కొప్పళ జిల్లా మునిరాబాద్‌లో దుండగులు బీభత్సం సృష్టించారు. రెండు ప్రభుత్వ కార్యాలయాలతోపాటు పలు నివాసాల్లోకి చొరబడేందుకు యత్నించారు.
సాక్షి, బళ్లారి : కొప్పళ జిల్లా మునిరాబాద్‌లో దుండగులు బీభత్సం సృష్టించారు. రెండు ప్రభుత్వ కార్యాలయాలతోపాటు పలు నివాసాల్లోకి చొరబడేందుకు యత్నించారు. అడ్డుకున్నవారిపై మారణాయుధాలతో దాడిచేశారు. దీంతో పదిమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..బుధవారం రాత్రి 1 గంట సమయంలో సుమారు 10 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులు మునిరాబాద్ పట్టణంలోకి ప్రవేశించారు.
తొలుత కేఈబీ, ప్రభుత్వ పాల డెయిరీ కార్యాలయాల్లోకి చొరబడ్డారు. అక్కడ విధుల్లో ఉన్న ఆరుగురు సెక్యూరిటీ గార్డులు దుండగులను ప్రతిఘటించగా రాడ్లతో దాడులు చేశారు. దీంతో ఇద్దరు గార్డులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం దుండగులు అక్కడినుంచి నగరంలోని పలు వీధుల్లో స్వైర విహారం చేశారు. పలువురు వ్యక్తులకు చెందిన ఇళ్ల తలుపులపై రాడ్లతో మోదారు. అప్రమత్తమై వీధుల్లోకి వచ్చిన వారిపై దుండగులు రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడి అనంతరం ఉడాయించారు.
దాడుల్లో ఓ మహిళతోపాటు మల్లికార్జున్, మునవర్ అలీఖాన్, శివుతో సహా పదిమంది గాయపడగా వారిని బళ్లారి ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. దుండగులు ఉత్తరభాతదేశానికి చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు ఎక్కడా దోపిడీకి పాల్పడలేదని, అయితే ఎందుకు దాడులు చేశారో అర్థం కావడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.