
పట్నా: బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోమవారం నాడు బీహార్ ఎన్నికల్లో పోటీచేసే 11 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ‘ఆప్’ గత జూలైలో ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ, బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ఆప్’ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా బీహార్ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ధృవీకరించారు. బీహార్ ఎన్నికల్లో పోటీచేయబోయే 11 మంది అభ్యర్థుల జాబితా..
డాక్టర్ మీరా సింగ్ - బెగుసరాయ్ (బెగుసరాయ్)
యోగి చౌపాల్ - కుశేశ్వరస్థాన్ (దర్భంగా)
అమిత్ కుమార్ సింగ్ - తారయ్య (సరణ్)
భాను భారతీయ - కస్బా (పూర్ణియ)
శుభదా యాదవ్ – బేనిపట్టి (మధుబని)
అరుణ్ కుమార్ రజక్ - ఫుల్వారీ షరీఫ్ (పట్నా)
డాక్టర్ పంకజ్ కుమార్ - బంకీపూర్ (పట్నా)
అష్రఫ్ ఆలం - కిషన్‌గంజ్ (కిషన్‌గంజ్)
అఖిలేష్ నారాయణ్ ఠాకూర్ - పరిహార్ (సీతామర్హి)
అశోక్ కుమార్ సింగ్ - గోవింద్‌గంజ్ (మోతిహారి)
మాజీ కెప్టెన్ ధరమ్‌రాజ్ సింగ్ - బక్సర్ (బక్సర్)
2020 బీహార్ ఎన్నికల ఫలితాలు ఇలా..
మునుపటి(2020) బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. మొదటి దశ అక్టోబర్ 28, రెండవ దశ నవంబర్ 3, మూడవ దశ నవంబర్ 7. ఫలితాలు నవంబర్ 10 న ప్రకటించారు. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) వెల్లడించిన వివరాల ప్రకారం, 2020 బీహార్ ఎన్నికల్లో మొత్తం పోలింగ్ శాతం 57.05గా ఉంది. మొదటి దశలో 55.68 శాతం, రెండవ దశలో 55.70 శాతం మూడవ దశలో 59.94 శాతం నమోదయ్యాయి. నాటి బీహార్ ఎన్నికల్లో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్ డీఏ) 125 సీట్లను గెలుచుకుని విజయం సాధించింది. రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలోని మహా కూటమి 110 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది.