
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నన్ అన్నామలై, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తమ మధ్య విబేధాలను పక్కనపెట్టి ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి ఒకే వేదికపై సందడి చేయడమే కాదు.. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపైనా స్పష్టత ఇచ్చేశారు.
గతంలో ఈపీఎస్ మీద అన్నామలై ఏ స్థాయిలో విరుచుకుపడిందో తెలిసిందే. ‘‘పళనిస్వామి ఓ తెలివితక్కువోడు’’.. అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారాయన. దీనికి కౌంటర్‌గా ‘‘అన్నామలై బుద్ధిహీనుడని, ఆస్పత్రిలో చేర్పించాలి’’ అని ఈపీఎస్ వర్గం కౌంటర్ ఇచ్చింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఏ ఎన్డీయే మీటింగ్‌లోనూ కలిసి మెలిగినట్లు కనిపించేది కూడా కాదు. అలాంటిది.. శనివారం చెన్నైలో జరిగిన జీకే మూపనార్ వర్ధంతి కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు..
మాజీ ముఖ్యమంత్రి, ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థి ఎడపాడి పళనిస్వామి ఇప్పుడు మాట్లాడారు అంటూ అన్నామలై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘2026లో మార్పు రావాలి, పేదల అభివృద్ధికి ప్రభుత్వం పని చేయాలి. ఎన్డీయే సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నారు’’ అని అన్నారు. దీంతో వీళ్ల రాజకీయ ఐక్యతపై చర్చకు దారి తీసింది.
పళనిస్వామి (EPS), అన్నామలై మధ్య విభేదాలు తమిళనాడు ఎన్డీయే కూటమిలో రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపించాయి. వ్యక్తిగత విమర్శలతో పాటు అన్నాడీఎంకే అవసరం ఎన్డీయేకు లేదన్నట్లుగా అన్నామలై వ్యవహరించారు. పైగా సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ వర్గం చేసిన ప్రకటనను ఖండించారు. ఈ తీరుతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. అయితే..
ఈ రాజకీయంతో ఈపీఎస్ వర్గం బలపడగా.. బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో.. అన్నామలై వైఖరినే మార్చాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. అందుకే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహం మార్చి.. ఈపీఎస్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అన్నామలై కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ EPS కు మద్దతు ప్రకటించినట్లు ఆయన మాటల్లోనే తెలుస్తోంది.
వీళ్ల కలయికపై ఆదివారం అన్నామలైకి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘పార్టీ చెప్పింది, ప్రధాని మోదీ చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని శిరసావహించడం కేడర్‌గా నా బాధ్యత. అది అర్థం చేసుకోండి’’ అని అన్నామలై వ్యాఖ్యానించారు. గత విమర్శలపై ప్రశ్నించగా.. వ్యక్తిగత అభిప్రాయాలు వేరే. పార్టీ కేడర్‌గా క్రమశిక్షణ పాటించాలి కదా. ఉదాహరణకు డీఎంకే మంత్రిపై నాకు ఎంత కోపం ఉన్నా.. వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని నేను గౌరవిస్తాను. ఇది అంతే. పార్టీ చెప్పినట్లే అన్నామలై వింటాడు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.
అన్నామలై 2011 బ్యాచ్‌కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన పోలీసాధికారిగా సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. ‘సింగం’గా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది.
తాజా పరిణామం.. అన్నాడీఎంకే బీజేపీల మధ్య విభేదాలు తొలిగాయనడానికి సంకేతంగా నిలిచింది. 2026 ఎన్నికల కోసం ఈపీఎస్ నాయకత్వంలో కూటమి ముందుకు సాగుతుందన్న సంకేతాలు స్పష్టంగా అందిస్తోంది.