
కోర్టుకు అమ్మ డుమ్మా
అన్నాడీఎంకే అభ్యర్థుల గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి జయలలిత గురువారం నాటి కోర్టు వాయిదాకు డుమ్మా కొట్టారు
- ఆదాయపు పన్ను కేసు విచారణ
- వాదనలు విన్న న్యాయమూర్తి
- 28న జయ, శశి హాజరు కావాలని ఆదేశం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అభ్యర్థుల గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి జయలలిత గురువారం నాటి కోర్టు వాయిదాకు డుమ్మా కొట్టారు. ఇదే కేసులో ముద్దాయిగా ఉన్న ఆమె నెచ్చెలి శశికళ సైతం హాజరుకాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.
మొత్తం 40 స్థానాలపై గురిపెట్టిన అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అయితే తలవని తలంపుగా ఆమెకు ఇదే సమయంలో కోర్టు కేసులు, వాయిదాలు చుట్టుముట్టాయి. బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో సాగుతున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఈనెల 3న విచారణకు వచ్చింది. అదే రోజున చెన్నైలోని ఎగ్మూరు కోర్టులో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు కేసు వెంటాడింది.
శశి ఎంటర్‌ప్రైజస్ పేరున జయలలిత, శశికళ భాగస్తులుగా ఒక సంస్థను నడుపుతున్నారు. ఆ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై 1991-94 మధ్య వారు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు. దీంతో ఆదాయపు పన్ను శాఖ జయ, శశిలపై కేసు నమోదు చేసింది. గత 15 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు నుంచి విముక్తి ప్రసాదించాలని కోరుతూ ఎగ్మూరు, హైకోర్టు సుప్రీం కోర్టుల్లో జయ, శశి వరుసగా వేసిన పిటిషన్లకు అన్ని న్యాయస్థానాల్లోనూ చుక్కెదురైంది. పైగా ఈ కేసుకు 4 నెలల్లోగా ముగింపు పలకాలని గత నెలలో సుప్రీం కోర్టు ఆదేశించింది.
సుప్రీం ఆదేశాలతో గతనెల 20వ తేదీన, ఆ తరువాత ఈనెల 3వ తేదీన కేసు విచారణకు వచ్చింది. రెండు సార్లూ జయ హాజరుకాలేదు. సుప్రీం ఆదేశాలకు కట్టుబడి కేసు ముగింపునకు కక్షిదారులు సహకరించడం లేదంటూ ఆదాయపు పన్నుశాఖ న్యాయవాది రంగస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాయిదాలపై వాయిదాలతో కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఈనెల 10వ తేదీ నాటి వాయిదాకు జయ, శశి హాజరుకావాలని న్యాయమూర్తి మూడో తేదీన ఆదేశించారు. ఇందులో భాగంగా గురువారం ఎగ్మూరు కోర్టుకు జయ, శశికళ మళ్లీ గైర్హాజరయ్యూరు.
4 నెలల గడువు కోరుతూ సుప్రీంలో తాము వేసిన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉందని జయ తరపున హాజరైన న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి దక్షిణామూర్తి కేసు విచారణను ఈనెల 28 వ తేదీకి వాయిదా వేశారు. అప్పటికి పోలింగ్ కూడా ముగిసిపోతున్నందున జయ, శశి ఇద్దరూ వాయిదాకు హాజరుకావాలని ఆదేశించారు.