ఈ కండక్టర్‌.. కాబోయే కలెక్టర్‌? | Karnataka Bus Conductor Madhu Pass Civils Coaching in Youtube | Sakshi
Sakshi News home page

ఈ కండక్టర్‌.. కాబోయే కలెక్టర్‌?

Jan 29 2020 9:06 AM | Updated on Jan 29 2020 10:53 AM

Karnataka Bus Conductor Madhu Pass Civils Coaching in Youtube - Sakshi

తీరిక లేకుండా కండక్టర్‌ ఉద్యోగం. పెద్ద పెద్ద అకాడమీల్లో శిక్షణ పొందలేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు ఉన్న వనరులతోనే సివిల్స్‌ వైపు సాగిపోతున్నాడో యువ కండక్టర్‌. దూరవిద్యలో డిగ్రీ, పీజీలు చేసి సివిల్స్‌ పరీక్షల్లో మెయిన్స్‌ను అధిగమించాడు.  

కర్ణాటక, యశవంతపుర:  పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చని నిరూపించే పనిలో ఉన్నారు బస్సు కండక్టర్‌ ఒకరు. మండ్య జిల్లా మళవళ్లికి చెందిన ఎన్‌సీ మధు బెంగళూరులోని కొత్తనూరు 34వ బీఎంటీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. తన 19 ఏటనే కండక్టర్‌ కొలువు సాధించాడు. చదువు అంటే ఎంతో ఇష్టం కావడంతో మధు ఐఏఎస్‌ కావాలని కలగన్నాడు. అందుకోసం దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీని పూర్తి చేశాడు. 2014లో కేఎఎస్, 2018, 2019లో యుపీఎస్‌సీ పరీక్షలను రాశాడు. 2019లో కన్నడ మాధ్యమంలో సివిల్స్‌ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. రాజనీతి శాస్త్రం, జనరల్‌ స్టడీస్‌ను ఎంపిక చేసుకొని రాసిన మెయిన్స్‌ పరీక్షల్లో పాసై ఇంటర్వ్యూకు ఎంపిక కావడం విశేషం. మార్చి 25న ఢిల్లీలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇంటర్వ్యూలో పాసైతే కలెక్టర్‌ లేదా ఎస్పీ ఏదైనా సాధించినట్లే.  

రెండుసార్లు పరాజయం  
2014లో కేఎఎస్‌ పరీక్ష , 2018లో సివిల్స్‌ రాసినా ఫలితం లేదు. నిరుత్సాహం పడకుండా ఈసారి సాధించాలనే పట్టుదలతో యూ ట్యూబ్‌లో సివిల్స్‌ పరీక్షల మెళకువలు నేర్చుకున్నాడు. తన మొబైల్‌ ఫోన్‌లో యూ ట్యూబ్‌ ద్వారా కోచింగ్‌ తీసుకుంటూ సన్నద్ధమయ్యాడు. 2019లో యుపీఎస్‌సీ ప్రిలిమ్స్, మెయిన్స్‌ రాసి సత్తా చాటాడు.  

రోజూ 5 గంటలు వీడియోలతో కోచింగ్‌  
తాను ఎక్కడా కోచింగ్‌కు వెళ్లలేదని, రోజు ఐదు గంటల పాటు యూ ట్యూబ్‌లోలో కోచింగ్‌ తరగతులను చూస్తూ పరీక్షకు సిద్ధమైనట్లు మధు చెబుతున్నాడు. తనకు యూ ట్యూబే మార్గదర్శనమని చెప్పాడు. ఇప్పుడు ఇంటర్వ్యూపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement