breaking news
-
TS: తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు.. ప్రజలివ్వడమే మేలు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నెల రోజుల పాలన సంతృప్తి ఇచ్చిందని చెప్పారు. సంతోషమే. కాకలు తీరిన యోధుడుగా పేరొందిన బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రేవంత్ పాలన నెలరోజులు సాఫీగానే సాగిపోవడం వరకు ఓకే.కాని తన పాలనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాకుండా ప్రజల నుంచి పొందగలిగితే ఆయనకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీడియా లో రేవంత్ సంతృప్తి ప్రకటించడం తప్పు కాదు. తానే ఏదైనా ఆడ్వర్స్ వ్యాఖ్య చేస్తే దాని ప్రభావం ప్రభుత్వంపైన, మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన ఉంటుంది.ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న అలాగే చెబుతారు. కాని ఒక్కసారి మొత్తం పరిస్తితిని సమీక్షిస్తే ప్రభుత్వం వచ్చిన కొత్త కనుక ఎవరికి వారు సర్దుకుపోతున్నట్లుగా అనిపిస్తుంది.ఎవరైనా కామెంట్ చేసినా వారిపై ఎదురు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులే అయినా విమర్శలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.మంత్రులు కాని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాని ప్రస్తుతానికి ఒకింత అయోమయ పరిస్థితిలో ఉన్నారనిపిస్తుంది. కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలిగారు కాని, తాము ఈ ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లుగా ఉంది. ఆయా నిర్ణయాలను మార్చుకోవలసి రావడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడం ఎలా అన్నది అర్ధం కాక తలపట్టుకుంటున్న తీరు కనిపిస్తూనే ఉంది. ఇవి ఒక ఎత్తు అయితే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి ముఖ్యమంత్రి పదవిపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించేవి. మల్లు భట్టి నేరుగా అనకపోయినా, ఆయన మనసులోని మాటను భార్య బయటపెట్టారని అనుకోవచ్చు. మరో వైపు ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు క్యాబినెట్ లో బాగా ప్రాదాన్యం ఉందని చెప్పడంపై కూడా కాంగ్రెస్‌లో చెవులు కొరుక్కుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘట్టాలు మరెన్నో వచ్చే అవకాశం ఉంది. కర్నాటకలో సైతం పదవుల పంచాయతీ తెగడం లేదు. తెలంగాణ కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. ఈ అంశాన్ని పక్కనబెడితే రేవంత్‌రెడ్డి కొన్ని తప్పులు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. రేవంత్ దురుద్దేశంతో పొరపాట్లు చేశారని చెప్పకపోయినా, ఆయన కొన్ని నిర్ణయాలలో కొంత అనుభవ రాహిత్యం తెలుస్తుంది. ఉదాహరణకు ఫార్మాసిటీ రద్దు ప్రకటన ప్రభుత్వానికి నష్టం చేసిందన్న అభిప్రాయం ఉంది.దాంతో సర్దుబాటు ధోరణికి వెళ్లి పార్మాసిటీని ఏదో విభజిస్తామని,ఇంకేదో చేస్తామని చెప్పినా, దానిలో స్పష్టత లేదు. ఫార్మాసిటీ ఆధారంగా జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు దెబ్బతిన్నాయన్న భావన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మందగించింది. ఈ ప్రభుత్వం వచ్చాక అది ఇంకా మెరుగు కాలేదు. కొద్ది రోజుల క్రితం కూడా మీడియాలో వచ్చిన కధనాలు చూస్తే వేలాది అపార్టుమెంట్ల అమ్మకాల కోసం ఎదురు చూస్తున్నాయి. భూముల క్రయ,విక్రయాల లావాదేవీలు ఆశించినంతగా పుంజుకోలేదు.గత ప్రభుత్వ టైమ్ లో అట్టహాసంగా ప్రచారం పొందిన ఎఫ్ 1 కార్ రేసింగ్ ఒప్పందాన్ని రద్దు చేయడం , ఆ సంస్థను తిరిగి డబ్బు చెల్లించాలని నోటీసు ఇవ్వడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది. రేవంత్ పై దాడి చేసే మీడియా లేకపోయింది కాబట్టి సరిపోయింది కాని, ఈపాటికి గందరగోళం సృష్టించి ఉండేవి. ఉదాహరణకు ఎపిలో ఇలాంటి నిర్ణయాలు ఏవి జరిగినా ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియా రచ్చ,రచ్చ చేసి ఉండేవి. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని సమాచారం వచ్చింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం. గతంలో జగన్ ప్రభుత్వం ఎపిలో పిపిఎల సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఎంత రభస చేశాయో గమనిస్తే, ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌కు అలాంటి ఇబ్బందులు లేవని అర్ధం చేసుకోవచ్చు. దానికి కారణం ఈనాడు రామోజీరావుకు తెలంగాణలో ఆస్తులు అధికంగా ఉండడం, తాను భుజాన వేసుకుని తిరిగే తెలుగుదేశం పార్టీ కూడా రేవంత్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తుండడంతో ఆయన నోరు మెదపడం లేదు. ఇక ఆంద్రజ్యోతి రాదాకృష్ణ అయితే ప్రస్తుతానికి రేవంత్ ప్రభుత్వాన్ని తెగ పొగిడేస్తున్నారు. దీనికి కూడా ఒక కధ లేకపోలేదు. మధ్యలో కొద్దిరోజులు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలని కొన్ని కదనాలు ఇచ్చారట.దాంతో రేవంత్ దిగి వచ్చి రాధాకృష్ణ కోరినట్లు వ్యవహరించారన్న అభిప్రాయం వ్యాప్లిలోకి వచ్చింది. ముఖ్యంగా ఏ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా , ఆంధ్రజ్యోతికి మాత్రం ఇవ్వక తప్పలేదు.దానికి కారణం రాదాకృష్ణ బ్లాక్ మెయిలింగేనని రాజకీయవర్గాలలో ప్రచారం అయింది. పైగా రేవంత్‌ను ముఖ్యమంత్రిగా కాకుండా, అదేదో తన అదీనంలో ఉన్న వ్యక్తి మాదిరి ఆయన ఇంటర్వ్యూ చేశారని పలువురు వ్యాఖ్యానించారు. రాధాకృష్ణ ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్, వ్యవహార శైలి అంత అహంకారపూరితంగా ఉన్నాయని అంటున్నారు. రేవంత్ వీటిని భరించడమే కాకుండా, రాధాకృష్ణ ట్రాప్‌లో పడి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని పరోక్షంగా కించపరుస్తున్నట్లుగా మాట్లాడారని సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం అయింది.ప్రత్యేకించి ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కొనుగోళ్ల లావాదేవీలు మొదలైనవాటికి సంబందించి అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ప్రకృతి జవాబు ఇచ్చిందన్నట్లుగా వ్యాఖ్యానించడం నిజంగానే అభ్యంతరకరం అని చెప్పకతప్పదు. నిజానికి ఏపాటి కొద్ది అనుభవం ఉన్న జర్నలిస్టు అయినా ఒక ప్రశ్న కచ్చితంగా వేసి ఉండేవారు.రేవంత్ కూడా గతంలో ఒక నామినెటేడ్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో పట్టుబడిన సంగతిని గుర్తు చేసేవారు.ఆ ప్రశ్న వేయకుండా వైఎస్ ఆర్ ను కించపరిచేలా రాధాకృష్ణ ప్రశ్నించడం, దానికి రేవంత్ సమర్ధించడం బాగున్నట్లు అనిపించదు.అయినా ప్రస్తుతం రేవంత్ నిస్సహాయుడని అనుకోవాలి. ఇదే రేవంత్ ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ ఆర్ ను పొగిడిన ఘట్టాలు మరచిపోయి మాట్లాడినట్లు అనిపిస్తుంది.ఎపి ముఖ్యమంత్రి జగన్ పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలను రాధాకృష్ణ చేయించారు. జగన్ పోన్ చేసి అభినందించలేదని రాధాకృష్ణ అన్నప్పుడు అలా ఎందుకు! ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు కదా అని అనిఉండాల్సింది.అలాకాకుండా భిన్నంగా మాట్లాడడం అంత సరికాదనిపించింది. పైగా ఇదే రాధాకృష్ణ గతంలో జగన్ పోన్ చేస్తే రేవంత్ పోన్ ఎత్తలేదని, అదేదో గొప్ప విషయంగా రాశారు. రేవంత్‌ను రాదాకృష్ణే నడిపిస్తున్నారన్న భావన ప్రబలితే అది ఆయనకే నష్టం అని చెప్పాలి. ప్రజావాణి, ప్రజాపాలన వంటి విషయాలలో ప్రభుత్వానికి అంత మంచి మార్కులేమీ రాలేదు. ఆర్టిసి బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం వరకు కాస్త పాజిటివ్ గా ఉన్నా దాని దుష్పరిణామాల ప్రభావం ఎక్కువగా కనిపించేలా ఉంది.ప్రజా పాలన పేరుతో సంబంధిత ఆరు గ్యారంటీల స్కీముల కోసం తెలంగాణ ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్లపై క్యూ కట్టవలసి రావడం, ఆ దరఖాస్తులు ఒక చోట రోడ్లపై కనిపించడం కూడా అప్రతిష్టే అయింది.ఇక్కడే ఎపి తో పోల్చుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. రైతు భరోసా కింద గత నెల తొమ్మిదిన వేస్తామన్న పదిహేనువేల రూపాయలు రైతుల ఖాతాలలో పడకపోవడం అసంతృఫ్తికి దారి తీసింది.ఇళ్లకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే ఇవ్వడం వంటివి ఇంకా మొదలు కాలేదు. ఇవన్ని ఒక రూపానికి వచ్చి ఎప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్దుకుంటుందో ఎవరూ చెప్పలేరు. - కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్. -
TS: ఎమ్మెల్సీలు.. నామినేటెడ్ జాబితా..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఈ నెల 18 నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో అధిష్టానం నుంచి ఆమోదం పొందేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 14న దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోపే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి, హైకమాండ్ ఆమోదముద్ర వేయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల పేర్లతో పాటునామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కొందరి పేర్లతో కూడిన జాబితాను సీఎం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఈ విషయమై శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియాగాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అవుతారని తెలిసింది. పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుస్తారని సమాచారం. ఆ ఇద్దరు ఎవరో..? రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీలో అంతర్గతంగా చాలామంది పోటీ పడుతుండగా, సీఎం ఢిల్లీ వెళ్లడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్ అభిప్రాయాన్ని తీసుకుని అధిష్టానానికి నివేదించారు. రెండురోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి అభిప్రాయం కూడా పార్టీ పెద్దలు తీసుకున్నారు. కాగా ఈ స్థానాల కోసం ఎస్సీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గానికి చెందిన నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. అద్దంకి దయాకర్, మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్‌తో పాటు చిన్నారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం? గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా స్థానం భర్తీపై కూడా హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుండగా, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టులకు పోటీ పదుల సంఖ్యలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులకు నామినేట్ అయ్యేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. అయితే వీటిలో ప్రధానమైన కార్పొరేషన్ల విషయంలో, ఇటీవలి ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని నాయకులు, పార్టీ కోసం కష్టపడిన పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. రాహుల్‌తో కలిసి ఇంఫాల్‌కు సీఎం మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ప్రారంభం కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 14న ఢిల్లీ నుంచి రాహుల్‌తో కలిసి ఆయన ఇంఫాల్ వెళతారు. యాత్ర ప్రారంభం తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుని అదేరోజు సాయంత్రం దవోస్కు బయలుదేరి వెళ్తారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్తారు. -
‘కారు’ వెళ్లింది.. సర్వీసింగ్‌కే..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు ఓటమి కొత్తకాదని, ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటిదేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె తారక రామారావు వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు విరామమెరుగకుండా పనిచేసిన కారు మరింత స్పీడ్‌గా పనిచేసేందుకు సరీ్వసింగ్‌కు మాత్రమే పోయిందని, షెడ్డులోకి పోలేదంటూ బీఆర్ఎస్ శ్రేణులకు ధైర్యం నూరిపోశారు. పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదనీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలుకావడానికి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగత నిర్మాణం జరగలేదని, ఇతర పార్టీల నుంచి వ న వారికి సరైన గుర్తింపును ఇవ్వలేకపోయామనీ, అందుకు కూడా తనదే పూర్తి బాధ్యతన్నారు. పది రోజులుగా జరుగుతున్న బీఆర్ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా జరిగిన సమీక్షల్లో పార్టీ ఓడిపోవడానికి ప్రధానంగా గుర్తించిన కారణాలను కేటీఆర్ వివరించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఓటరుకు, కార్యకర్తకు మధ్య లింకు తెగింది ‘నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని, గత పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆరి్ధక పరిస్థితిని కూడా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వానికి పథకాలకు నడుమ కార్యకర్తల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుడికే ప్రయోజనం చేకూరడంతో ఓటరుకు, కార్యకర్తకు నడుమ లింకు తెగిందని పలువురు నేతలు చెప్పారు. ‘ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చి నా, ప్రతీ నియోజకవర్గంలో 15వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినా జనంలోకి తీసుకెళ్లలేక పోయాం. వందలో ఒకరికి రేషన్‌కార్డు రాకున్నా నెగెటివ్ ప్రచారం జరిగింది. దళితబంధు కొందరికే రావడంతో అర్హత కలిగిన ఇతరులు అసహనంతో పార్టీకి వ్యతిరేకమయ్యారు. దళితబంధు ఇవ్వడంపై ఇతర కులాల్లో వ్యతిరేకత ఏర్పడింది’ అని సమీక్షలో అభిప్రాయం వ్యక్తమైంది. ‘రైతుబంధు అందరికీ వర్తింప చేసినా ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూస్వాములకు లబ్ధి జరగడాన్ని సామాన్య రైతు ఒప్పుకోలేదని తేలింది. పార్టీ పట్ల ప్రజల్ల నెలకొన్న వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోవడంతోనే అధికారానికి దూరమైనట్లు విశ్లేషణలో తేలింది’ అని కేటీఆర్ వెల్లడించారు. సమీక్షల్లో భాగంగా వస్తున్న అభిప్రాయాలను ఏరోజుకారోజు పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదు బీఆర్ఎస్ను ఓడించడం ద్వారా ప్రజలు తప్పు చేశారంటూ అక్కడక్కడా పార్టీ నాయకులు అంటున్నారు. రెండు పర్యాయాలు మనల్ని గెలిపించింది ప్రజలే. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు’అని కేటీఆర్ పార్టీ నేతలకు హితవు పలికారు. ’’సంయమనం పాటించాలని కేసీఆర్ సూచించినా కాంగ్రెస్ బీఆర్ఎస్ను రెచ్చగొట్టి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీ వేదికగా మన నేతలు కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. స్వయంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేరు.ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, నష్టపోతున్న ఆటో డ్రైవర్ల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించాలి.’’అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు ‘‘బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ పొత్తు లేదు, భవిష్యత్తులోనూ ఉండదు. కవిత అరెస్టు కాకపోవడానికి సుప్రీంకోర్టు జోక్యమే తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మకై బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూశాయి. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు వల్లే రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారు. అమిత్ షాతో రేవంత్ భేటీ తర్వాతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ పద్ధతి మారింది. ఎమ్మెల్సీ ఉపఎన్నికల తీరుపై హైకోర్టుకు వెళ్లినా నిరాశ తప్పలేదు. రాజకీయం కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటోంది. మేము కూడా యాద్రాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిలో పంచితే గెలిచే వాళ్లమేమో. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రొటోకాల్ ఉల్లంఘనలు సీరియస్‌గా తీసుకుంటూ తప్పుడు కేసులు ఎదుర్కొంటాం’ అని కేటీఆర్ వెల్లడించారు. -
అది కరెక్ట్ కాదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి స్పందించారు. శుక్రవారం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక భేటీలో ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలనపై అతి శ్రద్ధతో పార్టీ సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగనందునే ఓడామని.. అందుకు పూర్తి బాధ్యత తనదేనని వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో ఓటమికి పది కారణాలను పార్టీ కేడర్‌కు ఆయన వివరించారు. ‘‘బీఆర్ఎస్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు. ప్రజలు తప్పుచేశారడనం సరికాదు. రెండుసార్లు మనల్ని గెలిపించింది కూడా ప్రజలే. మొత్తం స్థానాల్లో 14 చోట్ల వందల్లో, వేలల్లో మాత్రమే మన మెజార్టీ తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాల్ని సమీక్షించుకోవాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలి’’ అని కేడర్‌కు పిలుపు ఇచ్చారాయన. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి పది కారణాలను కేటీఆర్ వివరించారు. పరిపాలనపైనే దృష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు. అందుకు పూర్తి బాధ్యత నాదే. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు సరైన గుర్తింపు ఇవ్వలేకపోయాం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కేంద్రంగా మారి పార్టీని నడపడం సరికాదు. ఈ పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితి పట్టించుకోలేదు. ప్రభుత్వానికి పథకాల మద్య కార్యకర్త లేకుండానేరుగా లబ్ధిదారుడికి పథకం చేరడంతో ఓటర్‌కి.. కార్యకర్తకు లింక్ తెగిపోయింది. రాష్ట్రంలో గత పదేళ్లలో 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినా.. ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్లలేకపోయాం. ప్రతీ నియోజకవర్గంలో 15 వేల కొత్త పెన్షన్లు ఇచ్చిన విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లలేకపోయాం. వందలో ఒక్కరికి రాలేదు.. అదే నెగెటివ్‌గా ప్రచారం అయ్యింది. దళిత బంధు కొందరికే రావడంతో మిగతా వాళ్లు ఓపిక పట్టలేకపోయారు. వాళ్లంతా అసహనంతో మనకు వ్యతిరేకం అయ్యారు. రైతు బంధు తీసుకున్న సామాన్య రైతు కూడా.. ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి ఇస్తే ఒప్పుకోలేదు’’ అని ఓటమి కారణాల్ని కేటీఆర్ విశ్లేషించి.. బీఆర్ఎస్ కేడర్‌కు వివరించారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్తులో ఉండదు. ఇక ఎమ్మెల్యే చుట్టూ తిరిగే విధానం ఉండదు. పార్టీ చుట్టురానే ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుంది. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించం అని కేడర్‌ను హెచ్చరించారాయన. -
ఓటమిని అంగీకరించే స్థితిలో కేటీఆర్ లేడు: జీవన్ రెడ్డి సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలపై సెటైరికల్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగలేదు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేడు అంటూ కామెంట్స్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కాగా, జీవన్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదు. మిషన్ భగీరథ పెద్ద స్కాం. కాళేశ్వరం రీ-డిజైన్ పెద్ద బోగస్. కేవలం కమీషన్ల కోసమే రీ-డిజైన్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్‌ను ఎస్సీ డెవల్మెంట్ ఫండ్‌గా మార్చి.. నిధులను మళ్లించింది. నిధుల దారి మళ్లింపును చర్చకు రాకుండా చేసేందుకు దళితబంధును తెరపైకి తెచ్చారు. గిరిజనులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచింది. అందుకే వాళ్లంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో ఎన్నికల ముందు హాడావిడి చేశారు. బీఆర్ఎస్ పరోక్ష మిత్ర పక్షంగా భావిస్తున్న బీజేపీ పక్కలో బల్లెంలా కాచుకుని ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్లం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వందలాది సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసినా ఏనాడూ ప్రజలను రోడ్ల మీద వరుసల్లో నిలబెట్టలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల సౌకర్యాల గురించి ఆలోచించామే తప్ప రాజకీయ ప్రయోజనాలు, ప్రచారం గురించి ఆలోచించలేదన్నారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మళ్లీ గెలిచేవాళ్లమని చెప్పారు. తెలంగాణ భవన్లో గురువారం జరిగిన మహబూబాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రచారం చేసిన అబద్ధాల ముందు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఓడిపోయింది. అధికారంలోకి వస్తామనే ఆశలు లేని కాంగ్రెస్.. నోటికొచ్చిన హామీలను ఇచ్చింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు. కొత్తగా 6.47 లక్షల రేషన్‌కార్డులు, అత్యధిక వేతనాలు, 46 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినా ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యాం. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదు. బీఆర్ఎస్కు అసెంబ్లీలో మూడో వంతు సీట్లు రాగా, 14 స్థానాల్లో కేవలం 6 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయాం. కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్కు ఓట్ల తేడా కేవలం 1.85 శాతం మాత్రమే. గిరిజనుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకుంటాం. స్థానిక సంస్థలు మొదలుకుని అసెంబ్లీ ఎన్నికల దాకా బలమైన నాయకత్వం ఉంది. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు పార్టీకి అండగా ఉన్నారు’అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులు, శ్వేతపత్రాల పేరిట రేవంత్ రెడ్డి నాటకాలాడుతున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే స్వేదపత్రం రూపొందించాం. అన్ని వర్గాలకు పార్టీ దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం’అని కేటీఆర్ చెప్పారు. ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే: హరీశ్‌రావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు ఇలా అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ది చేసినా కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసింది. రుణమాఫీ, ధాన్యానికి బోనస్ తదితరాలపై మాట తప్పి దగా చేశారు. విద్యుత్‌లో కొత్త విధానం అంటే విద్యుత్‌ను 48 గంటలు ఇస్తారా. లోక్‌సభ ఎన్నికల్లో సమష్టిగా కష్టపడదాం. నెల రోజుల్లో కేసీఆర్ తెలంగాణ భవన్లో ఉంటారు. కేడర్‌కు ఏ సమస్య వచ్చినా బస్సు వేసుకుని మీ ముందుకొస్తాం. కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేసి కేడర్ పిల్లలకు సహకారం అందిస్తాం. అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కాపాడేందుకు తెలంగాణ భవన్‌తోపాటు జిల్లా కార్యాలయాల్లోనూ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. మండల, జిల్లా కమిటీలు వేసుకొని పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన బీఆర్ఎస్కు గెలుపోటములు కొత్త కాదు. గల్లీలో ఎవరున్నా తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో కాపాడటం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌కు చూపింది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అప్పుడే కుమ్ములాటలు కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలయ్యాయని, మంత్రి పొంగులేటి తానే నంబర్ 2గా చెప్పుకుంటున్నారని, డిప్యూటీ సీఎం భట్టి ముఖ్యమంత్రి పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. ‘కేటీఆర్, హరీశ్‌రావు కృష్ణార్జునుల తరహాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలి. గతంలో ఎంపికైన దళిత బంధు లబి్ధదారులకు సాయాన్ని ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం’అని కడియం పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ టీఆర్ఎస్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పార్టీగా అవతరించి లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు సుమారు తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరును మునుపటి మాదిరే తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్)గా మార్చాలనే ఒత్తిడి పెరుగుతోంది. తొమ్మిది రోజులుగా జరుగుతున్న బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఈ మేరకు పార్టీ నాయకులు ముక్తకంఠంతో కోరుతున్నారు. కిందిస్థాయి నేతల నుంచి వస్తున్న డిమాండ్‌కు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. ఈ నెల 3 నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వరకు ఇవి కొనసాగనున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఈ భేటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ కేడర్ తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం ఇస్తున్నా రు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత కంటే ఇటీ వలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, పార్టీ పనితీరు, సంస్థాగత నిర్మాణం లేకపోవడం వంటి అంశాలపైనే పెద్ద సంఖ్యలో సలహాలు, సూచనలు అందుతున్నాయి. తెలంగాణ సెంటిమెంటుతో పెనవేసుకుపోయాం ముఖ్యంగా రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడాన్ని పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రజల్లో నేటికీ టీఆర్ఎస్గానే పా ర్టీకి గుర్తింపు ఉందని, పార్టీ పేరులో ‘తెలంగాణ’లేకపోవడంతో ఆత్మ లోపించినట్టుగా ఉందని చెప్తున్నారు. తెలంగాణఆత్మగౌరవంతో ముడిపడిన పార్టీ పేరులో ఆ పదం లేకపోవడం లోపంగా మారిందని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా ఓ అంశంగా పనిచేసిందని అంటున్నారు. తెలంగాణ అనే సెంటిమెంటుతో సుమారు రెండు దశాబ్దాలకు పైగా తాము పెనవేసుకు పోయామని, పార్టీ పేరు మార్చడాన్ని తమతో పాటు కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు జీర్ణించుకోలేక పో తున్నామని స్పష్టం చేస్తున్నారు. విపక్ష పార్టీలు, వారి కనుసన్నల్లో నడిచే మీడియా, డిజిటల్ వేదికలు, యూట్యూబ్ చానెళ్లు ఇదే అంశాన్ని ఎజెండాగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీ పోషించిన పాత్రను తక్కువగా చేసి చూపించే ప్రయత్నం చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పేరిట చివరగా పోటీ చేసిన మునుగోడులో గెలుపొందామని, బీఆర్ఎస్ పేరు పార్టీకి అచ్చిరాలేదనే సెంటిమెంటును కూడా కొందరు నేతలు లేవనెత్తుతున్నారు. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలనే తమ విన్నపాన్ని పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నారు. పార్టీ నేతల నుంచి వస్తున్న ఈ ప్రతిపాదనను సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సహా ఇతర కీలక నేతలు బలపరుస్తుండటం గమనార్హం. జాతీయ స్థాయిలో కూటమికి ఓకే జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు అ వసరమైన భావసారూప్య పార్టీలతో కూటమి ఏర్పాటు చేసే కార్యక్రమానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే తమకు అభ్యంతరం లేదని పార్టీ నాయకులు నొక్కి చెప్తున్నారు. తెలంగాణ సాధించిన నేతగా జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు మంచి పేరుందని అంటున్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. జాతీయ అంశాలకు సంబంధించి ఒత్తిడి పెంచేందుకు భావసారూప్య శక్తులతో కలిసి నడవాలనే సూచనలు కూడా ఈ భేటీల్లో వస్తున్నాయి. కాగా ఈ నెల 22న భేటీలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక రూపొందించి కేసీఆర్‌కు ఇవ్వాలని ముఖ్య నేతలు నిర్ణయించారు. కేసీఆర్ ఆమోదం తెలిపిన పక్షంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే లోపు పార్టీ పేరు మార్పు ప్రక్రియను పూర్తి చేస్తామని బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
కాంగ్రెస్‌ను ప్రజలు క్షమించరు
సాక్షి, హైదరాబాద్: అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్య క్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించాలనే నిర్ణయాన్ని ప్రజలు క్షమించ రని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించడం కాంగ్రెస్ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంటే కాంగ్రెస్‌కు కంటగింపు ఎందుకని ప్రశ్నించారు. గురువారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడు తూ అభద్రతాభావంతో, కుహనాలౌకికవాదంతో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తూ హిందుత్వ వ్యతిరేక వైఖరిని చా టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు, బుజ్జగింపు, మతతత్వ రాజకీయాల కోసం, తమ దుర్మార్గపు ఆ లోచనల పరంపరలో భాగంగానే అయోధ్యకు వచ్చేది లేదంటూ కాంగ్రెస్ రాజకీయ దృక్పథంతోనే ఈ నిర్ణయం తీసు కుందన్నారు. రాముడి ఉనికినే కొట్టివేసిన చరిత్ర కాంగ్రెస్‌దని, బహిష్కరించడం ఆ పార్టీకి అలవాటయిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నా యకత్వంతో కాంగ్రెస్ పార్టీ.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, హిందువుల జీవన విధానంపై ఏమాత్రం గౌర వం లేకుండా వ్యతిరేకంగా మాట్లాడుతోందని నిందించారు. మజ్లిస్ మెప్పు పొందేందుకే హిందువులపై కేసులు పార్లమెంట్, జీ–20, ఎన్నికల కమిషన్ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించిందని దేశ సమగ్రత దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. అయోధ్య రామాలయ అక్షింతలు పంపిణీ చేస్తుంటే సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నొప్పి ఏంటి? పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వారం రోజుల తర్వాత ఎవరి ఒత్తిడితో కేసులు పెట్టారని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ మెప్పు పొందేలా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్‌కు ముందుంది ముసళ్ల పండుగ ప్రస్తుతం కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లకే పరిమితమైందని, ఇంకా ఆ పార్టీకి ముందుంది ముసళ్ల పండుగ అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఈనెల 22న శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా.. అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు, కవులు, కళాకారులు, సాధుసంత్‌లు, సామాజిక సంస్థలు, ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారని చెప్పారు. ఈ ప్రారం¿ోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా గాం«దీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అ«దీర్ రంజన్ చౌదరిలను ట్రస్టు ఆహ్వానించిందని కిషన్‌రెడ్డి వివరించారు. -
14 నుంచి రాహుల్ గాంధీ ‘న్యాయ్ యాత్ర’
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14 నుంచి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ప్రారంభిస్తారని ఏఐసీసీ జాతీ య అధికార ప్రతినిధి షమా అహ్మద్ తెలిపారు. గురువారం ఆమె గాం«దీభవన్‌లో మాట్లాడుతూ మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యాత్ర ఉంటుందని, మొత్తం 6,700 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని వివరించారు. దేశంలో యువత ఉద్యోగాలు, ఉపాధిలేక అల్లాడుతోందని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రతీ ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ సర్కార్ మోసం చేసిందని, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరి గిపోయాయని విమర్శించారు. దీంతో సామా న్య ప్రజల జీవనం కష్టంగా మారిందని అన్నా రు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులపై ఈడీ, ఐటీ సంస్థలను ఉపయోగిస్తున్నారన్నా రు. మరోవైపు కిసాన్, దళిత, ఆదివాసీలు, మ ణిపూర్‌లో చర్చిలు, ముస్లిం మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. -
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఏర్పడిన ఖాళీల భర్తీకి ఈ ఉప ఎన్నికలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం పేర్కొంది. ఈ నెల 18తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. 29న పోలింగ్ జరగనున్నారు. -
రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. రెండు స్థానాలూ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశమున్న నేపథ్యంలో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దీపాదాస్మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం తీసుకుని అధిష్టానానికి నివేదించారు. లోక్‌సభ సమన్వయకర్తల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడా అధిష్టానం పెద్దలు ఈ విషయమై చర్చించి ఆయన అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసం ఎస్సీ, బీసీ, మైనార్టీ ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రేవంత్ మంత్రివర్గంలో కచి్చతంగా స్థానం లభిస్తుందని భావిస్తున్న తుంగతుర్తి నాయకుడు అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే కోటాలో ప్రకటించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన బీసీ వర్గాలకు చెందిన నాయకుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు కూడా దాదాపు ఖరారైందని సమాచారం. వీరిద్దరితో పాటు మైనార్టీ కోటాలో షబ్బీర్‌అలీ, ఫిరోజ్‌ఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని, పటేల్ రమేశ్‌రెడ్డిని నల్లగొండ ఎంపీగా, చిన్నారెడ్డిని మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంపించే ఆలోచనలో కాంగ్రెస్‌పెద్దలున్నట్టు సమాచారం. -
లోక్‌సభ ఎన్నికలు: ఏఐసీసీ కీలక సమావేశం.. వ్యూహాలపై దిశానిర్దేశం
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, లక్షదీప్ రాష్ట్రాలకు సంబంధించిన నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో కాంగ్రెస్ అధిష్టానం సమావేశమైంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రచారం, పోల్ మేనేజ్మేంట్, ప్రజలతో మమేకం వంటి అంశాలపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మార్గనిర్ధేశం చేశారు. రెండు గ్రూపులుగా సమావేశం నిర్వహించగా, మొదటి సమావేశంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి.. రెండో సమావేశంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గోవా, అండమాన్ అండ్ నికోబార్ల కోఆర్డినేటర్లతో మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేలా కో ఆర్డినేటర్లు ప్రయత్నం చేయాలని ఖర్గే అన్నారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికలలో పార్టీ విజయం కోసం అధిష్టానం దిశ నిర్దేశం చేసిందని, తెలంగాణలో అత్యధిక స్థానాలలో గెలవాలని ప్రయత్నం చేస్తామన్నారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరినట్లు భట్టి తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారని కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయన్నారు. మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని, మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని ఖర్గే సూచించారన్నారు. అత్యధిక స్థానాలు గెలిపించే బాధ్యత కో ఆర్డినేటర్లపై ఉందని ఖర్గే దిశానిర్దేశం చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఉత్సాహాన్ని లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగించి మెజారిటీ స్థానాల్లో గెలవాలని సూచించారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని, అధిష్టానం సూచనల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు. -
బహిష్కరించడం కాంగ్రెస్‌కు అలవాటైంది: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం సరికాదని.. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌లో భాగంగానే ఆ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జనవరి 22 కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోందన్నారు. బహిష్కరించడం కాంగ్రెస్‌కు అలవాటైందని ధ్వజమెత్తారు. అయోధ్య కేసు విచారణ సమయంలోనూ కాంగ్రెస్ వితండ వాదం చేసింది. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు అభద్రతా భావంలో ఉంది. హిందువులకు సంబంధించిన ప్రతీ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకధోరణి మరోసారి బయటపడిందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘‘కాంగ్రెస్‌కు భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలపై గౌరవం లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాయకత్వంతో భారత సంప్రదాయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడుతోంది. హిందుత్వం ఒక మతం కాదు.. జాతీయ జీవన విధానం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘అయోధ్య రామాలయ అక్షింతలు పంపిణీ చేస్తుంటే.. సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఏంటి? కాంగ్రెస్ పార్టీ కి వచ్చిన నొప్పి ఎంటి ? పోలీసులకొచ్చిన ఇబ్బంది ఏంటి?. వారం రోజులు తర్వాత ఎవరి ఒత్తిడితో కేసులు పెట్టారు?. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉంది. రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామాలయ ట్రస్ట్ అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తుంది’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. ‘‘పార్లమెంట్ సమావేశాలను, G-20 సమావేశాలను, ఎన్నికల కమిషన్ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించింది. ప్రణబ్‌ముఖర్జీకి భారతరత్న ఇస్తే బహిష్కరిస్తారు. దేశ సమగ్రత దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు జనవరి 22న అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టకు హాజరు అవుతున్నారు. హిందుత్వాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ ఆనవాయితీగా పెట్టుకుంది’’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
పెద్దపల్లి: పుట్టామధుకు అవిశ్వాస గండం?
సాక్షి, పెద్దపల్లి: మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ ప్రస్తుత ఛైర్మన్ పుట్టామధుపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. ఆయనపై అవిశ్వాసం పెట్టడానికి జెడ్పీటీసీలు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఉత్కంఠ నెలకొంది. జెడ్పీటీసీ సభ్యులు రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. 2,3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి జడ్పీటీసీలు సిద్ధమవుతున్నారు. మెజార్టీ సభ్యుల అసమ్మతితో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కాగా, బుధవారం స్టాండింగ్కమిటీ సమావేశం ఉన్నప్పటికీ ఇద్దరు సభ్యులు మినహా మెజారిటీ జడ్పీటీసీలు కాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. అసంతృప్త జడ్పీటీసీలు వేర్వేరు చోట్ల క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. గత నెల 28న జరగాల్సిన జడ్పీ జనరల్ బాడీ సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మెజారిటీ బీఆర్ఎస్ సభ్యులు అవిశ్వాసానికి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు ఎన్టీపీసీలో జరగాల్సిన జెడ్పీ సర్వ సభ్య సమావేశం కూడా కోరం లేక వాయిదా పడింది. జిల్లాలోని 13 మంది జెడ్పీటీసీలకు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 11 మంది జెడ్పీటీసీలు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలుపొందారు. ఇటీవలే బీఆర్ఎస్ను వీడిన పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి బీజేపీలో చేరారు. ఓదెల జెడ్పీటీసి గంటా రాములు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మెజారిటీ సభ్యుల అసమ్మతి నేపథ్యంలో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. ఇదీ చదవండి: ముఖేష్ గౌడ్ కొడుకు దారెటు.? -
అమిత్ షా సీరియస్.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
తెలంగాణ కమలనాథుల తీరు మారడం లేదా?. ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా?. పార్టీ పెద్దలు వచ్చినప్పుడే కలిసికట్టుగా కనిపిస్తున్నారా?. బీజేపీ సమన్వయలేమి సమస్యను అధిగమించడం కష్టమేనా?. తెలంగాణ కాషాయదళంలో ఏం జరుగుతోంది?. అధిష్టానానికి అందిన రిపోర్ట్‌లో ఏముంది.. తెలంగాణ కాషాయ పార్టీ పార్లమెంట్ ఎన్నికల పోరుకు సిద్ధమవుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్ర పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ బీజేపీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నేతల మధ్య సమన్వయలోపం. దీనిపై పార్టీ అగ్రనేతలు చాలా సీరియస్‌గా ఉన్నారు. పార్టీలో గ్రూపులుగా విడిపోయి.. ఆధిపత్య పోరుకు దిగడంపై స్వయంగా అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరికి అమిత్ షా.. స్పెషల్ క్లాస్ తీసుకున్నా తీరు మాత్రం మారలేదు. సోషల్ మీడియాతో ఇద్దరు నేతల మధ్య వార్ ముదిరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరి నేతల మధ్య విబేధాలు.. రాష్ట్ర పార్టీకి డిస్ట్రబెన్స్గా మారాయి. ఇక పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో జాతీయ నేత మురళీధర్ రావు పార్టీ కార్యక్రమాలకు వచ్చామా? వెళ్లిపోయామా? అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రాష్ట్ర నేతల మధ్య ఐక్యత అన్నది కనిపించడంలేదు. నిత్య విరోధులుగా కనిపించే కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పనిచేసి అధికారం సాధించారు. బీజేపీలో మాత్రం నేతలు కలిసిపోయే పరిస్థితులు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి దాటి బయటకు వెళ్లరనే టాక్ ఉంది. అసంతృప్తితో రగిలిపోతున్న నేతలను పిలిచి మాట్లాడే నాయకత్వమే కరువైందని చాలా మంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన డాక్టర్ లక్ష్మణ్.. కేవలం ప్రెస్మీట్ల వరకే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. పార్టీ సమావేశాల్లో ఒకే వేదికపై కనిపించే నేతలు.. అంతర్గతంగా మళ్లీ చర్చించుకున్న దాఖలాలే లేవు. రాష్ట్ర నేతలందరూ కలిసి కట్టుగా ఒక్కోసారి ఒక్కోనేత ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ మీట్.. లంచ్ మీట్.. డిన్నర్ మీట్ ఏర్పాటు చేసుకోవాలని అమిత్ షా చాలా సందర్భాల్లో సూచించినా తెలంగాణ కమలం నేతలు ఏనాడు అమలు చేయలేదు. సమన్వయలేమి సమస్యకు చాలా సందర్భాల్లో పార్టీ హైకమాండ్ పరిష్కార మార్గాలు చూపినా రాష్ట్ర నేతలు మాత్రం లైట్ తీసుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఏనాడు పార్టీ వ్యవహరాల్లో ఇన్వాల్వ్ కాలేదు. నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మధ్య అంతర్గతపోరు ఇంకా ఆగలేదు. కొత్తగా చేరిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోవడంలో బీజేపీ విఫలమవుతోంది. అగ్రనేతలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీ నేతలంతా కలిసికట్టుగా ఉన్నట్లు నటిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇదంతా గమనిస్తున్న పార్టీ హైకమాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో నేతల మధ్య సమన్వయానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
TS MLC: ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను అసెంబ్లీ కార్యాలయం విడుదల చేసింది. కాగా, రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్లను జారీ చేసింది. నేటి నుంచే నామినేష్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది. ఈ నెల 18 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19న నామినేష్ల పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. అదేరోజున ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంతో రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉపఎన్నికలు నిర్వహిస్తున్నది. అయితే రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో సంఖ్యాబలం దృష్ట్యా అధికార కాంగ్రెస్ పార్టీకే ఆ సీట్లు దక్కనున్నాయి. -
కాళేశ్వరం, మేడిగడ్డ అంశంలో కాంగ్రెస్‌కు బండి సంజయ్ కౌంటర్
సాక్షి, కరీంనగర్: అయోధ్య రామ మందిరంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రతీ భారతీయుడు పాల్గొనాల్సిన చారిత్రక, ధార్మిక కార్యక్రమమిది అని అన్నారు. అయోధ్య కాంగ్రెస్ ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో తెలియడం లేదన్నారు. కాగా, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బండి సంజయ్ కరీంనగర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య రాముడు భారతీయ జనతా పార్టీకి మాత్రమే రాముడు కాదు, అందరివాడు. అయోధ్య రామమందిరాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రతి భారతీయుడూ పాల్గొనాల్సిన చారిత్రక, ధార్మిక కార్యక్రమం అది. ఎవరు ఎవరి బినామీలో అందరికి తెలుసునంటూ మాజీ ఎంపీ వినోద్‌కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ బినామీలమైతే సీబీఐ విచారణ మేమే ఎందుకు కోరతాం?. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయాలని కాంగ్రెస్ ఎందుకు కొరడం లేదు?. కేవలం మేడిగడ్డపైనే ఎందుకు విచారణ కోరింది?. మీరు, మేము ఇద్దరం కలిస్తేనే బీఆర్ఎస్ అవినీతి బయటకు వస్తుంది. నేటి యువతని మద్యానికి, డ్రగ్స్‌కు కొన్ని పార్టీలు బానిసలు చేస్తున్నాయి. కాలేజీలను అడ్డాలుగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
TS: పార్టీ హైకమాండ్‌కు విక్రమ్ గౌడ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్ మాత్రం తప్పటడుగులు వేస్తూ ఇప్పటివరకు స్థిరంగా నిలదొక్కుకోలేకపోయాడు. తాజాగా బీజేపీకి కూడా రాజీనామా చేశాడు విక్రమ్. ఏమీ ఆశించకుండా బీజేపీ కోసం పనిచేసినా తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదంటూ విక్రమ్ గౌడ్ విమర్శలు చేశారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్‌కు ఆయన లేఖ రాశారు. ఇక, లేఖలో..‘పార్టీలో కొత్త వారిని అంటరానివారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారు పేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే కొందరు చోద్యం చూస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా గుర్తింపు ఇవ్వడం లేదు. ప్రజా బలం లేనివారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఓటమికి, నేతల అసంతృప్తిపై ఎవరూ బాధ్యత తీసుకోలేదు. ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు’ తెలిపారు. ఇదిలా ఉండగా.. విక్రమ్ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాజకీయాల్లోకి వచ్చే విషయంలోనూ విక్రమ్ వేసిన తప్పటడుగులు.. ఆయన కెరియర్ను దెబ్బతీశాయి. గన్నుతో తనను తాను కాల్చుకుని సానుభూతి పొందాలనుకోవడం సంచలనంగా మారింది, కేసులకు దారి తీసింది. ఆ తర్వాత కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తొందరగా పార్టీలు మారడం విక్రమ్ ఎంత వరకు మేలు చేస్తాయో.. ముందు ముందు చూడాలి. -
కేసీఆర్ రక్తాన్ని,చెమటను ధారపోశారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు తన రక్తాన్ని, చెమటను ధార పోశారు. విధ్వంసమైన తెలంగాణను పదేళ్ల పాటు శ్రమించి వికాసం వైపు మళ్లించారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడ్డంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదు. తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్న తపనతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారు’అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ‘పరిపాలనపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి పార్టీకి కొంత తక్కువ సమయాన్ని కేటాయించాం. పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుని లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తాం. ప్రజలను మనల్ని పూర్తిగా తిరస్కరించలేదనే విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు పోదాం’అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో శిక్షణ తరగతులు ‘బీఆర్ఎస్ను ఊదేస్తామని కొందరంటున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు త్వరలో శ్రేణులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాం. పార్టీ కేడర్‌కు ఇకపై తెలంగాణ భవన్లో సీనియర్ నేతలతో పాటు నేనూ అందుబాటులో ఉంటా. ఇకపై తెలంగాణ భవన్ మా అడ్డా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోంది. తప్పుడు కేసుల బాధితులకు పార్టీ లీగల్ సెల్ అండగా నిలబడుతుంది. కేసులకు భయపడేది లేదు. తప్పుడు కేసులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకుని పోరాడాలి. పార్టీలో ఎవరిపై కేసులు పెట్టినా పార్టీ యంత్రాంగం అంతా సమష్టిగా స్పందించాలి’అని కేటీఆర్ స్పష్టం చేశారు. గ్యారంటీలను గుర్తు చేస్తూనే ఉండాలి ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలతో సహా అన్నీ 420 హామీలనే విషయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి. ప్రజలను మోసం చేయాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అసలు సినిమా ముందుంది. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలతోనే ఎండగట్టాలి. రాజకీయ అక్కసుతో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తున్న నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న పేద గొంతుకలకు మనం అండగా నిలబడాలి’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణంపై సమీక్ష జరగనందునే ఓటమన్న శ్రేణులు కాగా ఈ సమీక్షలో పలువురు నాయకులు, కార్యకర్తలు తమ ఆవేదన వెళ్లగక్కారు. 2014 నుంచీ పార్టీ నిర్మాణంపై ఎలాంటి సమీక్ష జరగనందునే ఓటమి పొందామని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. కింది స్థాయిలో ఏం జరుగుతుందో పార్టీ అధినేతకు చెప్పే ధైర్యం ఎమ్మెల్యేలు చేయలేదని, కాంగ్రెస్‌ను వదిలి బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం వల్లే ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఈ సమావేశానికి వచ్చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరుకు చెందిన శ్రీనివాస్ కాలుపై నుంచి ఎంపీ కేశవరావు కారు వెళ్లింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి కేశవరావు దగ్గరుండి చికిత్స చేయించారు. గ్యారంటీల అమల్లో అనుమానాలు: కడియం కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై అనేక అనుమానాలు ఉన్నాయని, కర్ణాటకలో గ్యారంటీల అమలు సాధ్యం కాదని అక్కడి సీఎం సలహాదారు చెప్పారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సమావేశం అనంతరం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ, రైతుబంధు, మహాలక్ష్మి పథకం తదితరాల అమలుపై సీఎం, డిప్యూటీ సీఎంకే స్పష్టత లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలపై శ్వేతపత్రాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫార్ములా వన్ రేస్ నిధులు దురి్వనియోగమైతే ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని, రద్దు చేయడం సరికాదని కడియం అన్నారు. -
కొన్ని తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము చేసిన కొన్ని తప్పిదాల వల్లే బీఆర్ఎస్ ఓటమి చెందినట్టు చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలు, శ్రేణులకు భరోసా ఇచ్చారు. కాగా, తెలంగాణ భవన్లో ఎనిమిదో రోజు వరంగల్ పార్లమెంట్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేటీఆర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి, మధుసుధనా చారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు. శాసనసభ ఎన్నికల్లో కలిసి మాట్లాడుకునే అవకాశం రాలేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. తల్లడిల్లి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు చల్లగా కాపాడుకున్నాం. కొన్ని తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందాము. ఇప్పుడు తెలంగాణ మళ్లీ ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్లింది. మన తెలంగాణ మన చేతులోకి తెచ్చుకునే సమయం ఆసన్నమైంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే పరిస్థతిలో లేరు, ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ గళం, బలం ఢిల్లీలో వినపాడలంటే మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉన్నది. సమీక్షా సమావేశంలో మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాము. మీరు చెప్పిన ప్రతీ అభిప్రాయం నోట్ చేసుకుంటాం’ అని వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఈ సమవేశానికి ఆలస్యంగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి లేటే, మీటింగ్‌కు కూడా ఆలస్యంగానే వస్తారా? అని చురకలు అంటించారు. -
ఆ రోజు కన్నీళ్లు కార్చాను.. మంత్రి పొంగులేటి ఎమోషనల్
సాక్షి, ఖమ్మం జిల్లా: గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షతకు గురయ్యారని, నిరుద్యోగులు అందరూ కలసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారంటూ వ్యాఖ్యానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఖమ్మం నగరంలోని భక్త రామదాస్ కళాక్షేత్రంలో రైట్ ఛాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఆత్మీయ సత్కారంలో మంత్రి పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆ కుటుంబం చెప్పిందే వేదం.. గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది. మా ప్రభుత్వంలో ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందని మంత్రి పేర్కొన్నారు. మంత్రి ఎమోషనల్.. నన్ను ఒంటరిగా చేసినప్పుడు కన్నీళ్లు కార్చానని.. ఆ రోజు అభిమానులు బాధపడతారని వారి ఎదుట ఎమోషనల్ కాలేదని.. మంత్రి పొంగులేటి భావోద్వేగానికి గురయ్యారు. ఇదీ చదవండి: ఆసక్తికరంగా ఖమ్మం పాలిటిక్స్.. ఎంపీ రేసులో మంత్రి సతీమణి? -
ఆసక్తికరంగా ఖమ్మం పాలిటిక్స్.. ఎంపీ రేసులో ఎవరెవరంటే?
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల సంబంధికులు టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ వస్తే పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నామన్న సంకేతాలను సైతం ఇప్పటికే ఇచ్చారు. వీరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టికెట్ ఎవరికి వస్తుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుంది. తెర వెనుక ఏం జరుగుతోంది?.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్‌కు తీవ్రమైన పోటీ నెలకొంది. ఎంపీ టికెట్ రేసులో ఉన్న వారంత కీలకమైన నేతలే. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా ఒక ఖమ్మం జిల్లాకే మూడు మంత్రి పదవులను కేటాయించిన విషయం తెలిసిందే. మంత్రి పదవులు వచ్చిన వారంత కీలక నేతలే కావడం విశేషం. డిప్యూటి సీఎం పదవి భట్టి విక్కమార్కకు రాగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుకు మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీగా సీట్లు రావడం వెనుక సైతం ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించారనే చెప్పాలి. ఇక, సీన్ కట్ చేస్తే ఈ ముగ్గురు మంత్రులకు చెందిన సంబంధికులు ఎంపీ టికెట్ రేసులో ఉండటం ఆసక్తికరమైన పరిణామంగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క సతీమణి మల్లు నందిని ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల వివిధ చోట్ల జరిగిన సభల్లో అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో భట్టికి ఉన్న అనుచర గణం, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మధిర నుంచి ఆయన విజయం సాధించడం వంటి అంశాలు నందినికి కలిసొస్తాయని మద్దతుదారులు చెబుతున్నారు. భట్టి పోటీ చేసిన ప్రతీసారి ఆమె నియోజకవర్గమంతా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న పరిచయాలు, భట్టి నాయకత్వం కలిసొస్తాయనే భావనతో పోటీకి సై అంటున్నారు. మరో కీలక నేత, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అరంగేట్రం నుంచి వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఏ కార్యక్రమం చేపట్టినా సోదరుడు ప్రసాద్‌రెడ్డి తెర వెనుక నుంచి అన్ని తానై చూసుకుంటున్నారు. పార్టీ నేతలు, కేడర్‌కు పూర్తిస్తాయిలో అందుబాటులో ఉంటూ 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పొంగులేటి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విస్తృత ప్రచారం చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో ప్రసాద్‌రెడ్డి ఖమ్మం ఎంపీ బరిలో నిలబడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ, పొంగులేటికి ఉన్న చరిష్మా తోడైతే ప్రసాద్‌రెడ్డి విజయం ఖాయమనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ పరిధి నేతలతో ఉన్న పరిచయాలు ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. సీనియర్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తనయుడు యుగంధర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహంతో ఉన్నారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం ఆలోచనలో ఉన్నట్లు తుమ్మల అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు స్థానాల్లో తుమ్మల పోటీ చేసినప్పుడల్లా యుగంధర్ పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ నేతలు, కేడర్‌ను సమన్వయం చేసే బాధ్యతలన్నీ ఆయనే దగ్గరుండి చూశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సైతం ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మలకు భారీ మెజార్టీ రావడంలో యుగేంధర్ కీలకంగానే వ్యవహరించారు. దీంతో యుగంధర్ ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ తుమ్మల అనుచరుల ద్వారా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు మంత్రుల సంబంధికులతో పాటు మరో ఇద్దరు నేతలు సైతం ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ సైతం టికెట్ కొసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీని సైతం తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని రాష్ట్ర నేతలు ఇప్పటికే కోరారు. సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే, ఒకవేళ పోటీ చేసే అవకాశం ఉంటే పార్టీ కొంత వీక్ ఉన్న ప్రాంతంలోనే సొనియాను బరిలో నిలిపాలని భావిస్తున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు మొదటి నుంచి మంచి పట్టు ఉంది. ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో సోనియా గాంధీ వంటి బలమైన నేతకు ఖమ్మం నుంచి పోటీ చేయిస్తే పార్టీకి కొత్తగా లాభం చేకూరేదేమీ ఉండదన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఈసారి కాంగ్రెస్‌లో ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి వస్తుందన్న ఆసక్తికరమైన చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. -
బీఆర్ఎస్లో దడ మొదలైంది: మంత్రి పొన్నం
సాక్షి, కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణతో బీఆర్ఎస్లో దడ మొదలైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదన్నారు. ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపిస్తామన్నారు. బీఆర్ఎస్ను కాపాడేందుకు బీజేపీ నేతలు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చి నెలరోజులవుతుంది. గ్యారంటీ స్కీమ్‌లపై దరఖాస్తులు స్వీకరించాం. చిత్తశుద్ధితో అమలు చేస్తాం. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సచ్చీలుడైతే తనపై వచ్చిన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. జెన్ కోతో పాటు ఇతర శాఖల్లో అక్రమంగా ఉద్యోగం పొందిన వారు వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళాలి. భూ అక్రమార్కులపై చర్యలు చేపడుతాం’’ అని మంత్రి హెచ్చరించారు. ఇదీ చదవండి: సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు -
సీఎం అనే రెండు అక్షరాలకంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే కాంగ్రెస్‌కు ప్రమాదం. సీఎం అనే రెండు అక్షరాలకంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఆయన ప్రజల మధ్యకు వస్తారు. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉంటేనే పోరాట పటిమ చూపగలుగుతాం. మనమంతా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్లమే. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనూ బీఆర్ఎస్ పోరాట పటిమను ప్రజలు చూశారు. ఇక రాబోయే రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు..’అని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో రాష్ట్ర, జిల్లా కమిటీలు ‘ప్రస్తుతం పార్టీ పరంగా జరుగుతున్న పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయి. త్వరలో బీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి రెండు మూడు నెలలకోమారు అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తాం..’అని కేటీఆర్ ప్రకటించారు. కేసీఆర్ దళంగా ముందుకు సాగుదాం ‘తక్కువ సమయంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్‌ను గెలిపించినా, ఏడాదిన్నరలోనే ప్రజలు ఆ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారు. అప్పట్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే దీనికి నిదర్శనం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకొనే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాగ్దానాలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు కాలయాపన చేస్తోంది. హామీల అమల్లో కాంగ్రెస్ వైఖరి పట్ల ప్రజల్లో అసహనం మొదలైంది. ఈ నేపథ్యంలో హామీల అమలు కోసం కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేలా బీఆర్ఎస్ చేసే పోరాటానికి పార్టీ యంత్రాంగం కార్యోన్ముఖులు కావాలి. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిపై సమీక్షించుకోవడంతో పాటు, పార్టీ పరంగా ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం. తెలంగాణ గళం, బలం బీఆర్ఎస్ పార్టీయే. రాబోయే ఎన్నికల్లో ‘కేసీఆర్ దళం’గా ఐకమత్యంతో ముందుకు సాగుదాం..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. దళితబంధు ఇచ్చినా ఓట్లు పడలేదు ‘మధిర నియోజకవర్గం పార్టీ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు.. 2019లో ఓడినా జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చాం. మధిర మండలం చింతకాని మండలంలో లబ్ధిదారులందరికీ దళితబంధు ఇచ్చినా కమల్‌రాజ్‌కు ఓట్లు పడలేదు. ఆయన నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ ఆయన గొంతు కోసిందంటూ వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నా. ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ టికెట్‌తో పాటు రూ.40 లక్షల చెక్కు ఇచ్చి పువ్వుల్లో పెట్టి చూసుకున్నాం..’అని కేటీఆర్ చెప్పారు. ఇక మీ కోసం మీ దగ్గరకే: మాజీ మంత్రి హరీశ్ ‘బీఆర్ఎస్ ఓటమి తాత్కాలికం. భవిష్యత్తు అంతా మనదే. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయి. కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు గనుక పూనుకుని ఉంటే కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారు. కేసీఆర్‌కు అభివృద్ధి తప్ప పగతనం తెలియదు..’అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘ఇకపై మేం హైదరాబాద్‌లో ఉండం. మీ కోసం మీ దగ్గరకే వస్తాం. నాలుగు రోజులు ఓపిక పడితే ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తారు..’అని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందినా వ్యతిరేక ఫలితాలు: నామా కేసీఆర్ పాలనలో ఖమ్మం అభివృద్ధి చెందినా బీఆర్ఎస్కు వ్యతిరేక ఫలితాలు వచ్చాయని ఎంపీ నామా నాగేశ్వర్రావు అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోవడాన్ని తాము ప్రశ్నిస్తున్నామంటూ, పార్లమెంటు ఎన్నికల కోడ్ వెలువడే లోపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ గొంతుగా బీఆర్ఎస్ నిలిచిందని, గత ఐదేళ్లలో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్ ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తిందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు మళ్లీ పూర్వవైభవం వస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఎంపీ రవిచంద్ర, మాజీ విప్ రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మదన్‌లాల్, కందాళ ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోదీ మూడోసారి ప్రధాని కావడాన్ని అడ్డుకోలేరు
సాక్షి, హైదరాబాద్: లక్షమంది అసదుద్దీన్లు, లక్ష మంది కేసీఆర్‌లు, లక్ష మంది రాహుల్‌గాంధీలు వచ్చినా నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావడాన్ని అడ్డుకోలేరని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అంచనాలకు మించిన ఫలితాలు రాబోతున్నాయని, వచ్చే ఐదేళ్లలో దేశంలో ఎవరూ ఊహించని మార్పులు జరగబోతున్నాయని చెప్పారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. 2047లోపు భారత్ అభివృద్ధి చెందాలని ప్రతి భారతీయుడు సంకల్పం తీసుకోవాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కోసం కాదు.. దేశాభివృద్ధి కోసం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ అంబాసిడర్‌గా మారాలని, నేను సైతం అన్నట్లు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎల్కే అద్వాని సారథ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలని 1990లో బీజేపీ (పాలమూరులో) తీర్మానం చేసిందని, అద్వాని రథయాత్ర చేపడితే దేశమంతా జేజేలు పలికిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. కలలో కూడా ఊహించని విధంగా మన కళ్ల ముందు అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయ్యిందని అన్నారు.