సోనియా ర్యాలీకి మిశ్రమ స్పందన | Stalling of Parliament hit passage of laws: Sonia Gandhi at Delhi rally | Sakshi
Sakshi News home page

సోనియా ర్యాలీకి మిశ్రమ స్పందన

Mar 30 2014 10:55 PM | Updated on Oct 22 2018 9:16 PM

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా పాల్గొన్న బహిరంగ సభకు హాజరుకావడంపై నగరవాసులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక్కడి అజ్మల్‌ఖాన్ పార్కులో ఆదివారం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా పాల్గొన్న బహిరంగ సభకు హాజరుకావడంపై నగరవాసులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక్కడి అజ్మల్‌ఖాన్ పార్కులో ఆదివారం నిర్వహించిన ర్యాలీపై నగరవాసుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. సమస్యలను పరిష్కరించకుండా తప్పించుకు తిరగడంలో అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలని, ఏ పార్టీ, ఏ వ్యక్తి అందుకు మినహాయింపు కాదని నగరవాసులు పేర్కొన్నారు. నగరంలోని మైదానాల్లో అతి చిన్న మైదానంగా చెప్పుకునే అజ్మల్‌ఖాన్ పార్కు పూర్తిగా నిండడమే గగనంగా మారింది. ఇందుకోసం కూడా స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ బహిరంగ సభ కారణంగా ఫైజ్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయిందని, దీంతో పలు వాహనాలను దారిమళ్లించామని ట్రాఫిక్ విభాగం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 
 
 టాఫిక్‌లో నిలిచిపోయిన కొందరిని సోనియా ర్యాలీ గురించి ప్రశ్నించగా రాజకీయ నాయకుల్లో అందరూ అందరేనని, ప్రజల సమస్యలగురించి పట్టించుకునేవారు ఎవరూ లేరనే నిర్వేదం వ్యక్తం చేశారు. తాము శ్రామికులమని, పనిచేస్తేనే రోజు గడుస్తుందని, ఇలాంటి సభలకు, సమావేశాలకు హాజరైనంతమాత్రాన పొట్టనిండదని ఓ ఆటో డ్రైవర్ అన్నారు. కాగా కొందరు వీధి వ్యాపారులు మాత్రం కాంగ్రెస్ గురించి కాస్త సానుకూల వ్యాఖ్యలు చేశారు. వీధి వ్యాపారుల బిల్లును ఆమోదింపజేయడంలో కాంగ్రెస్ కాస్త తీవ్రంగానే శ్రమించిందని, అందుకే ఈసారి చేతిగుర్తుకే ఓటేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ పాల్గొన్న ర్యాలీకి హాజరైన జనం మధ్యలోనుంచే వెళ్లిపోవడంతో దీనిని ప్రతిపక్షాలు ఓ అస్త్రంగా మలుచుకొని ప్రచారం చేశాయి. దీంతో ఈసారి అటువంటి పరిస్థితి చోటుచేసుకోకుండా స్థానిక నాయకులు ముందుగానే అప్రమత్తమయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement