
శివాజీనగర : నగరంలో ప్రముఖ బసవేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించే విషయంలో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న గొడవతో గర్భగుడికి తాళాలు పడ్డాయి. విజయపుర వద్ద చిన్నికాలమఠం, నందికోలమఠం కుటుంబాలు ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి పూజలు నిర్వహిస్తూ వస్తున్నాయి. చిన్నికాలమఠం 11 నెలలు, నందికోల మఠం ఒక నెల పూజలు జరిపేందుకు తీర్మానించాయి. అయితే ఇందుకు ఆమోదించని నందికోల మఠం, చిన్నికాల మఠం కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు గొడవపడుతుండేవారు.
మళ్లీ ఆదివారం ఉదయం పూజలు జరిపేందుకు రెండు కుటుంబాలు పరస్పరం గొడవపడ్డారు. అంతేకాకుండా గర్భగుడికి రెండు కుటుంబాలవారు ప్రత్యేకమైన తాళాలు బిగించారు. దీంతో దేవుడి దర్శనానికి వచ్చిన వందలాది మంది భక్తులు దేవుడి దర్శనం లేకుండగా వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. ఈ గొడవతో విసుగెత్తిన మఠం కమిటీ, భక్తులు ఆవేశంతో వీరిద్దరిపై గోల్‌గుంబజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.