
కమలం గుర్తున్న బీజేపీ టీషర్ట్ ధరించి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో చోటుచేసుకుంది.
బుల్దానా (మహారాష్ట్ర): కమలం గుర్తున్న బీజేపీ టీషర్ట్ ధరించి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడిని రాజు తల్వారే (38)గా గుర్తించారు. ఆదివారం ఉదయం ఖాట్కేడ్ గ్రామంలోని చెట్టుకు అతడు వేలాడుతూ కనిపించాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతోనే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతడి టీషర్ట్ మీద ‘ప్రస్తుతమున్న ప్రభుత్వాన్నే తిరిగి ఎన్నుకుందాం’ అన్న వాక్యం ఉంది. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఈ టీషర్ట్‌లను పంచింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడే రైతు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.