వదంతులపై అన్నాడీఎంకే ఫైర్ | Jayalalithaa seriously ill? Amma's absence from political circle sparks questions on health | Sakshi
Sakshi News home page

వదంతులపై అన్నాడీఎంకే ఫైర్

Jul 15 2015 3:11 AM | Updated on Sep 5 2018 9:45 PM

సీఎం జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు ముగింపు పలికేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది.

సీఎం జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు ముగింపు పలికేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది.  వదంతులు సృష్టిస్తున్న వాళ్ల భరతం పట్టేందుకు సిద్ధం అయ్యారు. సీఎం ఆరోగ్య పరిస్థితులపై తొలుత ప్రచారం సృష్టించిన ఓ వెబ్ మీడియాపై కన్నెర్ర చేశారు. కోర్టులో జయ తరపున మంగళవారం పరువు నష్టం దావా దాఖలైంది.
 
 సాక్షి, చెన్నై :  సీఎం జయలలిత వారం రోజులకు పైగా సచివాలయానిక రాలేదు. దీంతో పలు రకాల వదంతులు బయలు దేరాయి. ఈ పరిస్థితుల్లో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, వీసీకే నేత తిరుమావళవన్ సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేయడం, దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు విరుచుకు పడడం తో ‘అమ్మ’కు ఏమైందన్న చర్చ బయలు దేరింది. ఈ చర్చకు ముగింపు పలికేందుకు సోమవారం సీఎం జయలలిత సచివాలయానికి వస్తున్నట్టుగా ప్రచారం సాగింది. ఇందుకు తగ్గట్టుగానే సచివాలయం మార్గాల్లో అమ్మకు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.
 
 అయితే, సీఎం జయలలిత కాన్వాయ్ జాడ కానరాలేదు. దీంతో జయలలిత ఎక్కడ...? ఆమెకు ఏమైంది..?  ఎలా ఉన్నారు...? ఆరోగ్య పరిస్థితులపై వస్తున్న వదంతులు నిజమేనా..? అన్న ప్రశ్న అభిమానుల్లో, కార్యకర్తల్లో, ప్రజల్లో బయలు దేరింది. అయితే, ఏ ఒక్క మంత్రిగాని, అన్నాడీఎంకే నాయకుడుగాని ఇందుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మంత్రులు వారి వారి దినసరి కార్యక్రమాలతో పాటుగా సమీక్షల్లో బిజీగా ఉన్నారు. దీంతో తమ అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారన్న ధీమా అభిమానుల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో  తమ అమ్మ అనారోగ్యంతో ఉన్నట్టుగా వస్తున్న వదంతులను సృష్టించిందెవ్వరో గుర్తించి భరతం పట్టేందుకు అన్నాడీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి.
 
 పరువు నష్టం దావా : సీఎం జయలలిత అనారోగ్యంతో ఉన్నారన్న వార్తను ప్రచురించి ప్రచారాన్ని విస్తృతం చేసింది ఓ వెబ్ మీడియాగా గుర్తించారు. రెడీఫ్.కామ్ పేరుతో ఉన్న ఆ వెబ్ మీడియా ఈనెల పదో తేదీన సీఎం జయలలిత అనారోగ్యంతో ఉన్నట్టు, ఉన్నత చికిత్స నిమిత్తం అమెరికా పయనమైనట్టు ప్రచురించి ఉండడం వెలుగు చూసింది.
 
 అలాగే, ఒక  సీఎం అనారోగ్యంతో ఉన్నా, తమిళనాట  మీడియా మౌనం వహించడం శోచనీయమని చురకలు అంటించింది. దీంతో సీఎం అనారోగ్య పరిస్థితిపై తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించే యత్నం చేసిన ఆ వెబ్ మీడియాపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సీఎం జయలలిత తరపున చెన్నై కార్పొరేషన్ ప్రభుత్వ న్యాయవాది ఎంఎల్ జగన్ మంగళవారం చెన్నై సెషన్స్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. బాధ్యత గల అతి పెద్ద పదవిలో ఉన్న సీఎం జయలలితకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి రెడీఫ్.కామ్ పంపించిందని తన పిటిషన్‌లో వివరించారు. ప్రజల్లో ఆందోళన రేకెత్తించడంతో పాటుగా కలకలం సృష్టించే పరిస్థితుల్ని కల్పిస్తూ సమాచారాన్ని పంపారని పేర్కొన్నారు.
 
 సీఎం పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లే రీతిలో వ్యవహరించి ఆ మీడియా ప్రతినిధులు, యాజమాన్యం, సంపాదకులు ఆర్ రామ సుబ్రమణ్యం, అజిత్ , నికిల్, అభిషేక్‌లపై పరువు నష్టం దావా కేసు నమోదు చేయాలని పిటిషన్ ద్వారా విన్నవించారు. ఈ పిటిషన్‌పై విచారణ త్వరలో జరగనున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి తన సమాచార మాధ్యమం ద్వారా సీఎం జయలలిత అనారోగ్యం గురించి పేర్కొంటూ, అమెరికా పయనం ప్రస్తావన తీసుకురావడం గమనార్హం. ఈ వ్యవహారం అన్నాడీఎంకే వర్గాల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. స్వామి తీరుపై ఆ పార్టీ వర్గాలు ఏ మేరకు స్పందిస్తారో.  అలాగే, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా సీఎం ఆరోగ్య పరిస్థితులపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రజల మనిషి అన్న విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement