అభిమానులంతా ఓటర్లే!


 భోజ్‌పురి, హిందీ సినిమాలతో బిజీబిజీగా ఉండే రవికిషన్ షూటింగులను పక్కనబెట్టి ఎన్నికల బరిలో దిగాడు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేస్తున్నాడు. ఇక్కడున్న తన అభిమానులందరినీ ఓట్లుగా మార్చుకుంటానని నమ్మకంగా చెబుతున్నాడు. ‘అభిమానులంతా నాకే ఓటేస్తారన్న నమ్మకం ఉంది. నేను బయటి మనిషినేమీ కాదు. వారిలో ఒకడిని. మా తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారు. జౌన్‌పూర్ సమస్యల గురించి నాకు పూర్తిగా తెలుసు’ అని ఈ 42 ఏళ్ల నటుడు అన్నాడు. రవి రాజకీయాలకు కొత్తే అయినా సినిమాల్లోనూ కొనసాగాలని అనుకుంటున్నాడు. నటించడం ఆపేసిన రోజు మరణించినట్టేనని, హిందీ, భోజ్‌పురితోపాటు మరాఠీ, తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నానని చెప్పాడు. పండిట్ జీ బతాయినా బియా కబ్ హొయి, రావణ్, గంగా, బన్‌కే బీహారీ ఎమ్మెల్యే వంటి సినిమాలు ఇతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 

 స్థానిక సినిమాలకు అందించిన సహకారమే తనకు మేలు చేస్తుందని ఇప్పటికే 200 భోజ్‌పురి సినిమాల్లో నటించిన రవి అన్నాడు. ‘భోజ్‌పురి సినిమాల అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను. నా సినిమాలే నా బలం. అయితే ఎన్నికల ప్రచారంలో సినిమా డైలాగులు కొట్టడం నాకు నచ్చదు. స్థానిక సమస్యలపైనే శ్రద్ధ చూపిస్తాను. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్ఫూర్తిగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాను కాబట్టి ఇదే పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్నాను. నేను రాజీవ్‌గాంధీకి వీరాభిమానిని. భోజ్‌పురి సినిమా కేంద్రంగా జౌన్‌పూర్ తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ కనీస సదుపాయాలు కూడా లేవు కాబట్టే షూటింగులు చేయడం సాధ్యపడడం లేదని నా బాలీవుడ్ స్నేహితులు చెబుతుంటారు. వాటి కొరత లేకుండా నేను చేస్తాను’ అని వివరించాడు. పట్టణంలో భారీ స్టేడియంతోపాటు ప్రతి ఇంటికీ టాయిలెట్ ఉండేలా కృషి చేస్తానని రవికిషన్ వాగ్దానం చేశాడు.

 

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top