ఎన్నికల ప్రచార గడువు ముగిసేందుకు సమయం దగ్గరపడుతుండడంతో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ జోరు పెంచారు. వరుస సభలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆరు ఎన్నికల ర్యాలీలకు హాజరైన షీలా దీక్షిత్
Dec 2 2013 12:52 AM | Updated on Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార గడువు ముగిసేందుకు సమయం దగ్గరపడుతుండడంతో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ జోరు పెంచారు. వరుస సభలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలోతన 15 ఏళ్ల ప్రభుత్వ పనితీరునే ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. మరోమారు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపుతామని చెబుతున్నారు. ఇతర పార్టీలు ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యం కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం మొత్తం ఆరుచోట్ల బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు. ఓక్లా, బురాడీ, సదర్‌బజార్, మోతీనగర్, మోడల్‌టౌన్ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఢిల్లీలోని ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ ఫలితంగా లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారని ఆమె గుర్తు చేశారు. అనధికారకాలనీల అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలకు రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 895 కాలనీలను క్రమబద్ధీకరించడంతో 40 లక్షల మందికి లబ్ధి కలిగిందని ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పుడు ఆ ఫలాలను పేదలు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అనధికారిక కాలనీలు క్రమబద్ధీకరణను కొనసాగిస్తామని షీలా దీక్షిత్ స్పష్టీకరించారు. తనకు రాజకీయాలకంటే అభివృద్ధి ముఖ్యమన్నారు.
Advertisement
Advertisement