
దేశమంతా దీపావళి పండుగ సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా జరిగే పెద్ద పండుగ కావడంతో దీపావళికి చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్లు, గిఫ్ట్లు ఇస్తుంటాయి. కొన్ని సంస్థలు వీటిని భారీ స్థాయిలో అందిస్తుంటాయి. ఇప్పటికే దాదాపు చాలా సంస్థలు దీపావళి బోనస్‌లు, బహుమతులు ఇచ్చేశాయి.
మరికొన్ని ఇంకా ఇవ్వాల్సి ఉండటంతో బోనస్‌లు, బహుమతుల గురించి ఆశతో ఎదురుచూస్తున్నారు. కొంతమంది నగదు బోనస్‌ను ఆశిస్తే, మరికొందరు బహుమతులు, వోచర్లు, స్వీట్లు లేదా గాడ్జెట్లు పొందుతారు. అయితే, మీకు తెలిసా? ఈ బోనస్‌లు, బహుమతులు పన్ను చెల్లింపులకు కూడా కారణమవవచ్చు.
చాలా మంది ఈ పండుగ సమయంలో వచ్చే బహుమతులు పూర్తిగా పన్ను మినహాయింపు పొందుతాయని అనుకుంటారు. కానీ వాస్తవానికి, ఇవి కూడా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట పరిమితికి మించి ఉంటే పన్ను వర్తించవచ్చు. దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం..
ఇలా ఉంటే పన్ను మినహాయింపు
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఒక ఉద్యోగి ఏడాదిలో పొందే బహుమతులు రూ.5,000, అంత లోపు విలువ ఉంటే పన్ను మినహాయింపు పొందుతాయి. ఉదాహరణకు స్వీట్లు, దుస్తులు, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, గిఫ్ట్ వోచర్లు (రూ.5,000 లోపు విలువతో) వంటివి. ఇవి పరిధిలోపు ఉన్నట్లయితే, ఉద్యోగి ఆదాయంలోకి జోడించాల్సిన అవసరం లేదు.
రూ.5,000 దాటితే..
బహుమతుల మొత్తం విలువ రూ.5,000 మించి పోతే, ఆ మొత్తం ఉద్యోగి వార్షిక ఆదాయంలో భాగంగా పరిగణిస్తారు. వీటిని ‘పెర్క్’ (perquisite) గా లెక్కిస్తారు. ఉదాహరణకు.. రూ.10,000 విలువైన ల్యాప్‌టాప్ బహుమతిగా లభిస్తే మొత్తం రూ.10,000 ఆదాయంలోకి జోడించాలి. రూ.7,000 విలువ గల వోచర్ వచ్చినా మొత్తం వాల్యూ పన్ను పరిధిలోకి వస్తుంది.
దీపావళి క్యాష్ బోనస్
దీపావళి సందర్భంగా క్యాష్ బోనస్లపై (Diwali bonus) కూడా ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. దీన్ని కూడా ఉద్యోగి జీతంలో భాగంగానే పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు దీపావళి రోజున రూ.30,000 బోనస్ అందుకుంటే, దీన్ని మీ వార్షిక జీతానికి జోడిస్తారు. తద్వారా, మీరు ఉన్న ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ఐటీఆర్ ఫైలింగ్‌లో జాగ్రత్తలు
రూ.5,000 కంటే ఎక్కువ విలువ ఉన్న బహుమతులను ఐటీఆర్‌లో తప్పనిసరిగా చేర్చాలి. లేని పక్షంలో, ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. సంస్థలు ఇచ్చే ఫార్మ్ 16లో ఈ వివరాలు ఉండవచ్చు. కానీ మీరు కూడా చెక్ చేయడం మంచిది.
ఇదీ చదవండి: దీపావళి ఇన్సూరెన్స్ రూ.5 లకే..