ప్రభుత్వ ఏర్పాటుకు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్సీపీ చేసిన ప్రకటనపై సామ్నా సంపాదకీయంలో శివసేన ఘాటుగా స్పందించింది.
ఎన్సీపీ మద్దతు ప్రకటనపై సామ్నాలో శివసేన
సాక్షి, ముంబై: ప్రభుత్వ ఏర్పాటుకు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్సీపీ చేసిన ప్రకటనపై సామ్నా సంపాదకీయంలో శివసేన ఘాటుగా స్పందించింది. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బీజేపీ వైఖరిని దుయ్యబట్టిన ఆ పార్టీఅధ్యక్షుడు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, ఇతర నాయకులకు అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించింది. బహుశా అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఈ మద్దతు నాటకానికి తెరలేపి ఉండొచ్చని ఆరోపించింది.
మతతత్వ పార్టీగా సంబోధించిన ఎన్సీపీ నాయకులతోఎలా చేయి కలుపుతారంటూ బీజేపీ నిలదీసింది.. ‘ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రచార సభల్లో బాబాయ్-అబ్బాయ్‌లు కలిసి రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో వెల్లడించారు. అది నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ కాదని ‘నేచురల్ కరప్ట్ పార్టీ’ అంటూ ఎద్దేవా కూడా చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి ఎన్సీపీ, కాంగ్రెస్ మంత్రులను కటకటాల వెనక్కి తోస్తామని వినోద్ తావ్డే పేర్కొన్నారు. ఇంత జరిగాక కూడా బీజేపీ ఎదుట ఎన్సీపీ ఎందుకు తలవంచుతుందనే విషయాన్ని ఆలోచించాల్సిన అవరముందని పేర్కొంది.