రెండో రోజు మిశ్రమ స్పందన | To pay support price for sugarcane demands Swabhimani Shetkari Sanghatana | Sakshi
Sakshi News home page

రెండో రోజు మిశ్రమ స్పందన

Nov 29 2013 2:35 AM | Updated on Sep 2 2017 1:04 AM

చెరకు కనీస మద్దతు ధర రూ.మూడు వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ పిలుపునిచ్చిన 48 గంటల బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది.

సాక్షి, ముంబై/ షోలాపూర్, న్యూస్‌లైన్:  చెరకు కనీస మద్దతు ధర రూ.మూడు వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ పిలుపునిచ్చిన 48 గంటల బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. గురువారం ఉదయం నుంచి షోలాపూర్, సాంగ్లీతో పాటు  కొల్హాపూర్ జిల్లాల్లోని పండర్‌పూర్, సాంగోలా, మంగళవెడ, కర్మాలా, మాల్‌శిరస్ తదితర తాలూకాలో సంఘటన కార్యకర్తలు షాపులు మూసివేయించారు.అయితే వారు వెళ్లిపోగానే యజమానులు మళ్లీ యథాతథంగా షాపులు తెరిచారు.  గురువారం మధ్యాహ్నం మాల్‌శిరస్ తాలూకాలోని  సాల్ముఖ్ చౌక్‌వద్ద రహదారిపై టైర్లకు నిప్పంటించి భయానక వాతావరణం సృష్టించారు. కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు.

కర్మాల పట్టణంలో శాహూ చౌక్ వద్ద కార్యకర్తలు వాహనాలను అడ్డుకున్నారు. సాంగోల, మంగళవెడ ప్రాంతాల్లో కొద్దిసేపు షాపులన్నీ మూసివేసినప్పటికీ జిల్ల్లాలో మాత్రం ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదని పోలీసు సూపరింటెండెంట్ రాజేశ్ ప్రధాన్ తెలిపారు. గతేడాది చెరకు ైరె తుల ఆందోళనలో రణరంగంగా మారిన ఇందాపూర్ తాలూకా ఈసారి ప్రశాంతంగా ఉందన్నారు. ‘ఉదయం నుంచి వ్యాపార లావాదేవీలు, విద్యా సంస్థలు ఎప్పటిలాగే కొనసాగాయి. సహకార మంత్రి హర్షవర్ధన్ పాటిల్ అధ్యక్షుడిగా ఉన్న కర్మయోగీ, నీరా బీమా చక్కెర ఫ్యాక్టరీలు యథాతథంగా నడిచాయ’ని తెలిపారు.  
 70 వాహనాలు ధ్వంసం...
 గురువారం ఉదయం నుంచి కొనసాగుతున్న చెరకు రైతుల ఆందోళనలో జిల్లాలో దాదాపు 70 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆర్టీసీకి అపార నష్టం కలిగిందని షోలాపూర్ జిల్లా అధికారి ప్రవీణ్ గెడం చెప్పారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం బస్సులన్నీ డిపోలకే పరిమితం చేసిందన్నారు. ‘ఇచల్ కరంజీలో పాలను రవాణాచేస్తున్న ట్యాంకర్‌ను అడ్డుకుని అందులోని పాలను నేలపాలు చేసేందుకు రైతులు ప్రయత్నించారు. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన కారులను చెదరగొట్టారు. ఇందులో 30 మంది గాయపడ్డార’ని ఆయన తెలిపారు. పుణే-బెంగళూర్ రహదారిని దిగ్బంధించారు. ఆస్తులకు నష్టం వాటిల్లకుండా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని మరింత అప్రమత్తంచేసినట్లు ప్రవీణ్ చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement