
ప్రతిష్టంభన
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంలో ప్రతిష్టంభన తొలగడం లేదు. ఎవర్ని ఎంపిక చేయాలో అని ఏఐసీసీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
అధ్యక్ష ఎంపికపై మల్లగుల్లాలు
తెరపైకి చిదంబరం
ఢిల్లీలో నేతలు
సోనియా, రాహుల్‌తో కుష్భు భేటీ
సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంలో ప్రతిష్టంభన తొలగడం లేదు. ఎవర్ని ఎంపిక చేయాలో అని ఏఐసీసీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తాజాగా రాజకీయ అనుభవం కల్గిన చిదంబరం పేరు తెర మీదకు వచ్చింది. ఇక, ఆ పదవిని ఆశిస్తున్న నేతలందరూ ఢిల్లీలో తిష్ట వేశారు. అధికార ప్రతినిధి కుష్భు పెద్దలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ గత నెల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో కొత్త అధ్యక్షుడి ఎంపిక ఏఐసీసీ పెద్దలకు కష్టతరంగా మారింది.
తమ కంటే, తమకు ఆ పదవి అప్పగించాలంటూ ఏఐసీసీ వద్దకు పెద్ద సంఖ్యలో నాయకులు క్యూ కట్టే పనిలో పడ్డారు. ఇందులో ప్రధానంగా తిరునావుక్కరసర్, వసంతకుమార్, పీటర్ అల్ఫోన్స్, మాణిక్ ఠాకూర్, సుదర్శన నాచ్చియప్పన్, కరాటే త్యాగరాజన్, విజయధరణి, గోపినాథ్, సెల్వరాజ్ వంటి వారి పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే గట్టి పోటీ మాత్రం తిరునావుక్కరసర్, పీటర్ అల్ఫోన్స్ మధ్య నెలకొని ఉందని చెప్పవచ్చు. ఈ ఇద్దర్లో ఎవరో ఒకరు అధ్యక్ష పదవి చేపట్టడం ఖాయం అన్న సంకేతాలు వెలువడ్డాయి.
మంగళవారం అధికారిక ప్రకటన వెలువడ వచ్చన్న ప్రచారం సాగింది. అయితే ఇప్పట్లో అధ్యక్ష ఎంపిక సాగేనా అన్న ప్రశ్న కూడా మొదలైంది. ఎవర్ని ఎంపిక చేయాలో అన్న మల్లగుల్లాల్లో ఢిల్లీ పెద్దలు పడ్డారు. దీంతో అధ్యక్ష ఎంపిక ప్రతిష్టంభన నెలకొన్నట్టైంది. ఈ సమయంలో కేంద్ర మాజీ మంత్రి, రాజకీయ అనుభవం కల్గిన సీనియర్ నేత పి.చిదంబరం పేరు తెర మీదకు వచ్చి ఉండడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో చిదంబరం వర్గీయులు అధికమే. రాష్ట్రంలో తన వ్యక్తిగత బలాన్ని చాటుకోవడంలో ఎప్పడూ చిదంబరం ముందు ఉంటారని చెప్పవచ్చు.
ఈ సమయంలో ఆయన్ను అధ్యక్ష పదవిలో కూర్చొబెట్టే విషయంలో ఏఐసీసీ పెద్దలు పరిశీలన సాగిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడి ఉన్నాయి. రాజకీయ అనుభవం కల్గిన చిదంబరం రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, అందర్నీ కలుపుకుని ముందుకు సాగడంలో దిట్టగా అధిష్టానం పెద్దలు గుర్తించినట్టు సమాచారం. అయితే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న చిదంబరం రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అవుతారా..? అన్న ప్రశ్న కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఆశిస్తున్న వాళ్లందరూ ఢిల్లీలో తిష్ట వేసి ఉండడం, మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సైతం మంగళవారం ఢిల్లీకి వెళ్లడం గమనించాల్సిన విషయం.
అదే సమయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో సమాలోచించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం మీడియాతో కుష్భు మాట్లాడుతూ, ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను మళ్లీ అధ్యక్ష పదవిలో కూర్చో బెట్టాలన్న అంశాన్ని తాను పెద్దల వద్ద ప్రస్తావించ లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పార్టీ బలోపేతానికి, అందరికి ఆమోద యోగ్యుడిగా, అన్ని అర్హతలు ఉన్న నాయకుడ్ని ఎంపిక చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు.