పోలీసులు విధుల్లో మరణిస్తే రూ.కోటి ఆర్థిక సాయం | Rs.1 crore for Delhi policemen who die on duty | Sakshi
Sakshi News home page

పోలీసులు విధుల్లో మరణిస్తే రూ.కోటి ఆర్థిక సాయం

Apr 1 2015 10:50 PM | Updated on Aug 21 2018 5:46 PM

ధులు నిర్వర్తిస్తూ ప్రమాదాల్లో మరణించే పోలీసులు, భద్రతా సిబ్బందికి చెందిన కుటుంబీకులకు ఆర్థికంగా తోడ్పాటునందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం నిర్ణయించింది.

న్యూఢిల్లీ : విధులు నిర్వర్తిస్తూ ప్రమాదాల్లో మరణించే పోలీసులు, భద్రతా సిబ్బందికి చెందిన కుటుంబీకులకు ఆర్థికంగా తోడ్పాటునందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధంగా మరణించే భద్రతా సిబ్బంది కుటుంబీకులకు కోటి రూపాయాలు ఆర్థిక సాయంగా అందించనుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బుధవారం ఓ ప్రకటన చేశారు. ‘ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి విధులు నిర్వర్తిస్తూ చనిపోయే పోలీసులు, ఇతర ఆర్మ్‌డ్ దళాల సిబ్బంది కుటుంబీకులకు కోటి రూపాయలు ఆర్థిక సాయంగా అందిస్తాం’ అని సిసోడియా చెప్పారు. దీని కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ నిధులను కూడా బడ్జెట్‌లో కేటాయిస్తామని వెల్లడించారు. అలాగే ఏప్రిల్ 5న అవినీతి వ్యతిరేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. యాంటీ కరప్షన్ బ్రాంచి, విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌ను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. యాంటీ కరప్షన్ బ్రాంచిని బలోపేతం చేయడం కోసం కొత్త పోస్టులను సృష్టిస్తున్నామన్నారు. అంతకు ముందు ఈ విభాగంలో 30 మంది ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 40 మంది ఉన్నారని చెప్పారు.

ఈడీఎంసీ సిబ్బంది వేతనాల కోసం నిధులు విడుదల!

తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఈడీఎంసీ)కు చెందిన పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు తగిన నిధులను విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఈడీఎంసీ పారిశుధ్య కార్మికుల వేతనాల కోసం నిధులు విడుదల చేయాలని నిర్ణయించాం. వీలైనంత త్వరలో వారు వేతనాలను అందుకుంటారు’ అని సిసోడియా వెల్లడించారు.

గత కొన్నిరోజులుగా ఈడీఎంసీకి చెందిన పారిశుధ్య కార్మికులు వేతనాల కోసం ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో భాగంగా రోడ్ల మీద చెత్తను కూడా ఎత్తడం లేదు. దీంతో ఆ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లన్నీ దుర్గంధభరితంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి వేతనాల కోసం నిధులు విడుదల చేయడానికి ముందుకొచ్చింది. ప్రభుత్వం విడుదల చేసే నిధులను కేవలం పారిశుధ్య కార్మికుల వేతనాల కోసమే ఉపయోగించాలని కోరారు. వేరే ఏ ఇతర కార్యక్రమాలకు ఉపయోగించకూడదని సూచించారు. ప్రభుత్వం దీని కోసం కేటాయించిన నిధుల వివరాల గురించి ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement