రారండోయ్‌..  కైటెగరేద్దాం..

100 Kites Players from 30 countries in hyderabad city - Sakshi

రంగురంగుల పతంగులతో హరివిల్లులా మారనున్న బైసన్‌పోలో గ్రౌండ్‌

30 దేశాల నుంచి 100 మంది కైట్స్‌ప్లేయర్స్‌ రాక

టూరిజం, సాంస్కృతిక శాఖ  ఆధ్వర్యంలో నిర్వహణ

13న ఉపరాష్ట్రపతి వెంకయ్య  చేతుల మీదుగా ఉత్సవాలు ప్రారంభం 

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండగ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఇంటి ముందు రంగురంగుల రంగవళ్లులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలు, కోడి, ఎడ్ల పందాలు, భోగి మంటలు, పిండి వంటలు. వీటన్నిటికంటే పిల్లలు, పెద్దలు ఎక్కువగా ఎంజాయ్‌ చేసేది మాత్రం రంగురంగుల పతంగుల విన్యాసాలతోనే. పతంగుల పేరు వినగానే మనకు గుర్తొచ్చేది భాగ్యనగరమే. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా పతంగుల పండగను మాత్రం హైదరాబాద్‌లో అంగరంగవైభవంగా నిర్వహిస్తారనడంలో సందే హం లేదు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పండగలకు ప్రాధాన్యత పెరిగింది.నాలుగేళ్లుగా టూరిజం, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఈ సారీ 13, 14, 15 తేదీల్లో పండగను వైభవంగా నిర్వహించేందుకు ఆ శాఖలు సిద్ధమయ్యాయి. 

ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం.. 
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ నెల 13న మూడు గంటలకు కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలు ప్రత్యేకంగా ఆయన్ని ఆహ్వానించాయి. కైట్, స్వీట్‌ ఫెస్టివల్‌కు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.  
నోరూరించే తెలంగాణ వంటకాలు.. 
హైదరాబాద్‌లో కైట్‌ ఫెస్టివల్‌ను ఈసారీ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు చెందిన 100 కైట్స్‌ప్లేయర్స్‌ పతంగుల పండగలో పాల్గొననున్నారు. రంగురంగుల పతంగులతో బైసన్‌పోలో, పరేడ్‌ గ్రౌండ్స్‌ హరివిల్లులా మారనున్నాయి. దీనికితోడు భోజనప్రియుల కోసం రాత్రి సమయంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్‌కోర్టులు ఆకర్షణగా నిలవనున్నాయి. అటుకుల ఉప్మా, అరటిపండు కేక్, ఉల్లివడియాలు, కట్టెపొంగలి, స్వీట్‌ కార్న్‌ రైప్, క్యారెట్‌ కేకు, కొత్తమీర చట్నీ, గుమ్మడి కాయ కూర, గొంగూర పచ్చడి, పప్పు, చింతచిరుగు పప్పుతో పాటు వందలాది రాష్ట్ర వంటకాలు నగర వాసులను నోరూరించనున్నాయి. తెలంగాణ వంటకాలపై భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక సంచికను తీసుకురానున్నది. సంచికను సంక్రాంతి రోజు ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో మినీ భారత్‌ సంస్కృతి, సంప్రదాయాలు పరేడ్‌ గ్రౌండ్‌లో కన్పించనున్నాయి. ఇందులో తెలంగాణ కల్చర్‌తోపాటు ఒడిస్సి, బిహు, బెంగాళీ, కథక్, అస్సామీ, కశ్మీరీతోపాటు అన్ని రాష్ట్రాల నృత్య ప్రదర్శనలు ఆకర్షణగా నిలవనున్నాయి. టూరిజం, సాంస్కృతిక శాఖ అధికారులు గురువారం పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top