ముదురుతున్న వివాదం | Thenaliraman Based On Fictional Stories | Sakshi
Sakshi News home page

ముదురుతున్న వివాదం

Apr 8 2014 12:25 AM | Updated on Sep 2 2017 5:42 AM

ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు.. శ్రీకృష్ణదేవరాయలు, తెనాలిరామన్‌గా ద్విపాత్రాభినయం చేసిన ‘జగజ్జాల బాహుబల తెనాలిరామన్’

 చెన్నై, సాక్షి ప్రతినిధి:ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు.. శ్రీకృష్ణదేవరాయలు, తెనాలిరామన్‌గా ద్విపాత్రాభినయం చేసిన ‘జగజ్జాల బాహుబల తెనాలిరామన్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇందులో శ్రీకృష్ణదేవరాయల పాత్రను జోకర్‌గా చిత్రీకరించినట్లు ఇటీవల విడుదలైన టీజర్ వల్ల తెలుస్తోం ది. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన చెన్నైలో స్థిరపడిన తెలుగు వారు తమ అభ్యంతరాన్ని నిర్మాతకు తెలిపారు. జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు వినతిపత్రం సమర్పించారు. వీరిని ఖాతరు చేయని నిర్మాత చిత్ర విడుదలకు ముందే తెలుగు సంఘాల వారికి సినిమా చూపేది లేదని, సన్నివేశాలను తొలగించేది లేదని మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందుకు ప్రతిగా తెలుగు సంఘాల ఐక్యవేదిక కింద పలువురు తెలుగు ప్రముఖులు ఈ నెల 5వ తేదీన సమావేశమై అభ్యంతర సన్నివేశాలు తొలగించకుండా సినిమాను విడుదల చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమిళనాడు తెలుగు మక్కల్ పేరవై వారు అదే రోజున సాలిగ్రామంలోని వడివేలు ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. 
 
 వడివేలు జోలికొస్తే ఖబడ్దార్
 కళాకారుడైన వడివేలు జోలికి వస్తే తమిళులంతా ఏకమవుతారని నామ్ తమిళర్ కట్చి అధ్యక్షులు సీమాన్ చెన్నైలోని తెలుగు సంఘాల వారిని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక తమిళ కళాకారుడు తన జన్మభూమిలోనే బెదిరింపులకు గురికావడం సహించబోమని పేర్కొన్నారు. నిజంగానే కృష్ణదేవరాయలను కించపరిచి ఉంటే తాము కూడా తెలుగు సంఘాల వారి పోరాటంలో గళం కలుపుతామని, ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయడం తమ అభిమతం కాదని తెలిపారు. శ్రీకృష్ణదేవరాయల పాత్రను వక్రీకరించలేదని నిర్మాత ప్రకటించారని, సినిమా ఇంకా విడుదల కాకుండానే పుకార్లను నమ్మి నిరసనలు చేయడం సమంజసం కాదని ఆయన వెల్లడించారు. రాజకీయ కారణాల వల్ల వడివేలుకు అండగాలేరనే అంశాన్ని తెలుగు సంఘాలు అవకాశంగా తీసుకుంటే తమిళులంతా ఏకమవుతారని హెచ్చరించారు. తమిళ కళాకారుడైన వడివేలును కాపాడుకోవడం మన బాధ్యత అంటూ రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అయినా హద్దుమీరి ప్రవర్తిస్తే తెలుగు సంఘాల వారికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement