అటు కోలాహలం.. ఇటు నైరాశ్యం | Delhi polls: Atmosphere of gloom at Sheila Dikshit's residence | Sakshi
Sakshi News home page

అటు కోలాహలం.. ఇటు నైరాశ్యం

Dec 9 2013 12:06 AM | Updated on Apr 4 2018 7:42 PM

ఆదివారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ, ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. ఆయా పార్టీల నాయకులు,

సాక్షి, న్యూఢిల్లీ: ఆదివారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ, ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఘోరంగా ఓడిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి.
 
 బాణసంచా కాలుస్తూ సంబరాలు..
 ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు వార్తలు వెలువడుతుండడంతో ఒక్కరొక్కరుగా బీజేపీ కార్యకర్తలంతా అశోకారోడ్డు లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఫలితాలు వస్తున్న కొద్దీ కోలాహలం పెరుగుతూ వచ్చింది. డప్పు చప్పుళ్ల మధ్య నత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. బాణసంచా కాలుస్తూ సంతోషంగా గడిపారు. వచ్చిపోయే నేతలకు శుభాకాంక్షలు చెబుతూ బీజేపీ కార్యకర్తలు సందడి చేశారు. బీజేపీకి అనుకూల ఫలితాలు వెలువడడంతో కేంద్ర బీజేపీ కార్యాలయం వద్ద మీడియా కోలాహలం మరింత పెరిగింది. విజయాన్ని అందరితో పంచుకునేందుకు కేంద్ర కార్యాలయానికి వచ్చిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ రాకతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. బీజేపీ సీఎం అభ్యర్థి డా.హర్షవర్ధన్, బీజేపీ సీనియర్ నాయకులతోపాటు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ సైతం సంబరాల్లో పాల్గొన్నారు.
 
 చీపుర్లు చూపుతూ నృత్యాలు..
 ఆమ్‌ఆద్మీ పార్టీ అనూహ్య విజయం ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. పార్టీ ఎన్నికల గుర్తు అయిన చీపుళ్లను పెకైత్తి చూపుతూ హనుమాన్‌రోడ్డులోని పార్టీ కార్యాలయం ఎదుట నృత్యాలు చేశారు. వందల సంఖ్యలో యువత ఆమ్‌ఆద్మీ పార్టీ టోపీలు ధరించి అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా అక్కడే గడిపారు. పార్టీ ఫలితాలు తెలుసుకుంటూ కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. షీలాదీక్షిత్‌పై కేజ్రీవాల్ వేల మెజార్టీతో ఉన్నారని చెప్పిన ప్రతిమారు చప్పట్లు, కేకలతో ఆనందం వ్యక్తం చేశారు. 25 వేల పైన ఓట్లతో కే జ్రీవాల్ గెలుపొందడంతోపాటు మొత్తం 28 స్థానాలు ఆప్ గెలుచుకోవడంపై ఆ పార్టీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. 
 
 నిర్మానుష్యంగా కాంగ్రెస్ కార్యాలయాలు
 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడం మొదలైన గంట నుంచే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, డీడీయూ మార్గ్‌లోని డీపీసీసీ కార్యాలయం, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నివాస పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. 2008లో 43 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం ఏడు స్థానాలకే  పరిమితం కావడంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు పనిచేసిన షీలాదీక్షిత్ సైతం ఓటమి పాలుకావడం పార్టీ శ్రేణులకు మింగుడు పడటంలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement