పచ్చబొట్టు.. పెద్ద ముప్పు

Illness And New Disease With Tattoos - Sakshi

 ట్యాటూలతో ప్రాణాంతక అంటువ్యాధుల ప్రమాదం  

నగరంలో ట్యాటూలపై క్రేజ్‌

బనశంకరి: అందం, ఆకర్షణీయతను పెంచుకోవడం కోసమంటూ నేటి యువత ట్యాటూ (పచ్చబొట్ల) వెంట పరిగెడుతున్నారు. మధ్యవయస్కులు కూడా ఇందుకు మినహాయింపు కాదనాలి. చేతులు, కాళ్లు, భుజాలు, మెడ.. ఇలా ఎక్కడంటే అక్కడ రంగురంగుల పచ్చబొట్లను వేయించుకుని మురిసిపోతున్నారు. అయితే దాని వెనుక తీవ్రమైన అనారోగ్యాలు దాగి ఉన్నాయనేది ఎంతమందికి తెలుసు? బెంగళూరులో ఈ తరహా కేసులు ఇటీవలికాలంలో పెరుగుతూ వస్తున్నాయి. పచ్చబొట్టు ద్వారా జీవితానికే ప్రమాదం కొనితెచ్చుకోవడం గురించి అప్రమత్తంగా ఉండాలి. పచ్చబొట్లు వేసే సూదుల వల్ల ప్రాణాంతక హెపటైటీస్‌– బీ, సీ కాలేయ జబ్బులు వస్తాయని చాలామందికి తెలీదు. ఒకరికి వాడిన షేవింగ్‌ బ్లేడ్‌ను ఇతరులకూ వినియోగిస్తే ఎలాంటి జబ్బులు వస్తాయో, పచ్చబొట్టులోనూ అలాంటి ప్రమాదాలే పొంచి ఉన్నాయి. 

కేప్‌టౌన్‌ వర్సిటీ సర్వే హెచ్చరికలు  దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ యూనివర్శిటి నిర్వహించిన పరిశోధల ప్రకారం శుభ్రంచేయని బ్లేడ్లు, పచ్చబొట్టు సూదుల ద్వారా హెపటైటిస్‌ వైరస్‌ సోకవచ్చు. అలసత్వం వహిస్తే రక్తంలో ఇన్‌ఫెక్సన్‌ చేరి మరణం వరకూ వెళ్లే ప్రమాదముందని నివేదికలో హెచ్చరించారు. ఇటీవల నగర యూత్‌లో క్లీన్‌షేవ్, ట్యాటూ క్రేజ్‌ పెచ్చుమీరుతుంది. ఈ సమయాల్లో బ్లేడ్లు, ట్యాటూ సూదుల్ని ఒకరికంటే ఎక్కువమందికి వినియోగిస్తే రకరకాల జబ్బులు సోకే ముప్పు లేకపోలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో 60 లక్షల నుంచి 1.20 కోటి మంది ప్రజలు హెపటైటిస్‌ బీ, సీ జబ్బుల బారినపడ్డారని తెలిపింది. హైపటైటిస్‌ వైరస్‌ శరీరంలో చేరినా చాలాకాలం వరకు దాని ప్రభావం గుర్తించలేరు. కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. చికిత్స పొందడంలో విఫలమైతే క్యాన్సర్‌గా మారే ప్రమాదముందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రోగ లక్షణాలు ఇవీ  
మోకాళ్ల నొప్పులు, నలుపురంగులో మూత్ర విసర్జన, జ్వరం, కీళ్లనొప్పులు, ఆకలి మందగించడం, శక్తిహీనత, చర్మ సమస్యలు వంటివి హెపటైటిస్‌  రోగ లక్షణాలుగా ఉంటాయి. షేవింగ్, ట్యాటూ, చెవులు కుట్టినప్పుడు వినియోగించే సూది, బ్లేడ్‌ ఇతర సాధనాలను ఒకరికి వాడాలి. ప్రతిసారి కొత్తవాటిని ఉపయోగించాలి. వేసేవారు పరికరాలను, చేతులను క్రిమినాశకాలతో శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ఈసారి పచ్చబొట్టు వేయించుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top