కాంగ్రెస్ ప్రచార సారథిగా షీలాదీక్షిత్ | Sheila Dikshit to be Congress's star campaigner in Delhi Assembly polls | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ప్రచార సారథిగా షీలాదీక్షిత్

Dec 31 2014 10:36 PM | Updated on Mar 18 2019 9:02 PM

మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తమ పార్టీ ప్రధాన ప్రచారకర్తగా ఉంటారని కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. ఒకటి రెండు రోజుల్లో తమ పార్టీ తరఫున

న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తమ పార్టీ ప్రధాన ప్రచారకర్తగా ఉంటారని కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. ఒకటి రెండు రోజుల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. తమ పార్టీ ప్రధాన ప్రచారకర్తగా షీలా క్రియాశీల పాత్ర పోషిస్తారని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు పీసీ చాకో చెప్పారు. పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు దీక్షిత్ నిరాకరించారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. తొలి జాబితాలో ప్రస్తుతమున్న ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థుల పేర్లు కూడా తొలి జాబితాలో ఉంటాయని పేర్కొన్నాయి. ఓ భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఈ సభ జనవరి 10వ తేదీ తరువాత ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అభివృద్ధి, స్థిరత్వం అన్న నినాదంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఎన్నికల ఫలితాలు ఉండకపోవచ్చని, అయితే క్రితంసారి కన్నా ఈసారి బలాన్ని పెరగవచ్చని పార్టీ అంచనా వేస్తోంది. అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి క్రితంసారి వచ్చిన ఫలితాలు పునరావృతం కాకపోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ నేత కేజ్రీవాల్ చేతిలో ఓటమి చవిచూసిన షీలాదీక్షిత్ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇదివరకే స్పష్టం చేశారు. ఢిల్లీకి చెందిన కొందరు మాజీ ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దించనున్నట్లు ఊహాగానాలు సాగాయి. కానీ వారెవరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే కొందరు యువ మాజీ ఎంపీలను రంగంలోకి దించవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement