breaking news
Delhi rally
-
మేకిన్ ఇండియా అంటారు కానీ...
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై, కాషాయం పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యస్త్రాలు సంధించారు. బుధవారం న్యూఢిల్లీలోని జహంగీర్ పూరీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.... నేరగాళ్లకు దూరమని ఆ పార్టీ నాయకులు ఓ గప్పాలు కొట్టుకుంటారు... కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థుల్లో 20 మందికి నేర చరిత్ర ఉందని ఆరోపించారు. అలాగే ప్రధాని మోదీ 'మేకిన్ ఇండియా' అంటూ ప్రచారం చేస్తారు... కానీ ఆయన ధరించిన సూటు ఖరీదు రూ. 10 లక్షలు ఉంటుంది. అది కూడా విదేశాలలో తయారైందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే దేశంలో ధరలు తగ్గిస్తామన్నారు... నిరుద్యోగులకు ఉద్యోగాలన్నారు. మీ హామీలన్నీ ఏమయ్యాయని ఆయన ప్రధాని మోదీని ప్రశ్నించారు. మోదీ మాటలకు చేతలకు పొంతన ఉండదని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఎంత తగ్గింది? దేశంలో చమురు ధరలు ఎంత తగ్గించారని రాహుల్ ఈ సందర్బంగా మోదీ సర్కార్ సూటిగా ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు అంత తగ్గినా... ద్రవ్యోల్బణం అదుపులోకి ఎందుకు లేదో వెల్లడించాలని మోదీ సర్కార్‌ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తీసుకొస్తామని రాహుల్ హస్తిన ప్రజలకు హామీ ఇచ్చారు. -
అరవింద్ కేజ్రీవాల్ పై రాయి విసిరిన వ్యక్తి
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. దక్షిణ ఢిల్లీలోని టిగిడి ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఓ ర్యాలీ నిర్వహిస్తుండగా.. ఆ ర్యాలీలో పాల్గొన్న పార్టీ అధినేత కేజ్రీవాల్ మీద జనంలోంచి ఎవరో ఒక వ్యక్తి రాయి తీసి విసిరాడు. అయితే అదృష్టవశాత్తు ఆ రాయి కేజ్రీవాల్‌కు తగలకుండా పక్కకు వెళ్లింది. -
సోనియా ర్యాలీకి మిశ్రమ స్పందన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా పాల్గొన్న బహిరంగ సభకు హాజరుకావడంపై నగరవాసులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక్కడి అజ్మల్‌ఖాన్ పార్కులో ఆదివారం నిర్వహించిన ర్యాలీపై నగరవాసుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. సమస్యలను పరిష్కరించకుండా తప్పించుకు తిరగడంలో అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలని, ఏ పార్టీ, ఏ వ్యక్తి అందుకు మినహాయింపు కాదని నగరవాసులు పేర్కొన్నారు. నగరంలోని మైదానాల్లో అతి చిన్న మైదానంగా చెప్పుకునే అజ్మల్‌ఖాన్ పార్కు పూర్తిగా నిండడమే గగనంగా మారింది. ఇందుకోసం కూడా స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ బహిరంగ సభ కారణంగా ఫైజ్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయిందని, దీంతో పలు వాహనాలను దారిమళ్లించామని ట్రాఫిక్ విభాగం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. టాఫిక్‌లో నిలిచిపోయిన కొందరిని సోనియా ర్యాలీ గురించి ప్రశ్నించగా రాజకీయ నాయకుల్లో అందరూ అందరేనని, ప్రజల సమస్యలగురించి పట్టించుకునేవారు ఎవరూ లేరనే నిర్వేదం వ్యక్తం చేశారు. తాము శ్రామికులమని, పనిచేస్తేనే రోజు గడుస్తుందని, ఇలాంటి సభలకు, సమావేశాలకు హాజరైనంతమాత్రాన పొట్టనిండదని ఓ ఆటో డ్రైవర్ అన్నారు. కాగా కొందరు వీధి వ్యాపారులు మాత్రం కాంగ్రెస్ గురించి కాస్త సానుకూల వ్యాఖ్యలు చేశారు. వీధి వ్యాపారుల బిల్లును ఆమోదింపజేయడంలో కాంగ్రెస్ కాస్త తీవ్రంగానే శ్రమించిందని, అందుకే ఈసారి చేతిగుర్తుకే ఓటేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ పాల్గొన్న ర్యాలీకి హాజరైన జనం మధ్యలోనుంచే వెళ్లిపోవడంతో దీనిని ప్రతిపక్షాలు ఓ అస్త్రంగా మలుచుకొని ప్రచారం చేశాయి. దీంతో ఈసారి అటువంటి పరిస్థితి చోటుచేసుకోకుండా స్థానిక నాయకులు ముందుగానే అప్రమత్తమయ్యారు.