breaking news
-
సీఎం ఎవరనేది అప్పుడే తేలుస్తాం: డీకే శివకుమార్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావవేశంలో సోమవారం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని డీకే శివకుమార్ తెలిపారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరాతమన్నారు. గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలతో సమావేశం అనంతరం బయటికి వచ్చిన డీకే మీడియాతో మాట్లాడారు. హోటల్ నుంచి గవర్నర్‌ను కలవడానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ ఇంఛార్జ్ థాక్రే, డీకే శివకుమార్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెళ్లారు. సీఎం ఎవరన్నది ఫైనల్ కాలేదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం ఎవరన్నది ఫైనల్ కాలేదని, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాతే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సీఎం ఎవరనేది ఏఐసీసీలో ఇంకా నిర్ణయం కాలేదన్నారు. సీఎల్పీ సమావేశం సోమవారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారా.. లేదంటే నిర్ణయం మళ్లీ వాయిదా పడుతుందా అనేదానిపై క్లారిటీ లేదు. -
తెలంగాణ గడ్డపై తొలిసారి కాంగ్రెస్..
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపు ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమైంది. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకని ఒక సీటులో మాత్రమే పోటి చేసిన సీపీఐ విజయాన్ని అందుకుంది. దాంతో కాంగ్రెస్ 65 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ రోజు(ఆదివారం) జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో ఆది నుంచి ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్.. అదే ఊపును కడవరకూ కొనసాగించింది. ఫలితంగా తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ తొలిసారి జెండా ఎగురవేయనుంది. మొత్తం 119 సీట్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐలు కలిసి 65 సీట్లను గెలవగా, బీఆర్ఎస్ 39 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా, ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపును అందుకుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం కౌంటింగ్ మొదలైనప్పట్నుంచీ చూస్తే వెనుకబడే ఉంది. ఎక్కడ కూడా లీడ్‌లోకి రాలేదు. కాంగ్రెస్ ఆది నుంచి 50 స్థానాల్లో ఆధిక్యం దక్కకుండా ముందుకు దూసుకుపోయింది. అదే సమయంలో బీఆర్ఎస్ వెనుకంజలో పయనించింది. కాగా, బీఆర్ఎస్ ఓటమిలో బీజేపీ పాత్ర ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ ఎన్నికలు పోరు ప్రారంభమైన నాటి నుంచి బీఆర్ఎస్-బీజేపీలు మిత్రులు అంటూ కాంగ్రెస్ ప్రచారం సాగించింది. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీఆర్ఎస్కు ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తుందనే ప్రచారం కూడా కాంగ్రెస్ చేసింది. వీరిద్దరూ మిత్రపక్షాలేనని, బీఆర్ఎస్ ‘ఏ’ టీమ్ అయితే బీజేపీ ‘బీ’ అంటూ ప్రచారం సాగించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో బీజేపీ సుమారు 14 శాతం ఓట్ల షేర్‌ను సాధించినట్లే కనబడుతోంది. అదే సమయంలో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోవడంతో తెలంగాణలో బీజేపీ తన ఉనికిని కాపాడుకుంది. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అభ్యర్థుల్లు ఎవరూ గెలవలేదు. చాలా చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయింది. సీఎం ఎవరు.. ఎప్పటిలోగా..? -
కాటిపల్లి..కామారెడ్డి డబుల్ జెయింట్ కిల్లర్..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ ఓడిపోయింది. మొత్తంగా కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పైచేయి సాధించారు. అయితే కేసీఆర్, రేవంత్‌రెడ్డిలు ఇద్దిరినీ ఓడించిన కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి డబుల్ జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. కామారెడ్డిలో పోటీచేసిన ఇరు పార్టీల అధినేతలపై సంచలన విజయం సాధించి వెంకటరమణారెడ్డి పాపులర్ అయ్యారు. కామారెడ్డిలో ఎవరికి ఎన్ని ఓట్లు... ఆదివారం ఉదయం తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కామారెడ్డి ఫలితం రౌండ్ రౌండ్‌కు తీవ్ర ఉత్కంఠ రేపింది. తొలుత ఈ స్థానంలో వెంకటరమణారెడ్డి లీడ్‌లో ఉండగా తర్వాత రేవంత్‌రెడ్డి లీడ్‌లోకి వచ్చారు. చివరి రౌండ్లు లెక్కబెట్టే టైమ్‌కు రేవంత్‌రెడ్డిని వెనక్కి నెట్టేసి మళ్లీ వెంకటరమణారెడ్డి లీడ్‌లోకివచ్చారు. తర్వాత ఒక్కసారిగా కేసీఆర్ ముందుకు దూసుకువచ్చి రేవంత్‌ను మూడో స్థానానికి నెట్టారు. చివరగా కౌంటింగ్ ముగిశాక కేసీఆర్‌పై వెంకటరమణారెడ్డి 6741 వేల ఓట్లతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో వెంకటరమణారెడ్డికి 66652 ఓట్లు రాగా, రెండవ స్థానంలో ఉన్న కేసీఆర్‌కు 59911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54916 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి.. ఒకప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్న వెంకటరమణారెడ్డి తర్వాత బీజేపీలో చేరారు.ఈ ఎన్నికల్లో టికెట్ రాకముందు నుంచే ఆయనే బీజేపీ పార్టీ అభ్యర్థి అని కన్ఫామ్ అయిపోయింది. అయితే తర్వాత నియోజకవర్గానికి ఏకంగా ఇటు కేసీఆర్, అటు రేవంత్‌రెడ్డి పోటీకి వచ్చారు. దీంతో వెంకటరమణారెడ్డిని ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. అయితే ఎక్కడా కుంగిపోకుండా, భయపడకుండా ఆత్మవిశ్వాసంతో వెంకటరమణారెడ్డి తన ప్రచారం చేసుకుంటూ వెళ్లారు. పనిచేసిన లోకల్ కార్డు.. ఎన్నికల ప్రచారంలో వెంకటరమణారెడ్డి వ్యూహాత్మకంగా లోకల్ కార్డును తెరపైకి తీసుకువచ్చారు. ఆయన ప్రచారంలో వాడి వేడి డైలాగులు ప్రయోగించారు. ‘గజ్వేల్ డిపో నుంచి వచ్చిన బస్సులు గజ్వేల్‌కు, కొడంగల్ నుంచి వచ్చిన బస్సులు కొడంగల్‌కు వెళ్లిపోతాయి. కామారెడ్డి డిపో బస్సులు మాత్రం ఇక్కడే ఉంటాయి’ అని తాను స్థానికుడిని అని పరోక్షంగా చెప్పేలా ప్రచారం చేశారు. వెంకటరమణారెడ్డి చెప్పిన ఈ మాటలు అక్కడి ప్రజలను ఆకర్షించింది. కేసీఆర్,రేవంత్‌రెడ్డిలలో ఎవరు గెలిచినా నియోజకవర్గంలో ఉండరని కామారెడ్డి ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లారు. ఇదే ఆయన ఇద్దరు బడా నేతలపై విజయానికి కారణమైందని పొలిటికల్ అనలిస్టులు అభిపప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ తరపున గంప గోవర్ధన్ విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు:కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తాము ఆశించిన ఫలితం రాలేదని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆశించిన ఫలితం రానందుకు నిరాశగా ఉందని అన్నారు. అయితేనేం.. ప్రజల కోసం ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని వెల్లడించారు. గత 23 ఏళ్లలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా నిలదొక్కుకున్నామని అన్నారు. ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటామని పేర్కొన్నారు. ఎదురుదెబ్బను గుణపాఠంగా భావిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పాత్రలో కూడా ఇమిడిపోతామని స్పష్టం చేశారు. ఓటమికి కుంగిపోం.. గెలుపునకి పొంగిపోం.. అని కేటీఆర్ అన్నారు. 'కాంగ్రెస్ వేవ్ అయితే.. అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రావాలి. కానీ అలా జరగలేదు. సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్‌కు సాధారణ మెజార్టీనే వచ్చింది. ఈ ఫలితాలు చాలా ఆశ్చర్యాలన్ని కలిగించాయి. ప్రజల మన్నన పొంది మరింత బలంగా తిరిగొస్తాం. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. మరిన్ని మార్పులతో మళ్లీ ముందుకు వస్తాం' అని కేటీఆర్ అన్నారు. గత పదేళ్లలో తమకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశపడొద్దు.. రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని కేటీఆర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలించాలని కోరుకుంటున్నామని తెలిపారు. కొత్త ప్రభుత్వాన్ని వెంటనే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయబోం.. వారు కూడా కుదురుకోవాలని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వల్ప తేడాతో తమ అభ్యర్థులు చాలా మంది ఓడిపోయారని పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవించి సీఎం కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇప్పటికే ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. -
రివేంజ్ తీర్చుకున్న కల్వకుంట్ల కవిత..ఎలా అంటే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైనా ఎమ్మెల్సీ కవితకు మాత్రం సంతోషం కలిగించే విషయం ఒకటుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తననున పట్టుబట్టి ఓడించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ చేతిలో ఓటమి పాలయ్యారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి సంజయ్ గెలుపులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ప్రముఖంగా ఉంది. ఎంపీ అర్వింద్ ఏ పార్లమెంట్ నియోజకవర్గంలోనైతే తనను ఓడించి గెలిచాడో అదే పార్లమెంట్ నియోజకవర్గంలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అర్వింద్‌ను తన సపోర్ట్ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడించి కవిత రివేంజ్ తీర్చుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో అర్వింద్‌ను ఓడిస్తే కవిత పగ పూర్తిగా తీరుతుందని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే విషయమై కవిత ట్విట్టర్లో కూడా స్పందించారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల తరపున ఎల్లప్పుడూ పోరాడుతుందని తెలిపారు. మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. -
బీఆర్ఎస్ ఓటమిపై హరీష్‌రావు, కవిత రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. బీఆర్ఎస్కు పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో గెలిచే హ్యాట్రిక్ సాధిస్తామని ఆశించిన కేసీఆర్‌కు గట్టి షాకే తగిలింది. రెండు చోట్ల పోటీ చేసిన ఆయన కామారెడ్డిలో ఓటమి చెందారు. బీఆర్ఎస్ ఓటమిపై హరీష్‌రావు స్పందిస్తూ ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. రెండు సార్లు బీఆర్ఎస్కు అవకాశమిచ్చారని, ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని హరీష్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ఓటమిపై కవిత కూడా స్పందించారు. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమేనని, మనమంతా మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దామంటూ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. చదవండి: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి Jai KCR !! Jai BRS !! Dear BRS family, thank you for all the hardwork !! Special thanks to all the social media warriors for the fight you put up !! Let us not forget.. with or without power we are servants of Telangana People. Let us all spiritedly work for our MotherLand.… — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 3, 2023 -
సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమవడంతో తన ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసైకి తన రాజీనామా లేఖను పంపించారు. సాధారణంగా పార్టీ ఓటమి పాలైన తర్వాత ముఖ్యమంత్రులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు నేరుగా రాజీనామా లేఖను సమర్పిస్తారు. దీనికి భిన్నంగా కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లకుండానే సీఎం పదవికి రాజీనమా చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కేసీఆర్ రాజీనామా చేసే కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో పార్టీ ఓటమిని అంగీకరించారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. తమతప్పు సరిదిద్దుకుంటామని తెలిపారు. -
సీఎంగా రేవంత్.. రేపు ప్రమాణ స్వీకారం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రేపు(సోమవారం) రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు సమాచారం. ఇక, ప్రమాణ స్వీకారం గురించి రేవంత్.. తెలంగాణ డీజీపీకి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి, మంత్రుల ప్రమాణానికి ఏర్పాటు పరిశీలిస్తున్నట్టు సమాచారం. దేశ నలుమూలల నుంచి వీఐపీలు వస్తారని ఈ నేపథ్యంలో తగిన భద్రతపై డీజీపీతో చర్చించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే రేపు ఉదయం గాంధీభవన్‌లో సీఎల్పీ నేతలు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందించారు. అయితే, సీఎం కాన్వాయ్ లేకుండానే కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లడం విశేషం. -
కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం సాధించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి విజయం సాధించారు. ఈరోజు కౌంటింగ్ ముందు నుంచి గేర్లు మారుస్తూ కామారెడ్డిలో ప్రతీ రౌండ్‌కు ఆధిక్యం మారుతూ వచ్చింది. చివరకు బీజేపీ అభ్యర్థినే గెలుపు వరించింది. అయితే, కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, కామారెడ్డి ఓటర్లు మాత్రం స్థానిక నేత అయిన వెంకట రమణ రెడ్డిపైనే నమ్మకం ఉంచి ఆయనను గెలిపించారు. ఇక, కౌంటింగ్‌లో చివరి నిమిషం వరకు కామారెడ్డి ఫలితం ఆసక్తికరంగా సాగాయి. ప్రతీ రౌండ్లోనూ ఆధిక్యం మారుతూ విజయం దోబూచులాడింది. ఒక సమయంలో కేసీఆర్, మరో సమయంలో రేవంత్ గెలుపు దిశగా ఫలితాలు వచ్చినా.. చిరవకు విజయం మాత్రం బీజేపీనే వరించింది. అయితే, వెంకట రమణా రెడ్డి గత ఎన్నికల్లో రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. కామారెడ్డిలో ఇలా.. కామారెడ్డిలో 2009, 2014, 2018, 2012 ఉప ఎన్నికల్లో గంపా గోవర్దన్ గెలుపు. ఈ ఎన్నికల్లో సమీప అభ్యర్థి ప్రస్తుత షబ్బీర్ అలీపై గెలుపు. టీఆర్ఎస్ నుంచి బరిలో కేసీఆర్, రేవంత్ పోటీ. 2018లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పక్షాన గంపా గోవర్దన్, కాంగ్రెస్ తరపున సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన షబ్బీర్ అలీ పోటీ పడగా, గోవర్దన్ నే విజయం వరించింది. గోవర్దన్ 4,557 ఓట్ల తేడాతో విజయం సాదించగలిగారు. గోవర్దన్ కు 68,162 ఓట్లు రాగా, షబ్బీర్ అలీకి 63,610 ఓట్లు వచ్చాయి. ఈ విజయం కామారెడ్డి నియోజకవర్గ ప్రజల ప్రజలందరిది pic.twitter.com/bGLlHGOF6G — Katipally Venkata Ramana Reddy BJP (@kvr4kamareddy) December 3, 2023 -
బీజేపీ ఎంపీలకు షాక్.. కాంగ్రెస్ ఎంపీలకు జై
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంది. ఓ వైపు అసెంబ్లీలో బీజేపీ స్థానాలు 3 నుంచి రెట్టింపయి 8కి పెరిగే దిశగా ఉండగా మరోవైపు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు ఓటమి పాలయ్యారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బోథ్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ హవా నడిచిన ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలవడం గమనార్హం. కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు.కోరుట్లలో ఎంపీ అర్వింద్ బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ మీద, బోథ్ నుంచి ఎంపీ సోయం బాపూరావు బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ చేతిలో ఓడిపోయారు. ఇక ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి గెలుపొందడం విశేషం. బీజేపీ నుంచి పోటీచేసిన ముగ్గురు ఎంపీలు ఓటమి పాలవడం మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుగా రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాగా, దుబ్బాక నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై గెలుపొందారు. -
చివరి నిమిషంలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. బీఆర్ఎస్కు అదే ప్లస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే, ఈ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కలిసి వచ్చాయి. లేకపోతే మరికొన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్కు ఓటమి ఎదురయ్యేది. బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చిన స్థానాలు ఇవే.. అలంపూర్: అబ్రహం స్థానంలో విజయుడికి సీటు.. గెలుపు. జనగాం: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీటు.. గెలుపు స్టేషన్ ఘనపూర్: తాటికొండ రాజయ్య స్థానంలో కడియంకు అవకాశం.. గెలుపు. నర్సాపూర్: మదన్ రెడ్డి స్థానంలో సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం.. గెలువు కోరుట్ల: కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్థానంలో ఆయన కుమారుడు డా:కల్వకుంట్ల సంజయ్ రావుకు అవకాశం.. గెలుపు ఆసిఫాబాద్: ఆత్రం సక్కు స్థానంలో కోవాలక్ష్మీకి అవకాశం.. గెలుపు దుబ్బాక: ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డికి అవకాశం.. గెలువు బోథ్: రాథోడ్ బాబురావు స్థానంలో అనిల్ జాదవ్‌కు అవకాశం.. గెలువు ఉప్పల్: బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి అవకాశం.. గెలువు. మల్కాజ్గిరి: మైనం పల్లి హన్మంతరావు స్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డి అవకాశం.. విజయం. -
సీఎం ఎవరు.. ఎప్పటిలోగా..?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. అయితే, కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరు అనే దానిపై చర్చ మొదలైంది. కాంగ్రెస్‌లో ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉండగా, ప్రస్తుతం ఇద్దరి నాయకుల పేర్లే వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాగా, ఇంకొకరు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి గెలుపొందగా, మధిర(ఎస్సీ) నియోజకవర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. వీరిద్దరిలో ఎవరో ఒకరకి సీఎం పదవిని కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న స్వల్ప సమయంలోనే టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. తన మార్కు రాజకీయాలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ వచ్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్‌లో జోష్ నింపే యత్నం చేశారు. మరోవైపు మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు మరింత ఊపు తెచ్చిన నాయకుడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అత్యంత వీర విధేయుడుగా ఉన్న నేత మల్లు. సీఎం పదవిపై తన మనసులోని మాటను కూడా బయటపెట్టారు మల్లు. సీఎం పదవి ఇస్తే గౌరవంగా స్వీకరిస్తానని ఎన్నికల ఫలితాల తర్వాత మల్లు వ్యాఖ్యానించారు. అంటే తాను కూడా సీఎం రేసులో ఉన్నాననే మనసులో మాటను ఎట్టకేలకు వెల్లడించారు. మరొకవైపు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు రేవంత్‌రెడ్డికి మంచి సాన్నిహిత్యమే ఉంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కీలక బాధ్యతలను డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించి ఆయనపై ఎంతో విశ్వాసం ఉంచింది. ఈ తరుణంలో రేవంత్‌రెడ్డికి సీఎం పదవి రావాలంటే డీకే శివకుమార్ తప్పకుండా అనివార్యం కావొచ్చు. ఎప్పటిలోగా..? కర్ణాటకలో సీఎం పదవి ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా సమయం తీసుకోలేదు. కేవలం మూడు రోజుల్లోనే సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. అక్కడ కూడా డీకే శివకుమార్ నుంచి సిద్ధరామయ్య పోటీ ఎదురైంది. అయితే చివరి నిమిషంలో సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసి, డీకేకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. దీనికి డీకే శివకుమార్‌ను ఒప్పించడంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా స్వల్ప వ్యవధిలోనే సక్సెస్ అయ్యింది. మరి తెలంగాణ సీఎం పోస్ట్ విషయంలో కాంగ్రెస్ ఎంత సమయం తీసుకుంటుదంనేదే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నమాట. కర్ణాటక తరహాలో అతి తొందరగా నిర్ణయం తీసుకుంటుందా.. లేక నాన్చుడు ధోరణి అవలంభిస్తుందా? అనేది చూడాలి. లిస్టు చాలానే ఉంది.. వారిని బుజ్జగించేది ఎలా? తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్లకు కొదువలేదు. వీరిలో చాలా మంది సీఎం పదవి కోసం చూస్తున్న ఆశావహులు చాలా మందే ఉన్నారు. రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వీరంతా సీఎం పదవి కోసం వాళ్ల ప్రయత్నాలు కచ్చితంగా చేస్తారు. దీని కోసం గళాన్ని గట్టిగా వినిపించడానికి సిద్ధమవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వీరిని ఎలా డీల్ చేస్తుందనేది ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందున్న సమస్య. కర్ణాటక తరహాలో నిర్ణయాన్ని డైరెక్ట్‌గా తీసుకుని వారికి భరోసా ఇస్తే సరిపోతుందా.. లేక వారిని బుజ్జగించడానికి సమయం పడుతుందా అనేది ఇప్పుడు చర్చకు తెరతీసింది. ఒకవేళ సీఎం పదవి కోసం ఏమైనా వివాదం ఏర్పడితే మాత్రం కాంగ్రెస్ అధిష్టానం దీనిపై సీరియస్‌గా ఫోకస్ పెట్టక తప్పదు..! -
ప్రగతి భవన్ పేరు.. ఇకపై ప్రజా భవన్: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు విజయం కోసం చాలా కృషి చేశారని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. ఏ సమస్య వచ్చినా నైతికంగా అండగా ఉన్న రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అటు.. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రచారం బాగా జరిగింది అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 3వ తేదీన శ్రీకాంత్‌చారి అమరుడయ్యారు.. ఇవాళ్టి ప్రజా తీర్పు శ్రీకాంత్‌చారికి అంకితం చేస్తున్నానని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రజలు పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. భారత్ జోడో ద్వారా రాహుల్ స్ఫూర్తిని నింపారని తెలిపారు. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పారు. తాను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ కలిసి పార్టీని ముందుకు నడిపిస్తామని పేర్కొన్నారు. అమరవీరులకు అంకితం.. ప్రతిపక్షంలో ఎవరు ఉండాలో ప్రజలు నిర్ణయించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విజయంలో 30 లక్షల నిరుద్యోగుల పట్టుదల ఉందని పేర్కొన్నారు. ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం చేేస్తున్నట్లు చెప్పారు. ఈ విజయంలో తన వంతు పాత్ర పోషించిన విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలను సమన్వయం చేసిన థాక్రేకు ధన్యవాదాలు తెలిపారు. 'సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌లతో కలిసి ముందుకు వెళ్తాం. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తి నింపారు. సీనియర్ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్ విజయం సాధించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో బీఆర్ఎస్ సహకారం అందిస్తుందని భావిస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటులో ప్రజలు భాగస్వామ్యం కావాలి. కొత్త ప్రభుత్వంలో బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజాతీర్పును అందరూ శిరసావహించాలి.' అని రేవంత్ రెడ్డి అన్నారు. గేట్లు తెరిచే ఉంటాయి.. ప్రగతి భవన్ పేరును మారుస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రగతి భవన్‌ను ఇకపై డా. అంబేద్కర్ ప్రజా భవన్‌గా పేరు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. సచివాలయం గేట్లు సామాన్య ప్రజలకు సదా తెరిచి ఉంటాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను అందరం కలిసి నెరవేర్చాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. -
ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్‌లోనే దూసుకెళ్లారు. ఇక, ఎన్నికల్లో బీఆర్ఎస్కు పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో గెలిచే హ్యాట్రిక్ సాధిస్తామని ఆశించిన కేసీఆర్‌కు గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణలో ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయి. ఈరోజు ఫలితం గురించి బాధపడటం లేదు. ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో నిరాశ చెందాను. రెండుసార్లు బీఆర్ఎస్కు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ఫలితాలను ఒక అభ్యాసంగా తీసుకుని తిరిగి పుంజుకుంటాం. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు అభినందనలు’ అంటూ కామెంట్స్ చేశారు. Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government 🙏 Not saddened over the result today, but surely disappointed as it was not in expected lines for us. But we will take this in our stride as a learning and will bounce back… — KTR (@KTRBRS) December 3, 2023 మరోవైపు.. సిరిసిల్లలో కేటీఆర విజయం సాధించారు. దాదాపు 29వేల మెజార్టీతో కేటీఆర్ విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. కేటీఆర్ 2018 ఎన్నికల్లో దాదాపు 89వేల మెజార్టీలో గెలుపొందారు. ఇక, ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్వల్పంగా రావడం కూడా కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులను నిరాశ పరచినట్టు తెలుస్తోంది. -
బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే నన్ను మరోసారి అందలమెక్కిస్తాయి. నా విజయానికి తిరుగులేదు. నా గెలుపును ఎవరు కూడా ఆపలేరు. అంగ బలం,అర్థ బలం అన్ని ఉన్న నేను అవలీలగా గెలువబోతున్న అంటూ మితిమీరిన విశ్వాసమే చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను నిండా ముంచింది అనే అభిప్రాయాలు నియోజకవర్గంలో వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ, సింగరేణి అధికారులను నిర్లక్ష్యంగా చూడటం. వ్యక్తిగత సహాయకులు నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడటం. సీనియర్ నాయకులతో నాకు పనిలేదు. నేను ఎవరితో పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ పార్టీ సీనియర్ నాయకులను పక్కకు పెట్టడం. బాల్క సుమన్ పేరు చెప్పుకొని పలువురు నాయకులు,కార్యకర్తలు సింగరేణి,ప్రభుత్వ అధికారులపై పెత్తనం చెలాయించడం.తప్పుడు సమాచారం సుమన్ కు చేరవేయడం. అసలయిన విషయాన్నీ చెప్పకుండా దాచిపెట్టడం. నచ్చని నాయకులపై సుమన్ కు చాడీలు చెప్పడం. మందమర్రి,రామకృష్ణపూర్లో సింగరేణి క్వార్టర్ ల విషయంలో సుమన్‌ను నమ్ముకున్న వారికీ కాకుండ, పార్టీ క్యాడర్ లో కొందరు అక్రమంగా కబ్జాకు పాల్పడి వారి బందువులకు క్వార్టర్లను ఇప్పించడం. మందమర్రిలో గిరిజనుల భూములను కబ్జా చేయడం వంటి చర్యలు సుమన్ రెండో విజయానికి అడ్డుగోడల నిలిచాయని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కోటపల్లి మండలంలో రైతులను కాళేశ్వరం బ్యాక్ వాటర్ నష్టపరిచినా స్పందించకపోవడంతో ఆ మండల వాసులు సుమన్‌ను వ్యతిరేకించారు. స్థానికంగా ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా, హైదరాబాద్ కె ఎక్కువ సమయం ఇవ్వడం కూడా సుమన్‌ను నష్టపరిచిందనే ఆరోపణ కూడా ఉంది. ఎమ్మెల్యేగా,ప్రభుత్వ విప్ గా ,పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికినీ నియోజక వర్గం ప్రజలు ఆశించిన మేరకు అభివృద్ధికి నోచుకోలేదనే అభిప్రాయాలూ సైతం ఉన్నాయి. గెలిచిన వెంటనే మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపిస్తా అని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన సుమన్ ఆ హామీని నెరవేర్చకపోవడం కూడా అయన ఓటమికి మరొక కారణమయినదని చెప్పవచ్చు. -
మంత్రి పువ్వాడకు భారీ షాక్
ఖమ్మం: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్‌కు భారీ షాక్ తగిలింది. నువ్వా-నేనా అన్నట్లు తలపడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. కచ్చితంగా ఈ సీటు గెలుస్తామనే పువ్వాడ ఆది నుంచి ధీమాగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ జోష్‌లో ఆయనకు ఓటమి తప్పలేదు. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేశారు. ఖమ్మం సీటుపై ఆది నుంచి టార్గెట్ చేసిన కాంగ్రెస్.. అదే జోరును కడవరకూ కొనసాగించింది. కాంగ్రెస్‌లో తుమ్మల బలమైన నేత కావడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చింది.ప్రభుత్వ వ్యతిరేక ఓటును తనవైపు తిప్పుకోవడంలో తుమ్మల సక్సెస్ అయ్యారు. ఎన్నికల ప్రచారహోరులో కూడా వీరిద్దరూ హోరీహోరీనే తలపించారు. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ మరింత ఆసక్తిని పెంచింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్ఎస్ తరుపున పోటి చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడ ఓడితే పొలిటికల్‌గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 40 ఏళ్ల రాజకీయాలకు ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో పనిచేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పి కూడా ప్రచారానికి వెళ్లారు. దానికి తోడు కాంగ్రెస్ జోరు కూడా తోడవడంతో ఖమ్మం నియోజకవర్గంలో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,15, 801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు 1,51, 673 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,64, 006 మంది ఉండగా, ట్రాన్స్ జెండర్లు 47 మంది ఉన్నారు. ఇందులో సుమార 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడ్డారు. ఇక బీజేపీ-జనసేనల పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు టికెట్ కేటాయించారు. జనసేన తరఫున మిర్యాల రామకృష్ణ బరిలో నిలిచారు. ఇక సీపీఎం నుంచి యర్ర శ్రీకాంత్ పోరుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం నేరుగా పోరుకు దిగింది. -
సీఎం పదవి ఇస్తే..: భట్టి కీలక వ్యాఖ్య
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో దొరల పాలన పోయిందని, ప్రజల తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ కీలక నేత, సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతున్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజల విజయం. తెలంగాణలో దొరల పాలన పోయింది. ప్రజా తెలంగాణ వచ్చింది. గెలిచిన అభ్యర్థులందరికీ అభినందనలు. కాంగ్రెస్ తరఫున ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తాం. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తా అని అన్నారాయన. -
తొలిసారి ఎమ్మెల్యేలు వీరే..!
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి తొలిసారిగా పలువురు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన వాళ్లు, ఈ ఎన్నికల్లోనే తొలిసారి పోటీచేసిన వాళ్లలో కొందరిని ప్రజలు దీవించారు. వీరిలో అతి చిన్న వయసు వాళ్లు కూడా ఉండటం విశేషం. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో పాలకుర్తిలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన యశస్వినిరెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మెదక్ నుంచి పోటీచేసిన మైనంపల్లి రోహిత్‌రావు ప్రత్యర్థి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిపై గెలుపొందారు. వేములవాడలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ఆదిశ్రీనివాస్ విజయం సాధించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మక్కాన్‌సింగ్ రాజ్ ఠాగూర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంటోన్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్‌నేత జానారెడ్డి కుమారుడు జయవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాగర్‌కర్నూల్ జిల్లా నాగర్‌కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్‌రెడ్డి ఫస్ట్‌టైమ్ ఎమ్మెల్యేగా గెలవగా ఇదే జిల్లా నుంచి కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కలకుంట్ల మదన్మోహన్రావు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి ముందుల శామ్యూల్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం అందుకున్నారు. యాదాద్రి భువనగరి జిల్లా ఆలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయనకు కూడా ఫస్ట్‌టైమ్ అధ్యక్షా అనే ఛాన్స్ వచ్చింది. -
అత్త వ్యూహం.. కోడలు విజయం
పాలకుర్తి: ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందునుంచి ఊహించినట్లే పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లిపై కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పాలకుర్తి సీటు ఎంపికలో ఆ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న హనుమాండ్ల ఝాన్సీరెడ్డి .. చివరి నిమిషంలో ఆమె కోడలు యశస్వినిని బరిలోకి దింపారు. అత్త వ్యూహం.. కోడలు విజయం పాలకుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ ఆశించారు. అయితే. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఝాన్సీరెడ్డి కుటుంబ సభ్యురాలైన యశస్వినినికే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీనిపై సర్వత్రా చర్చ కూడా జరిగింది. పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యేగా రాణిస్తూ మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చెక్‌పెట్టేలా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ఎన్ఆర్ఐ ఝాన్సీలక్ష్మీరెడ్డిని రంగంలోకి దింపారు. ఇలాంటి తరుణంలోనే ఝాన్సీలక్ష్మీరెడ్డి భారత దేశ పౌరసత్వంపై వివాదం తలెత్తింది. వారం రోజుల వరకూ తనకు పౌరసత్వం వస్తుందనీ, ఏలాంటి అపోహాలకు గురికావద్దన్న ఝాన్సీరెడ్డి ప్రత్యామ్నయంగా తన కోడలును ఎన్నికల సమరంలో దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వాస్తవానికి హనుమాంఢ్ల ఝాన్సీరెడ్డి పౌరసత్వం అడ్డోస్తే దేవరుప్పుల మండలం మాధాపురంకు చెందిన ప్రముఖవైద్యులు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణనాయక్ రావడం అనివార్యంగా బావించారు. కానీ పాలకుర్తి నుంచి కాంగ్రెస్ జెండా ఎగురవేసే లక్ష్యంగా ఇక్కడి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన తన కుటుంబం తగ్గేదీలేదని ఎట్టకేలకు తన కోడలు యశస్వినికి రెండో విడతలో కాంగ్రెస్ టికెటు సాధించడంలో సఫలీకృతమయ్యారు ఝాన్సీరెడ్డి, అప్పటివరకూ తానొక్కతే ప్రచారంలో దూసుకపోతున్న క్రమంలో తోడుగా కోడలు రావడంతో కొంత పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొన్నప్పటీకీ డబుల్ ప్రచారంతో ప్రభుత్వ వ్యతిరేకతను కలిగిన ప్రజల్ని కూడగట్టుకొని చారిత్రాత్మక విజయం సాధించి ఝూన్సీరెడ్డి తనమార్కు నిలుపుకున్నారు. ఫలితంగా తొలిసారి పోటీ చేసి గెలుపును సొంతం చేసుకోవడంతో యశస్విని అరుదైన ఘనతసు సొంతం చేసుకున్నారు. ఆది నుంచి ఎర్రబెల్లే టార్గెట్.. ఎర్రబెల్లిని కచ్చితంగా ఓడించాలనే వ్యూహంతో ఆది నుంచి పావులు కదిపిన కాంగ్రెస్ తన వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేసింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది కాంగ్రెస్. యశస్విని కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లిపై పదునైన విమర్శలు చేసి ఓటర్లను ఆకర్షించింది. దానికి తోడు కాంగ్రెస్ జోష్ కూడా తోడవడంతో ఆమె గెలుపు సునాయాసమైంది. ఇక పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. .ఎర్రబెల్లికి ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. కానీ అది ఈసారి కలిసి రాలేదు. కాంగ్రెస్ జోరు ముందు ఎర్రబెల్లి పరాజయం చెందారు. మరొకవైపు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామ్మోహన్రెడ్డ పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి జాబితాలోనే సీటు దక్కించుకని ప్రచారాన్ని ఆదిలోనే ప్రారంభించినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం కాంగ్రెస్‌కే షిప్ట్ అయ్యింది. -
గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు.. హుజూరాబాద్‌లో ఈటల ఓటమి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలు కీలక నేతలకు షాక్ ఇస్తున్నాయి. అధికార పార్టీలోని మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రమే కాదు.. ఇతర పార్టీల్లోని నేతలకు చేదు అనుభవం మిగల్చబోతున్నాయి ఈ ఎన్నికలు. బీజేపీ తురుపుముక్కగా భావించిన ఈటల.. రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి చేతిలో ఓడారు. ఏకంగా 17వేల ఓట్ల(17,158 ఓట్లు) మెజారిటీతో ఈటలపై కౌశిక్‌రెడ్డి నెగ్గారు. హుజూరాబాద్‌లో ఈటల రెండో స్థానానికే పరిమితం అయ్యారు. మరోవైపు కేసీఆర్‌ను ఓడిస్తానని చాలెంజ్ చేసి మరీ గజ్వేల్ బరిలోనూ ఈటల నిల్చున్నారు. అయితే.. ఇక్కడా కేసీఆర్ చేతిలో ఈటలకు పరాభవం తప్పలేదు. కాకుంటే ఈటల లాంటి బలమైన నేత పోటీ చేయడంతో గత ఎన్నికల కంటే ఈసారి కేసీఆర్ మెజారిటీ తగ్గింది. అయితే గజ్వేల్‌లో కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ రికార్డు మాత్రం నెలకొల్పారు. కరీంనగర్ ఈసారి కచ్చితంగా నెగ్గుతారనే అంచనాలున్న బండి సంజయ్.. గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. స్వల్ప మెజార్టీతోనే ఆయన బండి చేతిలో ఓడారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన రఘునందన్‌రావు.. ఇప్పుడు ఎన్నికలో ఓటమి పాలయ్యారు. కొత్త ప్రభాకర్(మెదక్ ఎంపీ) భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి నెగ్గారు. -
బరిలో బంధువులు.. ఫలితం ఏంటీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈసారి ఎన్నికల్లో భారీ స్థాయిలో బంధువులు బరిలో నిలిచారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు, మామ అళ్లుల్లు ఇలా ఏదో ఒక రకంగా బంధుత్వాన్ని పంచుకున్నవారు ఎన్నికల్లో పోటీకి నిలిచారు. వారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..? మామా అల్లుడు.. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ తరుపున పోటీ చేశారు. ఇక మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటి రెడ్డి బ్రదర్స్ ఘనవిజయం సాధించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరుపున కోమటి రెడ్డి బ్రదర్స్ పోటీ చేశారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 21 వేల మెజార్టీతో గెలుపును ఖాయం చేసుకున్నారు. ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలో 54 వేలకు పైగా మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్నారు. తండ్రి కోడుకులు.. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మైనంపల్లి రోహిత్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మైనంపల్లి హన్మంతరావు ఓటమి దిశలో ఉన్నారు. అత్త.. అల్లుడు.. వేముల ప్రశాంత్‌రెడ్డి బీఆర్ఎస్ తరుపున బాల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాడు. ఫలితాల్లో గెలుపు దిశగా దూసుకుపోతూ దాదాపుగా విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇదే స్థానం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి మేనత్త అన్నపూర్ణమ్మ ఓడిపోయింది. ఎర్రబెల్లి బ్రదర్స్.. వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్ బీజేపీ తరుపున పోటీలో నిలిచారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున బరిలో ఉన్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో ఇద్దరు ఓటమి పాలయ్యారు. గడ్డం సోదరులు.. సోదరులు గడ్డం వినోద్, గడ్డం వివేక్ విజయం సాధించారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో దిగారు. ఆయన సోదురుడు వివేక్ చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. ఇద్దరు విజయం సాధించడం గమనార్హం. కేసీఆర్.. కేటీఆర్.. తండ్రికొడుకులు సీఎం కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ రెండు స్థానాల్లో పోటీలో నిలవగా ఆయన కుమారుడు కేటీఆర్ సిరిసిల్లలో బరిలోకి దిగారు. కామారెడ్డిలో ఓటమి పాలైన కేసీఆర్ గజ్వేల్ మాత్రం విజయం సాధించారు. అటు.. సిరిసిల్లలో కేటీఆర్ అధికారాన్ని కాపాడుకోగలిగారు. భార్యాభర్తలు.. తెలంగాణ ఎన్నికల్లో భార్యభర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి భారీ విజయాన్ని అందుకున్నారు. హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పోటీలో నిలిచిన ఆయన భార్య పద్మావతి రెడ్డి ఘనవిజయం సాధించారు. -
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి, కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. కామారెడ్డి కింగ్ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి తన సత్తా చాటారు. -
జాడ లేని జనసేన.. పవర్ స్టార్ ప్రభావం ఏదీ?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన గుర్తు గ్లాస్ పగలిపోయేలా జనాలు పవన్‌కు పట్టించుకోలేదు. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా జనసేనను ప్రజలు పట్టించుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల హవా సాగుతోంది. అధికార బీఆర్ఎస్ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. బీజేపీ 8 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంటే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన జనసేన జాడ అస్సలు కనిపించకుండా పోయింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తుతో మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. కౌంటింగ్ ప్రారంభమై పలు రౌండ్లు ముగిసినా ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు. పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా ప్రచారం చేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అయినా ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గంలో తమ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ గెలుస్తారని జనసైనికులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో 5 రౌండ్లు ముగిసే సరికి జనసేన అభ్యర్థి వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. -
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు
సాక్షి, ఉమ్మడి రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు సాగుతోంది. నగర శివారు ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ హవా సాగుతోంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ విజయతీరాలకు చేరువలో ఉంది. రాజేంద్రనగర్, తాండూరు, వికారాబాద్‌లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఎల్బీనగర్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మరోవైపు, ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన కొందరు నేతలు భారీ వెనుకంజలో ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ కీలకంగా పనిచేసిన నేతలు ఓటమికి చేరువలో ఉండటంతో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్, నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో గంగుల కమలాకర్, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్ (స్వల్ప ఆధిక్యం, 60 ఓట్లు) వెనుకంజలో ఉన్నారు. -
తెలంగాణాలో కాంగ్రెస్ జోరు: సీతక్క ట్వీట్ల జోరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోంది. కౌంటింగ్‌లో ఆదినుంచీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ఫలితాల్లో తన జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయంతో తొలి బోణీ కొట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలైనాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ధనసరి అనసూయ.. అలియాస్ సీతక్క సంచలన ట్వీట్లతో సందడి చేస్తున్నారు. వరుస ట్వీట్లతో అటు కేసీఆర్‌పైనా, బీఆర్ఎస్ పార్టీపైన విమర్శలు గుప్పించారు. ఇవి ట్విటర్లో వైరల్‌గా మారింది. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన సీతక్క ప్రస్తుతం భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ వెనుకంజలో ఉన్నారు. TRS = BRS = VRS #TelanganaElectionResults — Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023 ఇది ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ వెనుకంజలో ఉన్నారు. 200 cr Kcr money Vs seethakka After completing 13 rounds 20 thousand majority to seethakka .. More 9 rounds to go.. #TelanganaElectionResults @RahulGandhi @priyankagandhi @kharge @revanth_anumula @srinivasiyc — Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023