
సంస్కారంతోనే గౌరవం...
సంస్కారం లేని మనిషికి సమాజంలో విలువ ఉండదని నవీముంబై పోలీస్ కమిషనర్ కె.ఎల్.ప్రసాద్ వ్యాఖ్యానించారు.
నవీముంబై పోలీస్ కమిషనర్ కె.ఎల్.ప్రసాద్ ఉద్బోధ
* ఘనంగా ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ వార్షికోత్సవం
* ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు
సాక్షి, ముంబై: సంస్కారం లేని మనిషికి సమాజంలో విలువ ఉండదని నవీముంబై పోలీస్ కమిషనర్ కె.ఎల్.ప్రసాద్ వ్యాఖ్యానించారు. వడాలాలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ (ఏఈఎస్) వార్షికోత్సవం శనివారం ఉదయం మాటుంగాలోని శణ్ముఖానంద హాలులో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె.ఎల్.ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చిన్నారుల్లో నైతిక విలువలను పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. తాము ఎక్కడ చదివామా అన్నది ముఖ్యం కాదని.. లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా అనే విషయంపై విద్యార్థులు దృష్టిపెట్టాలని సూచించారు. ఏఈఎస్ నుంచి మరో అబ్దుల్ కలాం రావాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు. అంతకుముందు ఇటీవల పెషావర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో బలైపోయిన విద్యార్థుల మనశ్శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం ప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీలలిత పాఠశాల వార్షిక రిపోర్టు చదివి వినిపించారు. తర్వాత స్కూల్ మ్యాగజిన్ పుస్తకావిష్కరణ జరిగింది. అనంతరం ఈ యేడాది మెరిట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థినీవిద్యార్థులకు షీల్డు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
ప్రీ ప్రైమరీ మొదలుకొని కళాశాల విద్యార్థుల వరకు అన్ని తరగతులకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నాటిక, నృత్య కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
సెకండరీ విద్యార్థులు ప్రదర్శించిన ‘ఔరా అమ్మక్క చెల్లా.. ఆలపించి నమ్మడమెల్ల’ అనే దాండియా పాటపై శ్రీకృష్ణుడు, గోపికల నృత్యం సమయంలో హాలు ఆహూతుల కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. ఇంటి నుంచి బయటపడ్డ ఆడ పిల్లలు రోడ్డుపై అత్యాచారాలు, వేధింపుల నుంచి ఎలా బయటపడి ఇంటికి చేరుకుంటున్నారనే అంశంపై కాలేజీ విద్యార్థులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన నాటిక ఆహూతులను ఎంతో ఆకట్టుకుంది. చివరగా వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఏహెచ్‌ఎం ఎన్.అన్నపూర్ణ చెప్పారు.
ఈ కార్యక్రమానికి హాజరైన పదవీ విమరణ చేసిన ప్రధానోపాధ్యాయులకు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన హెడ్ క్లర్క్ సుశీల, ఉపాధ్యాయులు సింగ్, పురుషోత్తంరెడ్డి, ఇతర ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి ఏఈఎస్ చైర్మన్, బోర్డు ఆఫ్ ట్రస్టీ ఎం.వి.పాపారావు, అధ్యక్షుడు సి.స్వరూప్‌రావు, ప్రధాన కార్యదర్శి పి.ఎం.రావు ధన్యవాదాలు తెలిపారు.