తెలంగాణలో మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు

15 Corona Positive Cases Registered In Telangana - Sakshi

 వీరంతా ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారి బంధువులే

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి

రాష్ట్రంలో మొత్తం 97కి చేరిన కరోనా కేసులు

తాజా కేసుల వివరాల వెల్లడిపై గోప్యత

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన వారు, వారి బంధువులని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 97కి చేరింది. అందులో ఇప్పటివరకు 14 మంది డిశ్చార్జి కాగా, ఆరుగురు మరణించారు. ప్రస్తుతం 77 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలి పారు. మర్కజ్‌ నుంచి వచ్చిన వారంతా గాంధీ ఆçసుపత్రిలో పరీక్ష చేయించుకోవడానికి రావాలని సోమవారం సీఎం సహా వైద్య, ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. కరోనా లక్షణాలున్న వారు, తమతోపాటు బంధువులను కూడా పరీక్షలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి సహకరించాలని కోరారు. తాజాగా నమోదైన 15 కేసులకు సంబంధించిన వివరాలను వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించలేదు. ఏ జిల్లాకు చెందినవారు? వయసు, ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో వారంతా ఎక్కడి వారనే దానిపై గందరగోళం నెలకొంది. అలాగే, వైద్య ఆరోగ్యశాఖ ఒకరోజు ఇచ్చే బులెటిన్‌కు, మర్నాడు ఇచ్చే బులెటిన్‌కు పొంతన కుదరడం లేదన్న విమర్శలున్నాయి. సమాచారాన్ని స్పష్టంగా ఇస్తే ప్రజలు జాగ్రత్తలు పాటించడానికి అవకాశముంటుందని అంటున్నారు. 

వారిని పోలీసులు అడ్డుకోవద్దు..
డయాలసిస్, తలసీమియా, సికెల్‌ సెల్‌ జబ్బులున్న వారికి రక్తమార్పిడి అవసరమవుతున్నందున వారు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారని ఈటల తెలిపారు. పోలీ సులు వీరిని అడ్డుకోవద్దని సూచించారు. గర్భిణులకు ఇబ్బందులు లేకుండా మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ సెంటర్లు పనిచేస్తాయన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top