ఫైవ్‌స్టార్‌ జైలు

Tamil Nadu Jail Prisoners Paying money For Facilities - Sakshi

గదికి రూ.2లక్షలు అడ్వాన్స్, రూ.40వేలు అద్దె

ఖరీదైన ఖైదీలకు సర్వం సరఫరా తనిఖీల తరువాత పెరిగిన ధరలు

బిరియానీ తయారు చేసుకున్న ఖైదీలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై పుళల్‌ సెంట్రల్‌ జైలు ప్రజల దృష్టిలో నేరస్థులు శిక్షను అనుభవించే కారాగారం. అయితే లోపలున్న కొందరు ఖైదీలకు మాత్రం అదో స్టార్‌ హోటల్‌. డబ్బులుపడేస్తే చాలు జీ హుజూర్‌ అంటూ సర్వం సరఫరా చేసే అధికారులు ఉన్నంతవరకు మాకేం కొదవలేదని ఖైదీలు పదేపదే సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ‘అడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపే మున్నది’ అన్నట్టుగా కొందరు ఖైదీలు బిరియానీ వండుకుంటున్న వీడియో దృశ్యాలు శుక్రవారం బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. సహజంగానే అధికారుల్లో ‘సం’చలనం కలిగించాయి.

ఖైదీలు స్టార్‌ హోటల్‌ సౌకర్యాలను అనుభవిస్తున్నట్టు, జల్సా జీవితం గడుపుతున్నట్లు ఇటీవల వాట్సాప్‌లో వెలువడిన వందలాది ఫొటోలు హల్‌చల్‌ చేశాయి. ఆ తరువాత సహజంగానే ఉన్నతాధికారులు రావడం, తనిఖీల పేరుతో జైల్లో హడావుడి చేయడం, 23 టీవీలను, 3 ఎఫ్‌ఎం రేడియోలను, 50కి పైగా సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు, వంటసామగ్రి, సరుకులు స్వాధీనం చేసుకోవడం, కొందరిని సస్పెండ్, మరికొందరిని బదిలీచేయడం షరామాములుగా జరిగిపోయింది. అయితే అధికారుల హడావుడికి ఖైదీలెవ్వరూ బెదరలేదు, అధికారులు సైతం అదరిపోలేదు. ఎందుకంటే జైలు ఖైదీలు కమ్మనైన బిరియానీ స్వయంగా వండుకుంటున్న దృశ్యాలు శుక్రవారం మరోసారి బైటకువచ్చాయి.

జైల్లో శిక్షపడిన ఖైదీల బ్యారెక్స్‌కు సమీపంలోని తోటలో కొందరు ఖైదీలు కాయగూరలు, పప్పుధాన్యాలు, బిరియానీ బియ్యం, వండేందుకు ఎలక్ట్రానిక్‌ సామగ్రి చుట్టూరా పెట్టుకుని, ఎఫ్‌ఎం రేడియోలో పాటలు వింటూ వంటపనిలో నిమగ్నమై ఉన్న వీడియో దృశ్యాలు చూసి అధికారులు బిత్తరపోయారు. పుళల్‌జైల్లో ఐదుమార్లు తనిఖీ చేసినా ఎఫ్‌ఎం రేడియోలు, సెల్‌ఫోన్లు, గంజాయి ఎలా చేరింది. తనిఖీల సమయంలో దాచిపెట్టారా లేక కొత్తగా సరఫరా అయ్యాయా అని తలలు పట్టుకుంటున్నారు. లగ్జరీ ఖైదీలకు అవసరమైన వస్తువులు యథాప్రకారం చేరిపోతున్నట్లు తెలుసుకున్నారు. ఎన్నిసార్లు తనిఖీలు చేసినా పైస్థాయిలో మాకు పలుకుబడి ఉన్నంతవరకు ఏమీ చేయలేరని ఖైదీలు సవాలు విసురుతున్నారు.

జైల్లో పెరిగిన ధరలు: తనిఖీల తరువాత జైల్లో ఖైదీల నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపుగా పెరిగిపోయాయి. బీడీ కట్ట రూ.250 నుంచి రూ.500, సిగరెట్‌ ప్యాకెట్‌ రూ.600 నుంచి రూ.1200, గంజాయి 20 గ్రాముల ప్యాకెట్‌ రూ.6 వేల నుంచి రూ.10వేలుగా నిర్ణయించారు. అలాగే చికెన్‌బిర్యానీ రూ.350 నుంచి రూ.700, మటన్‌ కూర రూ.700 నుంచి రూ.1500, మటన్‌ చిక్కా రూ.600 నుంచి రూ.1,200, చికెన్‌ 65 రూ.1000, ఆమ్లేట్‌ రూ.100, కోడిగుడ్డు రూ.40 గా అమ్ముతున్నారు. జైల్లో ఒకరు లేదా ఇద్దరు ఖైదీలు మాత్రమే ఉండే వసతికలిగిన గదులకు పెద్ద గిరాకీ ఉంది. వీటిని అధికారికంగా కేటాయించాలంటే అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే అధికారుల చేతులు తడిపితే అన్నీ జరిగిపోతాయని సమాచారం. రూ.2లక్షలు అడ్వాన్సు, నెలకు రూ.40 వేలు అద్దె చెల్లిస్తే లగ్జరీ గది కేటాయించేస్తారు.

అధికారికి బెదిరింపు: పుళల్‌ జైల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బయ్య ఆ తరువాత హత్యాబెదిరింపులను ఎదుర్కొన్నారు. మదురైలోని తన కిరాయిముఠాకు చెందిన వారు సుబ్బయ్యను బెదిరించడంతో ఆయనతోపాటు మరికొందరికి బందోబస్తు పెట్టారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top