ఇంట్లోకి చొరబడిన తమిళనాడు వాసి బీభత్సం సృష్టించి నవ దంపతులపై దాడికి పాల్పడ్డాడు. ఆత్మరక్షణ కోసం ఆ దంపతులు ఎదురుదాడికి దిగడంతో నిందితుడు హతమయ్యాడు.
ఇంట్లోకి చొరబడిన తమిళనాడు వాసి బీభత్సం సృష్టించి నవ దంపతులపై దాడికి పాల్పడ్డాడు. ఆత్మరక్షణ కోసం ఆ దంపతులు ఎదురుదాడికి దిగడంతో నిందితుడు హతమయ్యాడు. ఈ పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పరప్పన అగ్రహార సమీపంలోని హొసరోడ్డులో చెన్నకేశవ నగరకు చెందిన శ్యామ్ అలియాస్ శ్యామ్‌రాజ్, కనకపుర తాలుకా మరళవాడికి చెందిన రుక్మిణిల వివాహం 16 రోజుల క్రితం జరిగింది. మంగళవారం ఉదయం రుక్మిణిని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు బెంగళూరుకు తీసుకు వచ్చి భర్త వద్ద వదలిపెట్టి వెళ్లారు. రుక్మిణికి జ్వరంగా ఉండటంతో ఉదయం 10 గంటల సమయంలో ఆమె భర్త హోటల్‌లో టిఫిన్ తెచ్చేందుకు వెళ్లాడు. ఆ సమయంలో స్కూటర్ మెకానిక్‌గా పని చేస్తున్న సతీష్ అనే యువకుడు ఇంటిలోకి చొరబడి మంచం కింద దాక్కున్నాడు. చప్పుడు కావడంతో శ్యామ్‌కు అనుమానం వచ్చి మంచం కింద చూడగా సతీష్ ఉన్న విషయం వెలుగు చూసి నిలదీశాడు.
రుక్మిణి కుటుంబ సభ్యులు తనకు తెలుసనని, పెళ్లికి వచ్చానని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో సతీష్ కత్తితీసుకొని రుక్మిణి గొంతుపై గాయపరచి శ్యామ్‌పైనా దాడి చేశాడు. శ్యామ్ అప్రమత్తమై అదే కత్తిని లాక్కొని సతీష్ కడుపులో పోడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులుగుర్తించి ముగ్గురినీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సతీష్ మృతి చెందాడు. డీసీపీ టి.డి. పవార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. శ్యామ్, రుక్మిణి దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, హతుడు సతీష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నామని పరప్పన అగ్రహార పోలీసులు తెలిపారు.