కుమార్తె వివాహాన్ని అడ్డుకున్న తండ్రి

చెన్నై,టీ.నగర్: వధువుకు కన్యాశుల్కం కింద ఇల్లు ఇవ్వనందున వధువు కుటుంబీకులు వివాహాన్ని నిలిపినట్లు వరుడి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ వివరాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. తిరువారూరు జిల్లా మన్నార్‌గుడి సమీపంలోని మూవానల్లూరు గ్రామానికి చెందిన ధనుస్సు కుమారుడు అరుళ్‌మణికంఠన్ (32) సింగపూర్‌లో పనిచేస్తున్నాడు. ఇతనికి తిరుచ్చి పుత్తూరుకళత్తుమేడు ప్రాంతానికి చెందిన నటరాజన్ కుమార్తెకు జూలై 15న ఇరు కుటుంబాల సమ్మతంతో వివాహ నిశ్ఛితార్థం జరిగింది.
ఈ నెల ఒకటో తేదీ మన్నార్‌గుడి రాజగోపాల స్వామి ఆలయం వివాహ మండపంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. ఇలావుండగా హఠాత్తుగా వివాహాన్ని వధువు ఇంటివారు నిలిపేసినట్లు సమాచారం. దీంతో ఒకటో తేదీ వివాహం జరగలేదు. వధువు తండ్రి నటరాజన్ తన కుమార్తె పేరుతో రూ.65 లక్షలతో తిరుచ్చిలో ఇల్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేస్తేనే వివాహం జరుగుతుందని ఖరాఖండిగా తెలిపారు. దీనిపై ఇరు కుటుంబాలు మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. సాధారణంగా వరుడి ఇంటివారు వధువు కుటుంబాన్ని వరకట్నం కోసం డిమాండ్ చేస్తారు. ఇది కాస్తా రివర్స్ అయింది. ఈ వినూత్న సంఘటన అక్కడ సంచలనం కలిగించింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి