కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఎస్. ఆత్మకూరు (నల్లగొండ) : కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా ఎస్. ఆత్మకూరు మండలం కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పాఠశాలలో చదువుతున్న ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు చెందిన 15 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేశాక అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కాగా.. వారిలో నలుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు ఏజెన్సీకి చెందిన కొందరు మహిళలు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండుతున్నారు. ఈ రోజు ఆనపకాయ కూర వండారు. ఇది తిన్న విద్యార్థులే అస్వస్థతకు గురయ్యారని తోటి విద్యార్థులు చెబుతున్నారు.