మంత్రి సునీల్ తట్కరేపై కేసుపై నగర పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు జరపడం లేదంటూ బాంబే హైకోర్టు శుక్రవారం నగర పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ముంబై: మంత్రి సునీల్ తట్కరేపై కేసుపై నగర పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు జరపడం లేదంటూ బాంబే హైకోర్టు శుక్రవారం నగర పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘నగర పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) దర్యాప్తు చేయకపోగా పిటిషనర్ కిరీట్ సోమయ్య అందిస్తున్న పత్రాలపైనే ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది. వారు స్వతంత్రంగా ఏమీ చేయలేదు’ అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఎస్.సోనక్‌ల నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తు సంస్థ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం పై విధంగా స్పందించింది.
కాగా మంత్రి సునీల్ తట్కరే, ఆయన బంధువులు కలసి ఏర్పాటుచేసిన వివిధ సంస్థలు మనీల్యాండరింగ్‌తోపాటు భూకబ్జాలకు పాల్పడ్డాయని, అందువల్ల ఆయా సంస్థలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ )తో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య బాంబే హైకోర్టులో గతంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి విదితమే. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ కేసును విచారించి, ఓ నివేదిక సమర్పించాలంటూ ఈఓడబ్ల్యూతోపాటు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లను అప్పట్లో ఆదేశించింది. దీంతో ఈఓడబ్ల్యూతోపాటు ఏసీబీ అధికారులు, రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్‌లు రూపొందించిన నివేదికలను అడ్వొకేట్ జనరల్ దారియస్ ఖంబాటా శుక్రవారం హైకోర్టుకు సమర్పించారు.