వీధి కుక్కల తరలింపుపై కీలక తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు | SC Big Verdict On Capture And Relocation Of Stray Dogs In Delhi NCR Updates, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

వీధి కుక్కల తరలింపుపై కీలక తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు

Aug 22 2025 9:20 AM | Updated on Aug 22 2025 12:12 PM

SC Big Verdict on Capture and relocation of stray dogs in Delhi NCR Updates

వీధికుక్కల🐕 తరలింపు విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ నెల 11వ తేదీన ద్విసభ్య ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలను.. విస్తృత ధర్మాసనం సవరించింది. వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్‌లలో ఉంచరాదని.. కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్‌లో ఉంచాలని స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.ఈ క్రమంలో.. ఈ సమస్య పరిధిని జాతీయ స్థాయికి విస్తరించే ఉద్దేశంతో అన్నిరాష్ట్రాల సీఎస్‌లకూ నోటీసులు జారీ చేసింది.

ఢిల్లీ ఎన్‌సీఆర్‌ వీధుల్లోని వీధి కుక్కలను పట్టుకుని ప్రత్యేక ఆవాసాలకు తరలించాలంటూ అధికారులకు సుప్రీం కోర్టు ఇదివరకే ఆదేశించిన సంగతి తెలిసిందే. జంతు ప్రేమికులు, ప్రముఖులు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో.. ఆ ఆదేశాలను పునఃసమీక్షించిన జస్టిస్‌ విక్రమ్ నాథ్, జస్టిస్‌ సందీప్ మెహతా, జస్టిస్‌ ఎన్వీ అంజారియాలతో కూడిన విస్తృత ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది. ఆ మధ్యంతర ఆదేశాల్లో..

👉 వీధి కుక్కలన్నింటిని షెల్టర్‌లలో ఉంచాల్సిన అవసరం లేదు
👉 కరిచే కుక్కలు, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను మాత్రమే షెల్టర్‌లలో ఉంచాలి
👉 బయటకు వదిలే ముందు వీధి కుక్కలకు వ్యాక్సినేషన్‌, స్టెరిలైజ్‌ తప్పక చేయాలి
👉వీధుల్లో కుక్కలకు ప్రజలు ఆహారం పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడదు
👉 ప్రతి మున్సిపల్ వార్డులో ప్రత్యేకంగా ఫీడింగ్ జోన్‌లు ఏర్పాటు చేయాలి
👉 బహిరంగంగా ఆహారం పెట్టినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
👉శునక ప్రియులు, ఎన్జీవోలు ఇందుకుగానూ 25వేల నుంచి 2 లక్షలు జమ చేయాలి
👉 అధికారుల పనికి ఎవరూ  ఆటంకాలు కలిగించొద్దు

🐕 సమస్య పరిధిని జాతీయ స్థాయికి విస్తరించాలని నిర్ణయించిన త్రిసభ్య ధర్మాసనం.. ఇలాంటి అన్ని కేసులను సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. తద్వారా ఒక తుది జాతీయ విధానం రూపొందించేందుకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడుతూ.. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. 

ఢిల్లీ ఎన్‌సీఆర్‌ రీజియన్‌ నుంచి వీధికుక్కలను 🐕 తరలించాలంటూ ఈ నెల 11వ తేదీన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక షెల్టర్లకు తరలించి వాటి బాగోగులు చూసుకోవాలని, అవి మళ్లీ జనావాసాల్లో కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించిది. అదే సమయంలో.. ప్రజల ప్రాణాలు పోతున్నాయని, జంతు హక్కుల పరిరక్షకులు.. జంతు ప్రేమికులు వీధి కుక్కల తరలింపును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని, వాళ్ల వాదనలు వినే ఉద్దేశం కూడా తమకు లేదని తీవ్ర వ్యాఖ్యలే చేసింది. దీంతో తీవ్ర దుమారం రేగింది. అయితే..

దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఆ తీర్పును పునఃసమీక్షిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ తెలిపారు. ఈలోపు ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఆగస్టు 14వ తేదీన విచారణ జరిపింది. ఇరువైపుల నుంచి పోటాపోటీ వాదనలే జరగ్గా.. తీర్పును బెంచ్‌ రిజర్వ్‌ చేసింది.

ఆగస్టు 11న.. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ బెంచ్‌ కోర్టు కీలక వ్యాఖ్యలు

⚖️వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న 🐕 ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి

⚖️కుక్కలను వెంటనే పట్టుకొని ప్రత్యేక షెల్టర్లకు తరలించాలి

⚖️అడ్డుపడే వ్యక్తులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటాం

⚖️జంతు ప్రేమికుల భావోద్వేగాలకు తావు లేదు.. ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం

గణాంకాల ప్రకారం.. 
2025 జనవరి–జూన్ మధ్యలో 35,198 కుక్కకాటు ఘటనలు, 49 రేబిస్ కేసులు నమోదయ్యాయి. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు పైతీర్పును వెల్లడించింది.

ఆగస్టు 11న.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజరియా లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం..  

⚖️పార్లమెంట్ చట్టాలు చేస్తుంది.. నిబంధనలు రూపొందిస్తుంది.

⚖️కానీ, అధికారుల బాధ్యాతారాహిత్యం వల్ల క్షేత్ర స్థాయిలో అవి అమలు కావడం లేదు.

⚖️Animal Birth Control (ABC) నిబంధనలను అధికారులు సక్రమంగా అమలు చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు

⚖️ఓ మనుషులు పడుతున్న బాధ.. మరోవైపు జంతు ప్రేమికుల ఆందోళన.. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement