దివంగత నాయకుడు బాల్‌ఠాక్రే విగ్రహాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కనిపించనున్నాయి.
అన్ని ప్రాంతాల్లోనూ ఠాక్రే విగ్రహాలు
Aug 11 2013 12:09 AM | Updated on Sep 1 2017 9:46 PM
సాక్షి, ముంబై: దివంగత నాయకుడు బాల్‌ఠాక్రే విగ్రహాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కనిపించనున్నాయి. వీధుల్లో కాకపోయినా శివసేన కార్యాలయాలన్నింటిలోనూ స్థాపించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికపై పనులు కొనసాగుతున్నట్టు సమాచారం. శివసేన ఎంపీ అనీల్ దేశాయి ముంబైలో శుక్రవారం జరిగిన ‘మార్మిక్’ వారపత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరికొన్ని నెలల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ విగ్రహాలు ఓటర్లపై కొంతమేరకైనా ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత నాలుగు దశాబ్దాలుగా మహారాష్ట్ర ప్రజల మనసులపై చెరగని ముద్రవేసిన బాల్‌ఠాక్రే హిందూ హృదయ సామ్రాట్‌గానూ గుర్తింపు పొందారు. శివసేన కార్యకర్తలతోపాటు పార్టీలకతీతంగా రాష్ట్రంలోని చాలా మంది నాయకులు కూడా ఆయన్ను అభిమానిస్తారు. కనుసైగలతోనే ఠాక్రే అందరినీ శాసించేవారని అనుచరులు చెబుతారు. ఆయన ప్రసంగాల నుంచి వచ్చే వాగ్భాణాలు ప్రత్యర్థుల గుండెల్లోకి చొచ్చుకుపోయేవని శివసేన సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. అందుకే ఠాక్రే వారసత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలనూ శివసేన తీసుకుంటోంది. విగ్రహాలు అంతటా ప్రతిష్ఠిస్తే కార్యకర్తలకు మరింత గౌరవంతోపాటు పార్టీ బలోపేతమవుతోందని సేన నాయకత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు శివసేన శాఖల్లో కేవలం ఛత్రపతిశివాజీ మహారాజు విగ్రహాలు ఉండేవి. ఇక నుంచి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం పక్కనే బాల్‌ఠాక్రే విగ్రహాలు కూడా దర్శనమివ్వనున్నాయి.
Advertisement
Advertisement