యాక్సిస్‌కు దూరమైన ‘అమృత’ ఘడియలు!

Fadnavis Wife Fights on Twitter, Axis Bank Loses Thane Civic Body Accounts - Sakshi

థానే: యాక్సిస్‌ బ్యాంక్‌లో సీనియర్‌ అధికారిణి అయిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ భార్య అమృతకు, శివసేన డిప్యూటీ నేత ప్రియాంక చతుర్వేదికి మధ్య ట్విటర్‌ వేదికగా గొడవ తలెత్తడంతో యాక్సిస్‌ బ్యాంక్‌కు తలనొప్పి తెస్తోంది. ఏడాదికి రూ.11వేల కోట్ల లావాదేవీలుండే మహారాష్ట్ర పోలీసు విభాగం తన వేతన ఖాతాలను వేరే బ్యాంక్‌కు మార్చనుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు తాజాగా శివసేన చేతుల్లోని థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ సైతం తన ఉద్యోగుల వేతన ఖాతాలను యాక్సిస్‌ నుంచి మరో బ్యాంక్‌కు మార్చాలని నిర్ణయించుకుంది. ‘నా పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదు’ అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేను అమృత విమర్శించడంతో వివాదం ముదిరింది.

తన పేరు వెనుక ఠాక్రే ఇంటి పేరు తగిలించుకున్న వ్యక్తి విలువలకు తిలోదకాలు ఇచ్చి సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేశారంటూ పరోక్షంగా ఉద్ధవ్‌పై విమర్శలు చేశారు అమృత. దీనికి ప్రియాంక సమాధానం ఇస్తూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలలోపే రైతు రుణాలు మాఫీ చేశారని, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఉద్ధవ్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. అంతకుముందు కూడా అమృత, ప్రియాంకల మధ్య ట్విటర్‌ వార్‌ జరిగింది.

బాల్‌ ఠాక్రే మెమొరియల్‌ కోసం ఔరంగాబాద్‌లోని ప్రియదర్శిని పార్క్‌లో వెయ్యి చెట్లను నేలమట్టం చేయనున్నారని వార్తలు వచ్చినప్పడు శివసేన పార్టీని విమర్శిస్తూ అమృత ట్వీట్‌ చేశారు. ఆరే ప్రాంతంలో చెట్ల కూల్చివేతను వ్యతిరేకించిన శివసేన.. ఔరంగాబాద్‌లో చెట్ల నరికివేతకు పూనుకోవడాన్ని విమర్శిస్తూ.. ‘సంకుచిత్వం అనేది వ్యాధి లాంటిద’ని అమృత పేర్కొన్నారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘ఒక్క చెట్టు కూడా కొట్టేయడం లేదని ఔరంగాబాద్‌ మేయర్‌ ధ్రువీకరించారు. పదేపదే అబద్ధాలాడటం పెద్ద రోగం. ఈ వ్యాధి నుంచి త్వరగా కోలువాల’ని ట్వీట్‌ చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top