సకాలంలో ప్రాజెక్టుల పూర్తి | Finish Delhi projects on time: Lt. Governor Najeeb Jung | Sakshi
Sakshi News home page

సకాలంలో ప్రాజెక్టుల పూర్తి

Aug 7 2014 12:07 AM | Updated on Sep 2 2017 11:28 AM

సకాలంలో ప్రాజెక్టుల పూర్తి

సకాలంలో ప్రాజెక్టుల పూర్తి

ఢిల్లీ బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయాలని ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయాలని ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలతో జంగ్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాలకు సంబంధించి బడ్జెట్‌లో ప్రతిపాదించిన అన్ని పనులను సకాలంలో పూర్తిచేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరానికి గాను రోహిణి మెడికల్ కళాశాలకు సంబంధించి చేపట్టిన పనులపై ఆరోగ్య కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు.
 
 కళాశాలకు కావాల్సిన మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాలపై ఆరా తీశారు. అలాగే కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు తగిన కనీస సదుపాయాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని విద్యా శాఖ అధికారులను హెచ్చరించారు. ఆయా పాఠశాలల్లో ప్రత్యేకంగా మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్ల ఏర్పాటుపై ఆరా తీశారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లోని ఉర్దూ, పంజాబీ, సంస్కృతం బోధిస్తున్న పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేకంగా సీనియర్ సెకండరీ పాఠశాలలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అంతేకాక అయా విభాగాలు చేపట్టిన పనులపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని ఆయన సూచించారు.
 
 చిట్ చలాన్ కేసులు మూడు జోన్లకు బదిలీ
 చిట్ చలాన్ కేసులను తన పరిధిలోని మూడు జోన్లకు బదిలీ చేయాలని  దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. పశ్చిమ మున్సిపల్ జోన్ కిందకు వచ్చే చిట్ చలాన్ కేసులను రోహిణీ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, వెస్ట్ తీస్ హజారీ కోర్టుకు బదిలీ చేయనున్నట్లు ఎస్‌డీఎంసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇదే విధంగా దక్షిణ, మధ్య ఢిల్లీ మున్సిపల్ జోన్లకు సంబంధించిన చలాన్ కేసులు ద్వారకా మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు పరిధిలోకి వచ్చేవని,  ఇప్పుడు సదరు కేసులను వరుసగా దక్షిణ,
 
 ఆగ్నేయ సాకేత్ ప్రాంతాల్లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్(ట్రాఫిక్) కోర్టులకు బదిలీ చేయనున్నట్లు ఆయన వివరించారు.  ఎస్‌డీఎంసీకి చెందిన చిట్ చలాన్ కేసుల బదిలీ ప్రతిపాదనకు ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తులందరూ ఆమోదించారని ఆయన వివరించారు. ఈ కేసుల బదిలీ వల్ల పౌరులకు గొప్ప ఊరట కలుగుతుందని తాము భావిస్తున్నామని ఎస్‌డీఎంసీ కమిషనర్ మనీష్ గుప్తా తెలిపారు. ఈ చర్య వల్ల తమ చలానాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడివారు అక్కడ చెల్లించుకునేందుకు వీలు పడుతుందని ఆయన  అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement