1,399 చెరువులకు మహర్దశ | 1,399 ponds boom | Sakshi
Sakshi News home page

1,399 చెరువులకు మహర్దశ

Oct 27 2014 4:12 AM | Updated on Sep 2 2017 3:25 PM

తెలంగాణ సర్కారు చిన్న నీటి వనరులపై దృష్టి కేంద్రీకరించింది. చెరువులకు నిధులు కేటారుుంచి అభివృద్ధి పర్చేందుకు శ్రీకారం చుట్టింది.

వరంగల్ రూరల్ : తెలంగాణ సర్కారు చిన్న నీటి వనరులపై దృష్టి కేంద్రీకరించింది. చెరువులకు నిధులు కేటారుుంచి అభివృద్ధి పర్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టుకుని సాగునీటితోపాటు తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని చూస్తోంది. స్థానికంగా ఉండే చెరువులు, కుంటల్లో పూడిక తీయకపోవడంతో చిన్నపాటి వర్షానికే మత్తళ్లు పడుతున్నారుు. దీన్ని గమనించిన ప్రభుత్వం చెరువుల్లోని పూడికను తీస్తే నీటి నిల్వ సామర్థ్యంతోపాటు సమీప ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరుగుతుందని భావిస్తోంది.

వీటిని పరిగణనలోకి తీసుకుని ఒక్కో చెరువుకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలతో మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టనుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని చిన్న నీటిపారుదల  శాఖ కింద 20 శాతం చెరువులను మొదటి విడతలో అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చెరువులను గుర్తించాలని నీటి పారుదల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించగా....  వారు పక్షం రోజులుగా సర్వే చేసి లెక్క తేల్చారు.
 
మొదటి విడతలో..


ఇటీవల నీటి పారుదలశాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో జిల్లావ్యాప్తంగా 5,584 చిన్ననీటి వనరులు ఉన్నటు గుర్తించారు. ఎంపికలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన చెరువులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 20 శాతం అంటే 12 నియోజకవర్గాల్లో 1,399 చెరువులను అభివృద్ధి చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందించారు. వీటికి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే... నిధుల  ప్రతిపాదనలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సమీక్షించి నిధులు కేటాయించనున్నారు. ఈ చెరువుల పునరుద్ధరణకు ఏటా సుమారు రూ.400 కోట్లకు పైగా నిధులు వ్యయం చేయనున్నట్లు సమాచారం.
 
కాగా, గొలుసు కట్టు చెరువులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్... ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. అదే విధానంతో చెరువులను అభివృద్ధి చేసే విధంగా అంచనాలను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెరువుల అభివృద్ధి వివిధ పథకాల్లో విడుదలవుతున్న నిధులన్నింటినీ ఈ పథకంలో వ్యయం చేయనున్నారు. చెరువుల సామర్థ్యం పరిగణనలోకి తీసుకుని ఆయూ పథకాల్లో సిఫారసు చేయనున్నారు. కేంద్రం అందజేస్తున్న త్రిపుల్‌ఆర్, వరల్డ్‌బ్యాంక్, ఏఐబీపీ, ఏపీసీబీటీఎంపీ, ఎన్‌ఎస్‌పీ, ఎఫ్‌డీఆర్ వంటి పథకాల నిధులను వీటికి కేటాయించనున్నారు.
 
 సర్వే పూర్తయింది..
 చెరువుల పునరుద్ధరణలో భాగంగా సర్వే పూర్తయింది. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సూచనలతో జిల్లావ్యాప్తంగా 20 శాతం చెరువులను ఎంపిక చేశాం. సర్వే పూర్తయినందున ప్రతిపాదనల రూపకల్పనల్లో అధికారులు ఉన్నారు. నిధులు కేటాయిస్తే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.
 - వి.పద్మారావు, ఎస్‌ఈ, ఐబీ, వరంగల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement