ప్రజలకు భారీ వాగ్దానాలు చేయడం మినహా బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్లు తమ పాలనతో పారదర్శకత పెంపునకు చర్యలేమీ తీసుకోవడం
మున్సిపల్ కార్పొరేషన్లు జవాబుదారీతనానికి ఆమడ దూరం
Jan 21 2014 3:08 AM | Updated on Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: ప్రజలకు భారీ వాగ్దానాలు చేయడం మినహా బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్లు తమ పాలనతో పారదర్శకత పెంపునకు చర్యలేమీ తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విభజనకు ముందున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచడానికి పలు చర్యలు ప్రకటించింది. వార్డుల వారీగా అభివృద్ధి పనులు, ప్రాథమిక సేవలకు బాధ్యులైన అధికారులు, సిబ్బంది వివరాలు, సమస్యల పరిష్కార విధానం తదితర అంశాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని నిర్ణయించింది. అంతేగాక 2012లో ఆరు సేవలను ఈ-సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ (ఈ-ఎల్‌ఎల్‌ఏ)లో చేర్చింది. అయితే ఆచరణలో జరుగుతున్నది శూన్యమని ఢిల్లీవాసులు ఆరోపిస్తున్నారు.
కౌన్సిలర్ల పేర్లు, ఫిర్యాదుల నమోదు వంటి ప్రాథమికస్థాయి సేవలు కూడా సరిగ్గా అందడం లేదని చెబుతున్నారు. ధ్రువపత్రాల జారీలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. అయితే ఈ-సేవా విధానం సక్రమంగానే పనిచేస్తోందని కార్పొరేషన్లు చెబుతున్నాయి. ఈ-సేవల్లో ఎటువంటి లోపాలు లేవు కాబట్టి ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారికీ జరిమానా విధించలేదని దక్షిణఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభాపక్ష నాయకుడు సుభాష్ ఆర్య అన్నారు. గత రెండేళ్లుగా నగరంలో అభివృద్ధి మందగించిన మాట నిజమే అయినా, ఇందుకు ఎంసీడీని మూడు కార్పొరేషన్లుగా విభజించడమే కారణమని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈ-పాలన ప్రాజెక్టును రూ.100 కోట్ల వ్యయంతో ప్రారంభించినా, ఏడాదిగా అది మూలన పడి ఉందని చెబుతున్నారు.
‘పాలనలో మరింత పారదర్శకత పెంచడానికి వీలుగా మేం ఎన్నో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అయితే ఎంసీడీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తరువాత వాటిలో చాలా వరకు అమలుకు నోచుకోలేదు. సేవలు అమలుకు సంబంధించి ఓ ప్రైవేటు సంస్థతోనూ మాకు వివాదం ఉంది’ అని ఆర్య వివరించారు. అభివృద్ధి ప్రాజెక్టుల కాంట్రాక్టుల మంజూరులో పూర్తి పారదర్శకత పాటించాలని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) నిర్ణయించింది. దీనిపై ఉత్తరఢిల్లీ కార్పొరేషన్ సభాపక్ష నాయకురాలు మీనా అగర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ‘నిజంగా ఇది మంచి నిర్ణయం. ఈ విషయమై మా కమిషనర్‌తోనూ చర్చిస్తాను. ప్రజలంతా పాలనలో జవాబుదారీతనం, పారదర్శకతను కోరుకుంటున్నాను. ఈ మేరకు వ్యవస్థను తీర్చిదిద్దడానికి మేం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. ఇతర కార్పొరేషన్లు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయాలి’ అని ఆమె వివరించారు.
Advertisement
Advertisement