1952లో మొట్టమొదటిసారిగా లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఢిల్లీలో మొత్తం నాలుగు పార్లమెంట్ స్థానాలు ఉండేవి.
న్యూఢిల్లీ : 1952లో మొట్టమొదటిసారిగా లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఢిల్లీలో మొత్తం నాలుగు పార్లమెంట్ స్థానాలు ఉండేవి. ఆ సంఖ్య ప్రస్తుతం ఏడుకు చేరుకుంది. ట్రాన్స్ యమునా ప్రాంతమంతా ఔటర్ ఢిల్లీ నియోజకవర్గం పరిధిలో ఉండేది. ఔటర్ ఢిల్లీ ఓటర్లు రెండు ఓట్లు వేసేవారు.
ఒకటి జనరల్ సీటు కోసం కాగా మరొకటి రిజర్వ్‌డ్ స్థానంకోసం ఓటు వేసేవారు. ఆ తరువాత ఎన్నికల్లో రిజర్వ్‌డ్ స్థానానికి కరోల్‌బాగ్ పేరు పెట్టారు. 1952లో ఔటర్ ఢిల్లీ కాకుండా న్యూఢిల్లీ, ఢిల్లీ షెహర్ నియోజకవర్గాలు ఉండేవి. 1952 ఎన్నికలలో నాలుగు స్థానాలలో మూడింటిని కాంగ్రెస్, ఒక్క స్థానాన్ని కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీలు గెలుచుకున్నాయి. అప్పట్లో భారతీయ జన్‌సంఘ్‌గా అందరికీ పరిచయమైన బీజేపీకి ఒక్క సీటుకూడా దక్కలేదు. ఔటర్ ఢిల్లీ జనరల్, రిజర్వ్‌డ్, ఢిల్లీ షెహర్ సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. ఔటర్ డిల్లీ రిజర్వ్‌డ్ సీటు నుంచి కె.సి. కృష్ణనాయర్, జనరల్ సీటు నుంచి నవల్ ప్రభాకర్, హెహర్ సీటు నుంచి రాధారమణ్ గెలిచారు, న్యూఢిల్లీ సీటు టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ మోహినీ సెహగల్‌కు ఇచ్చింది.
ఇది నచ్చని ఆ పార్టీకి చెందిన పలువురు కెఎంపీపీ నుంచి పోటీచేసిన సుచేతా కృపలానీకి మద్దతు ఇచ్చారు .దీంతో ఆమె న్యూఢి ల్లీ సీటు నుంచి గెలిచారు. ఆ తరువాత సుచేతా కృపలానీ కాంగ్రెస్‌లో చేరి ఉత్తరప్రదేశ్‌ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాటి ఎన్నికల్లో శరణార్థులకు పునరావాస కల్పన ప్రధాన అంశమయ్యింది. దేశానికి స్వాం తంత్య్రం తీసుకొచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ శరణార్థులకు పునరావాసం కల్పిస్తాననే హామీ ఇచ్చి తద్వారా ఓటర్ల మనసును గెలుచుకుంది.
ఎన్నికల ప్రచారం కోసం అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఢిల్లీ మొత్తం జీపులో కలియదిరిగారని చెబుతారు జీపులో నెహ్రూ వెళ్లిన ప్రతిచోటా ప్రజలు రహదారులకు ఇరువైపులా నిలబడి ఆయనకు అభివందనం చేసేవారని అంటారు. ఇందిరాగాంధీ కొన్ని సభల్లో ప్రసంగించారని, సరాయ్ రోహిల్లాలో జరిగిన ఎన్నికల సభకు భారీఎత్తున జనం హాజరయ్యారని చెబుతారు.