యూపీ విద్యుత్ శాఖ మంత్రి శైలేంద్ర యాదవ్ తిరుపతిలో పర్యటించారు.
ఏపీలోనూ పోటీ చేస్తాం: యూపీ మంత్రి
Dec 26 2016 4:40 PM | Updated on Sep 4 2017 11:39 PM
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ బలోపేతానికి కృషిచేయాలని యూపీ విద్యుత్ శాఖ మంత్రి శైలేంద్ర యాదవ్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. పార్టీ ఏపీ జిల్లా అధ్యక్షుల సమావేశం తిరుపతిలోని రాష్ర్ట కార్యాలయంలో సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ యూపీలో 2017లో ఎన్నికలు జరగనున్నాయని, మరోమారు పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు.
ఏపీలో పార్టీని శక్తివంతం చేయాల్సిన బాధ్యత యువ నాయకులపై ఉందన్నారు. ఇప్పటికే 13 జిల్లాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ ఏపీ శాఖ కార్యదర్శి జి. మురళీమోహన్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు కోటప్ప, నెల్లూరుజిల్లా అధ్యక్షుడు రవికుమార్, యువజన నాయకులు దామోదర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కాగా ఆయన శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరస్వామి(ముక్కంటి) వారిని కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం దర్శించుకున్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
Advertisement
Advertisement