ఇద్దరు ప్రియురాళ్లను ఒకేసారి పెళ్లాడాడు..

Auto Driver Married Two Women At A Same Time In Tamilnadu - Sakshi

ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆ ఆటోడ్రైవర్‌ 14 అడుగులు నడిచి పెళ్లి చేసుకున్నాడు. అవును నిజంగా నిజం. అతడు ఏకకాలంలో ఇద్దరు యువతులను పెళ్లాడాడు మరి. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపూరు జిల్లా ధారాపురానికి చెందిన 19 ఏళ్ల యువతి గతనెల 29వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. సదరు యువతి పళని బస్‌స్టేషన్‌లో ఒక యువకుడితో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం వారిని పట్టుకున్నారు. అయితే అక్కడ వారిద్దరితోపాటూ ఉన్న మరో యువతి తనను కూడా తీసుకెళ్లమని పట్టుబట్టడంతో ముగ్గురిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ యువకుడు ధారాపురం పుదుకోట్టైమేడుకు చెందిన ఆటోడ్రైవర్‌ (26) కాగా, ఇద్దరు యువతులు సైతం అదే ప్రాంతానికి చెందినవారుగా తెలుసుకున్నారు.

ముక్కోణపు ప్రేమకథ
అవివాహితుడైన ఆటోడ్రైవర్‌కు భర్తకు దూరమై వేరుగా కాపురం ఉంటున్న 25 ఏళ్ల యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అలాగే అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతితో కూడా అతను ప్రేమ వ్యవహారం నడిపాడు. కొద్దిరోజుల్లో ఆటోడ్రైవర్‌ బండారం ఇద్దరు యువతులకు తెలిసిపోవడంతో అతన్ని నిలదీశారు. దీంతో ఆటోడ్రైవర్‌ ఇద్దరినీ వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆటోడ్రైవర్‌ పన్నాగాన్ని పసిగట్టిన ఇద్దరు యువతులు కూడబలుక్కున్నారు. ఇద్దరూ ఏకకాలంలో అతడిని వివాహమాడాలని, కలిసి కాపురం చేయాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని అతడికి చెప్పడంతో ఆటోడ్రైవర్‌ సంతోషంతో ఎగిరి గంతేశాడు. ముగ్గురూ కలుసుకుని పెద్దలతో చెప్పకుండా ఇళ్లు వదిలి పళనికి పారిపోయారు. 

అక్కడి ఒక ఆలయంలో ఇద్దరు యువతుల మెడలో అతడు తాళి కట్టి పెళ్లాడాడు. పెళ్లి చేసుకొని పళని నుంచి కోయంబత్తూరు వెళ్లేందుకు బస్‌స్టేషన్‌లో నిల్చుని ఉండగా పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతుల కుటుంబీకులు లబోదిబోమంటూ ఆ పెళ్లికి నిరాకరించారు. యువతులకు ఎంతగా నచ్చజెప్పినా ఆటోడ్రైవర్‌తోనే కలిసి ఉంటామని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులు చేసేదిలేక ఇద్దరు పెళ్లాలతో ముద్దుల మొగుడిని సాగనంపారు.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top