
సద్గురుడికి సర్వం సమర్పయామి
భక్తకోటికి ఏడు రోజుల పాటు ఆధ్యాత్మిక పరవశాన్ని పంచిన రాఘవేంద్రుడి సప్తరాత్రోత్సవాలు శుక్రవారం సర్వ సమర్పణోత్సవంతో ముగిశాయి.
- కనుల పండువగా ఏకకాల వాహనోత్సవం
- కొనసాగుతున్న భక్తుల రద్దీ
మంత్రాలయం (కర్నూలు) : భక్తకోటికి ఏడు రోజుల పాటు ఆధ్యాత్మిక పరవశాన్ని పంచిన రాఘవేంద్రుడి సప్తరాత్రోత్సవాలు శుక్రవారం సర్వ సమర్పణోత్సవంతో ముగిశాయి. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల నేతృత్వంలో.. భక్తుల హర్షధ్వానాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవం కనుల పండువగా సాగింది. వేకువజామునే శ్రీమఠంలో పూజలు ప్రారంభమయ్యాయి. రాఘవేంద్రుడి మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. వాయుదేవుడికి, రాఘవేంద్రుడికి పీఠాధిపతి ఏకకాల హారతులిచ్చి వేడుకలకు అంకురార్పణ చేశారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు పాదపూజ, తులసి అర్చన, వెండి, బంగారు పల్లకీ సేవలు చేపట్టారు. ఏక కాల వాహనోత్సవ ఉరేగింపు భక్తులను తన్మయత్వానికి గురిచేసింది.
అనుమంత్రాలయంలో రథయాత్ర
అనుమంత్రాలయంగా పేరొందిన తుంగభద్ర గ్రామంలోని రాఘవేంద్రుడి మృత్తిక బృందావన మఠంలో రాయరుకు రథోత్సవం నిర్వహించారు. పీఠాధిపతి ఉదయం గ్రామం చేరుకుని బృందావనానికి అభిషేకాలు చేసి మంగళ హారతులిచ్చారు. అనంతరం రాఘవుడి బృందావన ప్రతిమ, వేంకటనాథుడి ఉత్సవమూర్తిని రథంపై కొలువుంచారు. మఠం ప్రాంగణంలో వేలాదిమంది భక్తుల మధ్య రథయాత్ర రమణీయంగా కొనసాగింది. పండితులు గిరియాచార్, ఆప్తకార్యద ర్శి సుయమీంద్రాచార్, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, తుంగభద్ర మఠం మేనేజర్ ప్రహ్లాద ఆచార్, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ద్వారపాలక అనంతస్వామి, అర్చకులు జయరామాచార్, గౌతమ్ ఆచార్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్సవాల్లో భాగంగా బెంగళూరుకు చెందిన కమాలాకర్ సంగీత కచేరి, ప్రబాత్‌కలవిదార్ నిర్వహించిన బ్యాలెట్ వెంకటనరసింహచారి ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. యోగీంద్ర కళామండపంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.