తమ ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో రాజకీయ లబ్ధి పొందవచ్చన్న వారికి కాంగ్రెస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే సమాధానమిస్తాయని
అభివృద్ధే అన్నీ చెబుతుంది
Nov 26 2013 1:10 AM | Updated on Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో రాజకీయ లబ్ధి పొందవచ్చన్న వారికి కాంగ్రెస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే సమాధానమిస్తాయని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరైనవి అయితే నిజాలు బయటపెట్టాలని సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి సోమవారం పలు బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఆయానగర్, మెహ్రోలీ, ఛత్తర్‌పూర్, దేవ్లీ, సంగంవిహార్, తుగ్లకాబాద్, బదర్‌పురా, ఓక్లా నియోజవర్గాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. మరోమారు తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు మొత్తం 895 అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరించినట్టు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అనధికారిక కాలనీల్లోని ప్రజల సంక్షేమానికి ఒక్క పైసా సైతం ఖర్చు చేయలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 45 పునరావాస కాలనీలవాసులకు యాజమాన్య హక్కులు కల్పించిందని షీలా వివరించారు. దీంతో దాదాపు 50 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను మరోమారు అధికారంలోకి తీసుకువస్తాయని షీలాదీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement