాత/కొత్త సభ్యులు అందరూ ధృవీకరణ పత్రాలతో మాత్రమే హాజరవ్వాలని కోరారు. వివరాలకు 8106367014 నెంబరుకు ఫోన్‌ చేయాలన్నారు.

లివ్‌ ఇన్‌ ఎందుకంటే...
వృద్ధాప్యంలో పెళ్లిళ్లపై ఆయా వ్యక్తుల కుటుంబాల్లో ఉండే సందేహాల్లో ఆస్తులు, పిల్లలకు దూరమవుతారు అనేవి ప్రధానమైనవి. ఈ సందేహాలను పోగొట్టడానికే మేం లివ్‌ ఇన్‌ రిలేషన్స్‌ను ప్రోత్సహిస్తున్నాం. తొలుత మేం సహజీవనాన్ని ప్రతిపాదిస్తాం... కాదంటే వారిష్ట ప్రకారం పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఎంచుకున్న మార్గం ఏదైనా సరే ఒంటరి వృద్ధులకు తోడు ఏర్పడాలనేదే మా ఆశయం.  పెళ్లి/లివిన్‌ ఏదైనా సరే ఇప్పటికి 200పైగా వృద్ధులను ఒకటి చేశాం. హైదరాబాద్‌లోనే 15 జంటలకు పైగా ఉన్నారు. లివిన్‌ రిలేషన్‌ షిప్‌ని సేవా మార్గంలో ప్రారంభించిన ఏకైక ఎన్‌జిఒ మాది. 

ప్రచారం కావాలి...ప్రయోజనం కలగాలి...

ఈ పెద్దల పెళ్లిళ్లకు సంబంధించి మరింత ప్రచారం చేయాల్సి ఉంది. ఇంకా సామాజిక మూఢనమ్మకం పూర్తిగా పోవడం లేదు.అందుకే మారుమూల జిల్లాల్లో కూడా వీటిని విస్తరించాలని ఆశిస్తున్నాం. దీని కోసం లయన్స్‌ క్లబ్‌లు, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్స్‌ సహకారం తీసుకుని ముందుకెళ్లాలని అనుకుంటున్నాం.    

తోడు తప్పని‘సిరి’...
ఏ వయసులోనైనా మనిషికి తోడు అవసరం. వృద్ధాప్యంలో మరింత తప్పనిసరి. మొత్తం దేశ జనాభాలో 12శాతం వృద్ధులుంటే అందులో 40శాతం ఒంటరిగా ఉంటున్నారు. మరోవైపు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లేవు.  న్యూక్లియర్‌ ఫ్యామిలీ సిస్టమ్‌లో ఎవరికి వారే యమునా తీరే.  భార్యా భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితిలో పిల్లలకి వృద్ధుల బాధ్యతలు మోసే తీరికా ఓపికా ఉండడం లేదు. ఈ పరిస్థితి ఓల్డేజ్‌ హోమ్‌లవైపు ఒంటరి వృద్ధుల్ని నడిపిస్తోంది,  అయితే  ఓల్డేజ్‌ హోమ్‌లో ఉన్నప్పటికీ మన అనే మనిషి లేకపోవడం అనే వెలితి ఎప్పటికీ తీరేది కాదు. ఇంకోవైపు పిల్లలు విదేశాల్లోనో మరో చోట ఉంటున్నప్పుడు ఒంటరి తనం మరింత దుర్భరం... ఒంటరి వృద్ధుడి ఆత్మహత్య, వృద్ధులపై దాడులు, దోపిడీలు... ఇలాంటివి మనం పేపర్లలో తరచు చదువుతున్నాం.  

పెద్దల కోసం...మరింత సాయం...
తోడు అంటే భార్య భర్తలు మాత్రమే కాదు ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు కూడా కలిసి జీవించవచ్చు. అలాగే  తమ వయసు వారితో కలిసి మెలిసి సరదాగా గడపాలనుకునేవారి కోసం మరికొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో బృందంగా ఏర్పడి చేసే ఆనంద యాత్ర ఒకటి. మంచి మంచి ప్రాంతాలకు పర్యటించే అవకాశం దీనిలో ఉంటుంది. అంతేకాకుండా టూర్లలో  ఒకరినొకరు పరిశీలించుకుని నచ్చిన వ్యక్తిని సహచరి/సహచరునిగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలకు ఉన్నట్టే పెద్దల కోసం పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కాలక్షేపం అయ్యేలా డే కేర్‌ సెంటర్స్‌ పెట్టాం. అలాగే  పెళ్లి గురించి పెద్దగా ఆసక్తి లేనివారు కొంత మందితో కలిసి నివసించడాన్ని ప్రోత్సహిస్తూ కమ్యూనిటీ లివింగ్‌ సెంటర్స్‌ ఫర్‌ అడల్ట్స్‌ను ఏర్పాటు చేశాం. 

Advertisement
 
Advertisement
 
Advertisement