చిన్నమ్మతో ములాఖత్‌ | Minister Balakrishna Reddy MLAs Karunas meet Sasikala | Sakshi
Sakshi News home page

చిన్నమ్మతో ములాఖత్‌

May 22 2017 2:29 AM | Updated on Sep 5 2017 11:40 AM

చిన్నమ్మతో ములాఖత్‌

చిన్నమ్మతో ములాఖత్‌

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ దర్శనంతో ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనందంలో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు.

ఓ మంత్రి, ఎమ్మెల్యేల భేటీ
సన్నబడ్డ శశికళ
అమ్మ శిబిరంలో ఎవరికి వారే


సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ దర్శనంతో ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనందంలో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. పరప్పన అగ్రహార చెరలో శనివారం చిన్నమ్మను కలిసి, ఇక్కడి రాజకీయ పరిస్థితులను వివరించారు. మనోధైర్యంతో చిన్నమ్మ ఉన్నట్టు, ఆహారం సరిగ్గా లేని దృష్ట్యా, సన్నబడినట్టుగా ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె దర్శనం కోసం పలువురు ఎమ్మెల్యేలు ఇది వరకు ప్రయత్నాలు చేసినా, అందులో కొందరికే అనుమతి దక్కిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాస్, తంగ తమిళ్‌ సెల్వన్, వెట్రివేల్, మాజీ మంత్రి బీవీ రమణ పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మతో భేటీ కావడం గమనార్హం. చిన్నమ్మ వద్ద ఇక్కడి రాజకీయ పరిస్థితుల గురించి, అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాల గురించి వివరించినట్టు సమాచారం.

చిన్నమ్మ త్వరలో కేడర్‌కు జైలు నుంచి ఓ లేఖ రాసే అవకాశాలు ఉన్నట్టు ఈ భేటీ ద్వారా వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఇక, చిన్నమ్మ ఆరోగ్యంగా, మనోధైర్యంతో ఉన్నారని, ఆహారం సరిగ్గా లేని దృష్ట్యా, సన్నబడినట్టుగా ఓ ఎమ్మెల్యే పేర్కొనడం గమనార్హం. చిన్నమ్మ దర్శనం ఐదుగురికి దక్కడంతో తమకు సైతం దక్కుతుందన్న ఎదురు చూపులతో పరప్పన అగ్రహార చెర బాట పట్టేందుకు మరి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ఇక, తమతో చర్చలంటూ, మరో వైపు చిన్నమ్మ వద్దకు క్యూ కట్టడం బట్టి చూస్తే, పళని సర్కారు ఏ మేరకు నాటకాలను ప్రదర్శిస్తున్నదో స్పష్టం అవుతోందని మాజీ సీఎం పన్నీరు శిబిరానికి చెందిన ఎంపీ మైత్రేయన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం మీడియాతో మైత్రేయన్‌ మాట్లాడుతూ అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్‌ కుటుంబాన్ని బహిష్కరించినట్టుగా మంత్రి జయకుమార్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు మంత్రి, ఎమ్మెల్యేలు తీహార్, పరప్పన అగ్రహార చెరకు వెళ్లి శశికళ, దినకరన్‌లతో భేటీ కావడంపై ఎలాంటి సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. పళని సర్కారు నాటకం ఆడుతున్నదని, ఈ నాటకానికి తెర పడే సమయం ఆసన్నమైనట్టు పేర్కొన్నారు. త్వరలో పన్నీరుసెల్వం నేతృత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు.

 ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పళనిæ సర్కారుకు బెదిరించే రీతిలో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరికొందరు చిన్నమ్మను పరామర్శించి రావడం గమనార్హం. ఈ సమయంలో అన్నాడీఎంకే అమ్మ (పళని శిబిరం) అధికార ప్రతినిధి వైగై సెల్వన్‌ సీఎంకు వ్యతిరేకంగా 12 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చెన్నైలోని ఓ హోటల్‌లో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. ఇక, టీటీవీ దినకరన్‌పై ఢిల్లీ పోలీసులు రోజుకో ఆరోపణలు సంధిస్తూ కొత్త కేసుల నమోదుకు కసరత్తులు చేస్తుండడంపై అమ్మ శిబిరంలో మరి కొంతమంది ఎమ్మెల్యేలు సమాలోచనలో మునిగారు. అమ్మ శిబిరంలో ఎవరికి వారే అన్నట్టు పరిస్థితి సాగుతుండడంతో పళని సర్కారు మనుగడపై ఉత్కంఠ బయలుదేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement